అధికారికంగా విమోచనదినాన్ని నిర్వహిస్తాం

జాతీయ జెండాను ఎగురవేసిన కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17  : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమైనందున వచ్చే సంవత్సరం తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచనదినం పుసస్కరించుకుని మంగళవారం అసెంబ్లీ ఎదురుగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ విగ్రహం వద్ద పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్రమంత్రి సిహెచ్‌ విద్యాసాగర్‌రావు, పార్టీ సీనియర్‌ నేతలు కె.లక్ష్మణ్‌, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎం.కిషన్‌రావు, నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున బిజెపి కార్యకర్తలు హాజరయ్యారు. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వేడుకలు జరుపుకుంటే దేశంలో అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్‌ నవాబ్‌ నైజాం పాలనలో తెలంగాణకు చెందిన పది జిల్లాల ప్రజలు ఆయన ఏర్పరచిన రజాకార్ల నిరంకుశ సైనికుల చేతుల్లో హత్యలు, మానభంగాలకు గురయ్యారన్నారు. దీనిని సహించలేని తెలంగాణ ప్రజలు చేసిన తిరుగుబాటు ఫలితంగా అప్పటి కేంద్ర హోంమంత్రి నేతృత్వంలోని భారత సైన్యం నైజాం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 13 నెలల రెండు రోజులకు తెలంగాణ ప్రజలు నైజాం ప్రభుత్వ నిరంకుశ పాలన నుండి విముక్తులై స్వాతంత్య్రం పొందారన్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ ప్రజలు స్వాతంత్య్రదినంగా జరుపుకోవాలని వాజ్‌పేయ్‌ ప్రభుత్వం ఆదేశించగా, తెలంగాణ నుండి విడిపోయి పక్క రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రలలో కలిసిన జిల్లాల ప్రజలు విమోచనదినాన్ని అధికారికంగా జరుపుకుంటున్నప్పటికీ మన రాష్ట్రంలో జరుపకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డిలకు విజ్ఞప్తిచేస్తే తమ ప్రభుత్వం మిత్రపక్షంగా ఉన్న నైజాం వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న ఎంఐఎం విమోచదినాన్ని నిర్వహించకుండా అడ్డుకుంటుందని పేర్కొన్నారని, ఇది వారి దివాళాకోరునతానికి నిదర్శమన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమైనందున వచ్చే సంవత్సరం రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా, రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో జరుపుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు.

తాజావార్తలు