సీమాంధ్ర మీడియాది తప్పుడు ప్రచారం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై మొదటి నుంచి విషం చిమ్ముతున్న సీమాంధ్ర మీడియా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కూడా తన దుష్టబుద్ధిని మార్చుకోవడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు యూపీఏ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన నోట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. న్యాయశాఖ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి కేంద్రం రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో మంత్రివర్గ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. హోం శాఖ సిద్ధం చేసిన నోట్‌ మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని ప్రధానాంశాలుగా ఇప్పటి వరకూ విభజన ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో కీలకమైన 11 అంశాలపై రాష్ట్రంలోని గుర్తింపుపొందిన ఎనిమిది రాజకీయ పార్టీల అభిప్రాయాలు చెప్పాలని లేఖలు రాసింది. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం కేంద్ర మంత్రుల బృందానికి తమ అభిప్రాయాలు తెలుపగా, టీడీపీ, వైఎస్సార్‌ సీపీ, సీపీఎం ఎలాంటి వైఖరి చెప్పలేదు. వైఎస్సార్‌ సీపీ, సీపీఎం జీవోఎంను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించగా, టీడీపీ మాత్రం చివరి నిమిషం వరకూ ఏమీ తేల్చకుండా చివరికి ప్రధానికి లేఖ రాసింది. మూడు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే వరకూ ఆంధ్రప్రదేశ్‌ విభజన ఆపాలని కోరింది. తద్వారా టీడీపీ తన వైఖరి ఎప్పటికీ సమైక్యమే అని స్పష్టం చేసింది. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని, నదీ జలాల పంపిణీ, ఆర్టికల్‌ 371 (డి), భద్రత, హైదరాబాద్‌ తదితర అంశాలపై గుర్తింపు పొందిన పార్టీల అభిప్రాయం కోరితే తమది సమైక్యవాదం కాబట్టి స్పందించాల్సిన పనిలేదని వైఎస్సార్‌ సీపీ, సీపీఎం జీవోఎంను బహిష్కరిస్తున్నట్లు చెప్పాయి. టీడీపీ రెండు కళ్లు, రెండు కాళ్లు, రెండు చెవులు, ఇప్పుడు కొత్తగా ఇద్దరు బిడ్డల విధానంతో ఏమీ తేల్చకుండా ప్రధానికి లేఖరాసి తమ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. జీవోఎంకు లేఖలు పంపిన పార్టీల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ తెలంగాణ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలపగా, ఎంఐఎం హైదరాబాద్‌ తెలంగాణాకే దక్కాలని, ఉమ్మడి రాజధానికి ఒప్పుకోబోమని, తమ పార్టీ విధానం రాయల తెలంగాణ అని చెప్పింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాలతో జీవోఎంకు లేఖ పంపింది. తమ లేఖలకు బదుల్చిన ఐదు రాజకీయ పార్టీలకే ఈనెల 12న జరిగే సమావేశానికి మంత్రుల బృందం ఆహ్వానించింది. ఈమేరకు ఆయా పార్టీలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఫోన్లు చేసి సమాచారమిచ్చారు. ఈ సమావేశానికి పార్టీకి ఒక్క ప్రతినిధే హాజరైతే మంచిదని హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే అభిప్రాయపడ్డారు. తెలంగాణ నోట్‌ను కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదించిన తర్వాత కూడా సీమాంధ్ర మీడియా రాయల తెలంగాణ అంటూ బూటకపు ప్రచారంతో ఊదరగొడుతోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలో, జీవోఎంలోని సభ్యులతో స్వయంగా తమతో చెప్పినట్లు కథనాలు వండి వడ్డిస్తున్నాయి. రాయల తెలంగాణ డిమాండ్‌ను కేవలం ఎంఐఎం పార్టీ మాత్రమే చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అవుతుందని, అలాంటి పరిస్థితి తలెత్తితే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణ కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తారని ఓ మిడిమేలపు ప్రచారాన్ని మొదలు పెట్టింది. రాయల తెలంగాణను ఒక్క జేసీ దివాకర్‌రెడ్డి మినహా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏ రాజకీయ పార్టీ నేత కోరుకుంటున్నట్లు చెప్పలేదు. ఒకరిద్దరు ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌ చేసి ఉండవచ్చు కానీ రాయల తెలంగాణను మాత్రం కోరలేదు. రాయలసీమ ప్రజలెవరూ కూడా సీమాంధ్ర మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా రాయల తెలంగాణను కోరుకోవడం లేదు. తెలంగాణ ప్రజల భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు ఎలాగైతే ప్రత్యేకమైనవో రాయలసీమలోని నాలుగు జిల్లాల ప్రజలవీ విభన్నమైన ఆచార వ్యవహారాలు, సంప్రయాదాలూ. వారి యాస కూడా ప్రత్యేకమైనదే. హైదరాబాద్‌లేని తెలంగాణను ఇక్కడి ప్రజలు ఏ విధంగానైతే కోరుకోరో, రాయలసీమ విభజనను కూడా అక్కడి ప్రజలు అంగీకరించబోరు. వారి అస్తిత్వాన్ని కోల్పోవడానికి సీమ ప్రజలు సిద్ధంగా లేరు. నాలుగు జిల్లాలు సంఘటితంగా ఉంటే తప్ప కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజల నక్కజిత్తుల ముందు నిలువలమని సీమ ప్రజలు చెప్తుంటారు. సీమాంధ్ర ప్రజలు కోరుకోని, తెలంగాణ ప్రజలు అడగని రాయల తెలంగాణ డిమాండ్‌కు విస్తృత ప్రచారం కల్పించడం వెనుక సీమాంధ్ర మీడియాకున్న ఉద్దేశాలు సుస్పష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడం ఎలాగూ సాధ్యం కాదు, కనీసం తెలంగాణ ప్రజల్లో ఆందోళనలు సృష్టించి మరికొందరిని ఆత్మహత్యల వైపు పురిగొల్పాలని. 1969 తెలంగాణ సాధన ఉద్యమంలో 369 మంది తెలంగాణ యువతను రాజ్యం పొట్టనబెట్టుకుంటే. 2009 నుంచి ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా తెలంగాణ యువత, విద్యార్థులను సీమాంధ్ర మీడియా ఆత్మహత్యల వైపు ప్రేరేపించింది. తెలంగాణ ఏర్పాటు కష్ట సాధ్యమనే విష ప్రచారాన్ని పదే పదే ప్రసారం చేసి వారి బలవన్మరణానికి కారణమైంది సీమాంధ్ర మీడియా. ఇప్పుడు కూడా ప్రజలు కోరుకోని రాయల తెలంగాణ డిమాండ్‌కు ఊతమిస్తోంది. తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజలను గందరగోళ పరచాలని చూస్తోంది. ఆ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.