ముంచడానికే బదలాయింపు డిమాండ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్ తర్వాత సీమాంధ్రులు ఎక్కువగా కొర్రీలు పెడుతున్నది భద్రాచలంపైన. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి పూర్వం కొంతకాలం ఆంధ్రరాష్ట్రంలో ,అదివరకు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉందనే కారణం చూపుతూ ఇప్పుడు భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని కోరుతున్నారు. భద్రాచలం డివిజన్ ఎంతకాలం సీమాంధ్ర ప్రాంతంతో కలిపి ఉందనే విషయాన్ని పక్కనపెడితే అసలు వాళ్లు ఎందుకు భద్రాచలం రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారనేది ముఖ్యమైన అంశం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుంది కాబట్టి అది వరకు తమతో కలిసి ఉన్న భద్రాచలంపై ప్రేమతో సీమాంధ్రలో కలపాలని కోరుతున్నారనుకుంటే అంతకుమించిన అత్యాశ మరొకటి ఉండదు. భద్రాచలం డివిజన్‌లోని గిరిజనులపై ప్రేమ పెల్లుబికి సీమాంధ్రులు తమతో ఉండండి అంటూ స్నేహహస్తం చాచడం లేదు. భద్రాచలం డివిజన్‌ను పట్టుబట్టి సాధించుకుంటే అమాయక గిరిజనులను ఎంచక్కా ముంచేసి తాము మూడో పంటకు నీళ్లు తెచ్చుకోవాలనే కుట్రలో భాగంగానే భద్రాచలం కావాలని కోరుతున్నారు. ఇది గిరిజనులపై ప్రేమతోనో లేక అక్కడ కొలువైన రాముడిపై భక్తితోనో చేస్తున్నది కాదు. అమాయక గిరిజనులనే కాదు నిత్యం పూజలు చేసే రాముడిని ముంచేయాలనేది సీమాంధ్రుల పన్నాగం. అంతేకాదు పర్యాటక ప్రాంతాలైన పాపికొండలు, పేరంటాలపల్లిని చరిత్రలో కలిపేయాలని ,భారత ఆదిమ జాతుల్లో ఒకటైన కొండరెడ్ల తెగను పూర్తిగా కనుమరుగు చేయాలని కంకణం కట్టుకున్నారు. తద్వారా మన చరిత్రను ,మానవుడి పుట్టుకకు ఆధారమైన అడవులను అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. తమ స్వార్ధం ఒక అమాయక జాతిని అంతమొందించాలని చూస్తున్నారు. భద్రాచలంపై చారిత్రక వాస్తవాలను విస్మరించి సీమాంధ్రులు అసంభద్దమైన డిమాండ్లను ముందుకు తీసుకువస్తున్నారు. ఒక వేళ హైదరాబాద్ దక్కకుంటే భద్రాచలాన్నైనా దక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నారు. కేవలం పోలవరం నిర్మించుకోవడానికి మాత్రమే సీమాంధ్రులు తమకు భద్రాచలం కావాలని అడుగుతున్నారు. అసలు భద్రాచలానికి తెలంగాణ ప్రాంతంతో ఉన్న అనుభంధాన్ని విస్మరించి వారు అసంబధ్ద డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. భద్రాచలం 1324 వరకు కాకతీయుల ఏలుబడిలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానుల పాలనలోకి వెళ్లింది. అనంతరం గోల్కోండ నవాబులు భద్రాచలాన్ని పాలించారు. గోల్కోండను తానీషా పరిపాలించిన సమయంలో నేలకొండపల్లి తహశీల్దార్‌గా పనిచేసి కంచెర్ల గోపన్న (భక్తరామదాసు) భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. ప్రజల నుంచి వసూలుచేసిన శిస్తులతో ఆలయాన్ని నిర్మించి తానీషా ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాతి చరిత్ర అందరికి తెలిసిందే. అప్పటి నుంచి హైదరాబాద్ పాలకులు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు ,పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే సీతమ్మ మెడలో కట్టే మంగళసూత్రాల్లో మూడోది తానీషా ప్రభువు చేయించిందేనని చరిత్ర చెబుతోంది. నిజాం కాలంలో బ్రిటీష్ పాలకులతో ఒప్పందంలో భాగంగా గోదావరి జలాలను వినియోగంలోకి తెచ్చేందుకు భద్రాచలం ప్రాంతాన్ని బ్రిటీష్‌వారికి అప్పగించినా భద్రాచలం ఆయన నిర్వహనను మాత్రం తమ ఆదీనంలోనే ఉంచుకున్నారు. 1874లో భద్రాచలం డివిజన్‌ను మద్రాస్ ప్రెసిడెన్సీకి బదలాయించారు. 1947 వరకు ఈ డివిజన్ బ్రిటీష్‌వారి ఏలుబడిలోనే ఉంది. స్వాతంత్య్రం వచ్చాక 1953 వరకు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ,ఆంధ్రా రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రాలో ఉండేది. ఆంధ్రప్రధేశ్ ఏర్పడిన తర్వాత 1959 వరకు తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలం డివిజన్ ఉంది. జిల్లా కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరం, అదీ గోదావరి నది దాటి వెళ్లడానికి ప్రజలు కష్టాలు పడేవారు. ఈ నేపథ్యంలో 1959లో భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలో విలీనం చేశారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో ఎప్పుడో భద్రాచలంతో తమతో కలిసి ఉంది కాబట్టి తమకే కేటాయించాలని సీమాంధ్రులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ దీనిపై తలాతోక లేని ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనను నిరసిస్తూ భద్రాచలం ప్రాంత వాసులు తాము ఖమ్మం జిల్లాలోనే కొనసాగుతామంటూ ఆందోళనలు చేస్తున్నారు. భద్రాచలానికి బహుదూరంలో ఉన్న తూర్పు గోదావరిజిల్లాలో అది తమ స్వార్ధంకోసం విలీనం చేయాలనే డిమాండ్‌కు ఆంటోనీ నేతృత్వంలో పార్టీ కమిటీ ఆమోదం తెలపడం సీమాంధ్రుల లాబీయింగ్‌కు నిదర్శనం. హైదరాబాద్‌పై ఎంతటి అసంబద్దమైన డిమాండ్లు చేస్తున్నారో ,,భద్రాచలంపై కూడా అవే డిమాండ్లు వల్లెవేస్తున్నారు. పోలవరం నిర్మిస్తే 83 శాతం ముంపు ప్రాంతం భద్రాచలం డివిజన్‌లోనే ఉంటుంది. అలాగే పొరుగు రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి. 275 గ్రామాల్లోని 3 లక్షల మంది నిర్వాసితులవుతారు. వారిలో గిరిజనులే లక్షన్నర మందికిపైగా ఉంటారు. లక్ష ఎకరాల భూమి, 25 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ పూర్తిగా అంతమొందుతాయి. అలాగే సాదారణ ఎంతో విలువైన ,అరుదైన జీవజాతులు పూర్తిగా అంతమొందుతాయి. అలాగే సాధారణ రోజుల్లో భద్రాచలం వద్ద 15 అడుగులుగా ఉండే నీరు గోదావరి నీటిమట్టం పోలవరం నిర్మాణం తర్వాత 43 అడుగులకు చేరుతుందని నీటి పారుదల శాఖ అధికారులు నిర్ధారించారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక మట్టం 53 అడుగులు కాగా నిత్యం 43 అడుగుల నీరు ఇక్కడ నిల్వ ఉండే అవకాశముంది. భారీ వర్షాలు కురిస్తే రెండు గంటల్లో మూడోనంబర్ ప్రమాద హెచ్చరిక వద్దకు నీటిమట్టం ఎగబాకుతుంది. కేవలం రెండు గంటల వ్యవధిలో వందలాది గోదావరి పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సాధ్యమేనా? ఈ భూమికి భూమి ఇస్తామన్నా అడవిలో అమల్లో ఉండే గిరిజన చట్టాలు వారికి మైదాన ప్రాంతాల్లో ఎలా వర్తిస్తాయి? అడవిలో తప్ప మరెక్కడా బతకలేని గిరిజనులను రోడ్డున పడేసేందుకే సీమాంధ్రులు భద్రాచలాన్ని తమలో కలుపుకుంటామని చెప్తున్నారు.