అన్నీ తర్వాతే చూసుకుందాం
గో హెడ్
అన్నీ తర్వాతే చూసుకుందాం
ముందు తెలంగాణ ఏర్పాటు చేయండి
మేడంతో జీవోఎం కీలక సమావేశం
శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందే : సోనియా
న్యూఢిల్లీ, నవంబర్ 25 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందు పూర్తి చేయండి ఆ తర్వాతే మిగతా విషయాలన్నీ చూసుకుందాం అంటూ యూపీఏ చైర్‌పర్సన్ మంత్రుల బృందానికి సూచించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే కీలకాంశాలపై సంప్రదింపులు జరిపిన మంత్రుల బృందం సోమవారం తన నివేదికను సోనియాగాంధీకి సమర్పించింది. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే నేతృత్వంలోని మంత్రులు సోనియాతో భేటీ అయ్యారు. ఏకే ఆంటోనీ, జైరాం రమేశ్, చిదంబరం, అహ్మద్‌పటేల్ సమావేశంలో పాల్గొన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు, నేతల అభిప్రాయాలను పరిశీలించిన మంత్రుల బృందం వాటిని క్రోడీకరించి సోనియాకు నివేదించారు. వాటిని సావధానంగా విన్న సోనియా ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన బిల్లుకు త్వరగా తుదిరూపు ఇవ్వాలని స్పష్టం చేశారు. 27లోగా తెలంగాణ బిల్లు సిద్ధం చేసి కేంద్ర కేబినెట్ ముందుంచాలని, ఆ వెంటనే రాష్ట్రపతికి బిల్లు పంపాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం త్వరగా తీసుకొని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని ఆమె స్పష్టం చేశారు. ఆరు నూరైనా ఈ సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆమె మంత్రులకు తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ సహా సీమాంధ్ర ప్రాంత నేతలు చేస్తున్న అభ్యంతరాలను తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిశీలిద్దామన్నారు. సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగకుండా చూస్తామని సోనియా మంత్రులకు భరోసా ఇచ్చారు. ప్రజల డిమాండ్లు, నేతల డిమాండ్లు వేర్వేరని, ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి తీరుతామని అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి భారీ ప్యాకేజీ, కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని, అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త రాజధాని నగరాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల రక్షణ బాధ్యతను తనకు వదిలేయాలని సోనియాగాంధీ ఈ సందర్భంగా మంత్రులతో అన్నారు. ముసాయిదాను త్వరగా పూర్తిచేయాలని, న్యాయపరమైన చిక్కులేమైనా ఉంటే పూర్తిస్థాయి సంప్రదింపులు రేపట్లోగా పూర్తి చేయాలని అన్నారు.