ప్రజల హృదయాల్లో కాంగ్రెస్సే

అభివృద్ధి భాజపాకు చేతకాదు : సోనియా
శిఖర్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి) :
ప్రజల హృదయాల్లో కాంగ్రెస్‌ పార్టీ గూడుకట్టుకొని ఉందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. అభివృద్ధి చేయడం బీజేపీకి సాధ్యం కాదని ఆమె మండిపడ్డారు. రాజస్థాన్‌లో అభివృద్ధి జరగలేదంటూ భాజపా చేస్తున్న విమ్శలపై సోనియాగాంధి మండిపడ్డారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శిఖర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ భాజపా ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అన్నారు. భాజపా అధికారంలో ఉన్నప్పటికి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరేజు వేసుకోవాలని ఓటర్లకు సూచించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమిటి? ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ఉచితంగా మందులు పంపిణీ చేశారా? అభివృధ్ధి పథకాలు చేపట్టారా? అని సోనియా ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాలు నడుపుతున్న భాజపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. భాజపా ఎన్నటికీ ప్రజల హృదయాలను గెలుచుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం కోసం యూపీఏ ప్రభుత్వం ఆహారభద్రత, ఎంజీఎన్‌ ఆర్‌జీఎ లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో వెనుకబడిన రాష్ట్రంగా ఉన్నా రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పాలన వల్లే అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలంటే కాంగ్రెస్‌ను మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్‌ పార్టీ ముందున్న లక్ష్యాలని, ఎప్పటికప్పుడు ప్రజలకేం కావాలో వాటిని అందించడం తమకే సాధ్యమని అన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు.