టీ బిల్లు నేపథ్యంలోనే సీమాంధ్రకు బలగాలు : డీజీపీ

డీఎస్పీ సుప్రజపై బదిలీ వేటు
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై తీవ్రంగా స్పందించిన ప్రసాదరావు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) :
పార్లమెంట్‌ ముందుకు త్వరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు రానున్న దృష్ట్యా సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక బలగాలను తరలిస్తున్నట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. సోమవారం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ముందుకు వస్తే సీమాంధ్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో ముందస్తుగా బలగాల తరలింపునకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శాంతి, భద్రతల పర్యవేక్షణ తమ బాధ్యత అని, ఈమేరకు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలోని అందరు ఎస్పీలు, పోలీసు కమిషనర్లను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని నిందితులను బహిరంగంగా శిక్షించిన గుంతకల్లు డీఎస్పీ సుప్రజను గ్రేహౌండ్స్‌కు బదిలీ చేస్తూ డీఐజీ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. హత్య కేసులో నిందితులను రోడ్డుపై చితకబాదిన డీఎస్పీపై డీఐజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లయ్య అనే వ్యక్తిని గురువారం రాత్రి అనంతపురం జిల్లా గుంతకల్లులో నలుగురు వ్యక్తులు హత్య చేశారు. రెండు రోజుల్లో వారి గుట్టు రట్టు చేసిన పోలీసులు వారిని ఆదివారం హత్య జరిగిన బస్టాండ్‌ పరిసరాలకు తీసుకువెళ్లి లాఠీతో బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. ప్రజలు ఈ చర్యను హర్షించారు. ఆమె తీరును స్వాగతించారు. అయితే కొందరు ఇది అప్రజాస్వామికమని, చట్టాన్ని చేతల్లోకి తీసుకున్నారని మండిపడుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిగాక చర్యలు తీసుకుంటామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు.