తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు గొంతు విప్పలేదే?
బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందరూ తప్పుబడుతున్నారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్దంగా జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ తీర్పు ఉందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని అందరూ వాదిస్తున్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఇలాంటి ఇవ్వడానికి కారణం మీరంటే మీరు అంటూ రాజకీయ పక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ట్రైబ్యునల్ తుది తీర్పు తర్వాత రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాటు కృష్ణా డెల్టా నిండా మునుగుతుందని సీమాంధ్ర ప్రాంత నేతలు గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడైతే తన మందిమాగదులను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్లి ఈ విషయమై రాష్ట్రపతిని కలిశారు. ట్రైబ్యునల్ తీర్పు గెజిట్ కాకుండా చర్యలు తీసుకోవాలని, బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పును పూర్తిగా రద్దు చేసి కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. ఈ నదిలో నీటి లభ్యతపై శాస్త్రీయ అధ్యయనం చేసి మూడు రాష్ట్రాలకు కేటాయింపు జరిపింది బచావత్ ట్రైబున్యల్. కృష్ణానది ప్రవహించే చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి నదిలో నికర జలాలు పోను మిగులు జలాలు వినియోగించుకునే అవకాశం మన రాష్ట్రానికే ఉండేది. కృష్ణానది జలాల పంపిణీపై బచావత్ 78 సంవత్సరాల్లో లభించిన నీటి ప్రాతిపదికనగా 75 శాతం నీటి లభ్యతను నికర జలాలుగా నిర్దారించి 2130 టీఎంసీలుగా తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు కేటాయించింది. ఇవి పోను వర్షాలు సమృద్ధిగా కురిస్తే కృష్ణా నదిలో మరో 300 టీఎంసీలు వరకు మిగులు ఉండవచ్చని ట్రైబ్యునల్ తేల్చింది. ఆ నీరు కృష్ణా నదిలో ప్రవహించి చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గుండా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛ బచావత్ ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కే ఇచ్చింది. కృష్ణా నదిలో లభించే మిగులు జలాల ఆధారంగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. దీనిపై కూడా అనేక ఆరోపణలున్నాయి. నీళ్లు లేకున్నా ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించి వైఎస్ కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు ముచ్చుకున్నారనే ఆరోపణలు మళ్లీ గుప్పుమంటున్నాయి. కృష్ణా నదిలో 300 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని బచావత్ ట్రైబ్యునల్ లెక్క తేల్చగా రాష్ట్రంలో 225 టీఎంసీల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టింది. గాలేరు-నగరి(39 టీఎంసీలు), హంద్రీ-నివా(43 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు), నెట్టెంపాడు (22 టీఎంసీలు), ఎస్‌ఎల్‌బీసీ (30 టీఎంసీలు), వెలిగొండ (40 టీఎంసీలు) ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అయితే బచావత్ ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు మాత్రమే కేటాయించగా, బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ కృష్ణా నదిలో 65 ఏళ్ల నీటి లభ్యతను ఆధారంగా చేసుకొని 2578 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని తేల్చింది. బచావత్ ట్రైబ్యునల్‌కు అధనంగా 188 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. వైఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల సామర్థ్యం 225 టీఎంసీలు, అంటే నికరంగా లోటు 37 టీఎంసీలు. సీమాంధ్ర పాలకులు అనేక కుట్రలతో చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 40 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా బేసిన్‌కు తరలిస్తారు. తద్వారా బ్రిజేశ్ ట్రైబ్యునల్ తీర్పుతో కూడా రాష్ట్రానికి పెద్దగా నష్టమేమీ ఉండకపోవచ్చనేది మరో వాదన. బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులతో తెలంగాణ ప్రాంతానికంటే సీమాంధ్ర ప్రాంతానికి, మరీ ముఖ్యంగా కృష్ణా డెల్టాకు నష్టం వాటిల్లుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తెగ గింజుకుంటున్నారు. దీనిపై ఢిల్లీ యాత్ర చేపట్టి రైతుల కోసం తాము ఏదో చేస్తున్నామనే భావన కలిగించేందుకు కుప్పిగంతులు వేస్తున్నారు. బ్రిజేశ్‌కుమార్ తీర్పు తెలంగాణకు నష్టం చేకూరుస్తుంది. అయితే కృష్ణా డెల్టా వట్టిపోతుందని, కోస్తా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఇప్పుడు కుప్పిగంతులు వేస్తున్న రాజకీయ పార్టీలు గతంలో తెలంగాణ అన్యాయం జరిగిన సందర్భంలో ఈ విధంగా స్పందించలేదు. వారు ప్రజల మధ్య చూపే వివక్షను మాత్రమే ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాష్ట్రంలోనే వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందాల్సిన నీటిని రాయలసీమ వాసులు అన్యాయంగా దోచుకెళ్లినప్పుడు స్పందించలేదే అనేది సగటు తెలంగాణవాది ప్రశ్న. ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఇలా సీమాంధ్ర పార్టీ బాధ్యులెవరైనా వారి దృష్టిలో ప్రజలంటే సీమాంధ్రులు మాత్రమే. వారి హక్కుల పరిరక్షణే ఈ నేతలకు ప్రధానం. ఆర్డీఎస్ తూములు బాంబులు పేల్చి నీటిని అక్రమంగా ఎత్తుకెళ్లినప్పుడు ఈ నేతలెవరూ మాట్లాడలేదు. ఇక తెలంగాణను ఏడారిగా మారుస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై టీడీపీ సృష్టించిన రగడంతా అప్పటి ఉప ఎన్నికల నేపథ్యంలోనే. తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలను ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఎన్నికల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబునాయుడు బాబ్లీపై పోరాటాన్ని ప్రారంభించారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందడానికి ప్రయత్నించాడు. తర్వాత బాబ్లీపై బాబు ఎప్పటికోగాని మాట్లాడలేదు. సీమాంధ్ర నేతలకు ప్రజల మధ్య ఉండే వివక్ష తెలుసుకునేందుకు బ్రిజేశ్ ట్రైబ్యునల్ తీర్పు మరోసారి ఉపకరించింది. వారికి ఎప్పటికీ సీమాంధ్రుల ప్రయోజనాలే ముఖ్యమని తేటతెల్లమైంది. సీమాంధ్రులకు అన్యాయం జరిగితే తప్ప నోరువిప్పని వారి నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజానీకం తెలుసుకుంది. తెలంగాణ ప్రజలకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై గొంతు విప్పని నేతలను పార్టీలను తెలంగాణ గడ్డ నిలదీస్తోంది.