సోమవారం అసెంబ్లీకి బిల్లు

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ : జైరాంరమేశ్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆంధప్రదేశ్‌ శాసనసభకు సోమవారం వస్తుందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ తెలిపారు. ఇప్పటికే బిల్లు రాష్ట్రపతికి చేరిందని ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా బ్రిజేష్‌కుమార్‌ నీటి కేటాయింపులు చేస్తారని వివరించారు. రాయలసీమ సత్వర అభివృద్ధికి బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీని సిఫార్సు చేసినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 25వేల కుటుంబాల వారు నిర్వాసితులవుతున్నారన్నారు. పోలవరంపై వ్యక్తిగతంగా అభ్యంతరాలు ఉన్నప్పటికీ బిల్లులో పొందుపరిచినట్లు వివరించారు. పోలవరం నిర్మాణానికి తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్ట్రాలు సహకరించాలని జైరాం రమేష్‌ కోరారు. బిల్లులో ప్రస్తావించిన అన్ని అంశాలను చిత్తశుద్ధితో అమలుచేయాల్సి ఉంటుందన్నారు. భద్రాచలంపై ఐదు రోజులు చర్చించాకే సరిహద్దు మార్పు చేయవద్దనుకున్నామని వెల్లడించారు. ఇరు రాష్ట్రాల్లోనూ 371(డి) కొనసాగింపునకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. గతంలో లేని విధంగా బిల్లులోనే అన్ని అంశాలను ప్రసావించడం జరిగిందని వివరించారు. వీటన్నిటినీ చర్చించి ఇరు ప్రాంతాలకు మంచి చేయాలనే సంకల్పంతో బిల్లు రూపకల్పన జరిగిందన్నారు. ఈ బిల్లు ఇప్పటికే రాష్ట్రపతికి చేరిందని సోమవారం శాసనసభకు తెలంగాణ విభజన బిల్లు వచ్చే అవకాశం ఉందని జైరాం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారిగా బ్రిజేశ్‌కుమార్‌ నీటి కేటాయింపులు చేస్తారని పేర్కొన్నారు. సింగరేణి తెలంగాణకే చెందుతుందని తేల్చిచెప్పారు. జల వనరులపై బిల్లులో చెప్పినట్లు అమలు చేస్తే ఇబ్బందులు తలెత్తవన్నారు. సీమాంధ్రలో ఉన్నత విద్యా వర్సిటీలన్నింటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజిని సిఫార్సు చేశామని చెప్పారు. ఇదిలావుంటే రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు శుక్రవారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి చేరింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 24 గంటల్లో బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరింది. కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే శుక్రవారం సాయంత్రం ‘ఆంధప్రదేశ్‌ పునర్యవస్థీకరణ బిల్లు’ ముసాయిదాను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పరిశీలనకు పంపించారు. బిల్లు ప్రతి, కేబినెట్‌ నోట్‌, జీవోఎం నివేదికతోపాటు ¬ం శాఖ నోట్‌, న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా రాష్ట్రపతికి పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న రాష్ట్రపతి సోమవారం ఢిల్లీకి తిరిగి వస్తారు. ఆయన కనీసం రెండు మూడు రోజులు ఈ బిల్లును పరిశీలిస్తారని అంటున్నారు. ఆయన న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్టికల్‌ 371(డి)లో ఏ మార్పు చేసినా రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని అటార్నీ జనరల్‌ వాహనావతి, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ విశ్వనాథన్‌ ఇంతకు ముందు చెప్పారు. అయితే ఆ అవసరంలేదని, సాధారణ మెజారిటీతో బిల్లును ఆమోదించవచ్చునని జీవోఎం అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్రపతి న్యాయపరిశీలన కోరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న రాష్ట్రపతి బిల్లును నేరుగా అసెంబ్లీకి పంపుతారని తెలుస్తోంది.