సకాలంలో రుణం చెల్లిస్తే బకాయిలో రాయితీ

వరంగల్‌,జనవరి20: జిల్లాలో 700 మంది రైతులు సుమారు  65 కోట్ల రూపాయల దీర్ఘకాలిక రుణాలు పొంది బకాయి దారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువుగా 5 లక్షల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నవారేనని చెప్పారు. వీరు బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు రైతులకు చెందిన తనఖా పెట్టిన సాగు భూములను వేలం పాటల ద్వారా విక్రయించామన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో దీర్గకాలిక రుణాలు తీసుకొని చెల్లించని బకాయిదారులకు ప్రభుత్వం రాయితీ అవకాశాన్ని కల్పించిందని డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్‌ జంగా రాఘవరెడ్డి తెలిపారు. దీర్గకాలిక రుణాలు తీసుకొని చెల్లించలేక పోతున్న రైతులకు రుణం, వడ్డీ మొత్తంలో 35 శాతం రాయితీని ఇస్తున్నట్లు వివరించారు. శనివారం హన్మకొండలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఆ వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన రుణమాఫీ పథకానికి అనుబంధంగా 2010 సంవత్సరం జూన్‌ 30 తేదీ నాటికి మిగిలి పోయిన పెద్ద బకాయిదారులకు మాత్రమే ఈ రాయితీ పథకం వర్తిస్తుందన్నారు. 2008 మార్చి 1వ తేదీకి ముందు డీసీసీబీ బ్యాంకు ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. 31వ తేదీలోపు పూర్తి రుణ బకాయి చెల్లించిన రైతులకు మాత్రమే రుణంలో 35 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.  ఆప్కాబ్‌ ప్రతినిధులు, అధికారులతో చర్చించాక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రాయితీ పథకాన్ని రూపొందించినట్లు వివరించారు.