మేడారంలో ఆదివాసీ భవన్నిర్మించాలి
వరంగల్,జనవరి24: ఆదివాసీల కోసం మేడారం జాతర ప్రాంగణంలో ఆదివాసీ భవన్‌ను
నిర్మించాలని పలు ఆదివాసీ సంఘాలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మేడారంలో గిరిజన యూనివర్సిటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అరుదైన ఆదివాసీ జాతుల్లో ఒకటైన కోయ జాతుల సాంస్కతిక అస్తిత్వ ప్రతిరూపమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పరాయీకరణ జరుగకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ సమాజంపై ఉందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.చరిత్రలో ఆదివాసీ పూర్వీకులు నిర్మించుకుని, పూజించుకున్న ఆలయాలు, ప్రకతి నిలయాలు ఇప్పటికే అనేకం పరాయికరణం చెందాయని, ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక ఆదివాసీ అస్తిత్వ జాతర మేడారం జాతరేనన్నారు. మేడారం జాతరపై పాలకులు అనేకమైన కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని, దీంతో ఆదివాసీల అస్తిత్వ చిహ్నమైన మేడారం హైజాక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.మేడారం జాతరను హిందూకరించడానికి కానీ ఇతర ఏ మతాల ప్రాబల్యం పెరగడానికి గానీ గిరిజన సమాజం అంగీకరించదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగిస్తూనే గిరిజన సంస్కతీ, సంప్రదాయాలను పూర్తిస్థాయిలో పరిరక్షించుకోవడానికి ప్రతీ గిరిజనుడు ముందుండాలన్నారు. చిలుకలగుట్టకు ఫెన్సింగ్, గిరిజన మ్యూజియం నిర్మించాలని, సమ్మక్క-సారలమ్మల ప్రతిమలుగా ప్రభుత్వమే ప్రచారం చేసిన పులిపై, జింకపై ఉన్న తల్లుల ప్రతిమలను తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం ప్రతిమలను తొలగించి ఈసారి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ఈసారి ఆదివాసీ భవన్‌తోపాటు సమ్మక్క-సారలమ్మలను గద్దెలకు తీసుకు వచ్చేటప్పుడు పోలీస్ రోప్ పార్టీలుగా గిరిజన బెటాలియన్నే వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు. జాతర మొత్తం దేశంలోని గిరిజన సమాజానికి స్ఫూర్తిదాయకం అన్నారు. చిలుకలగుట్ట ఫెన్సింగ్ నిర్మాణ పనులకు అడ్డుతగులుతున్న ఫారెస్ట్ అధికారుల చర్యలను ఖండించారు. మేడారం జాతర ప్రాంగణ పరిధిలో ముప్సై ఏళ్లుగా గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న 427ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలివ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. రెండో పంట నష్టపోతున్న రైతులకు ప్రతీ జాతర సందర్భంగా నష్టపరిహారం కోసం కోటి కేటాయించాలని డిమాండ్ చేసింది. జంపన్నవాగుపై నిర్మించిన జంట వంతెనలకు తల్లుల పేరు పెట్టాలని తీర్మానించారు.