నిజమే.. నీకు బలముంటే తెలంగాణను అడ్డుకునేటోడివే
తమ పార్టీకే అత్యధిక మంది ఎంపీలుంటే ఆంధ్రప్రదేశ్ ముక్కలు కాకుండా ఆపేవాడినని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయనగరంలో మాట్లాడుతూ తన నైజాన్ని చాటుకున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆది నుంచి విషం కక్కుతున్న చంద్రబాబు తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత తన సహజ శైలిలో మాట్లాడాడు. సీమాంధ్రలో ఓట్లు సీట్లే లక్ష్యంగా ఆయన ప్రసంగం సాగింది. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలను ఆకట్టుకోవడానికి చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుపై దుమ్మెత్తిపోశాడు. కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండానే, సమన్యాయం చేయకుండానే విభజనకు సిద్ధపడిందని ఆక్షేపించిన చంద్రబాబు అసలు సమన్యాయమంటే ఏమిటో ఇంతవరకూ చెప్పలేదు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదంటున్న చంద్రబాబు తెలంగాణపై తన పార్టీలో ఏకాభిప్రాయం ఉన్నదని చెప్పగలడా? తెలంగాణ ఏర్పాటు తర్వాత సీమాంధ్రలో కేంద్రం నిర్ణయంపై నిప్పులు చెరగుతున్న చంద్రబాబు.. తెలంగాణలో మాత్రం సంబరాలు జరుపుకోండంటూ తమ పార్టీ నాయకులను పురమాయిస్తున్నాడు. ఎటొచ్చి ఆ పార్టీ నేతలను తెలంగాణ సాధనలో భాగస్వాములుగా ఇక్కడి ప్రజలు గుర్తించడం లేదు. విభజనను అడ్డుకునేందుకు ఢిల్లీలో పలువురు జాతీయ నేతలను కలిసి ఒత్తిడి తెచ్చానన్న చంద్రబాబు కొందరిని అందుకు ఒప్పించగలిగానని చెప్పాడు. తమ పార్టీకే గనుక ఎక్కువ మంది ఎంపీలు ఉండి ఉంటే తెలుగుజాతి విడిపోయి ఉండేది కాదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తాను ఇచ్చిన లేఖద్వారానే సాధ్యమైందంటూ మొన్న తెలంగాణ నేతల సమావేశంలో జబ్బలు చరుచుకున్న బాబు మీడియా ముఖంగానో, బహిరంగంగానో మాత్రం ఆ విషయం చెప్పడానికి సిద్ధపడడు. ఆయన మందిమాగదులు మాత్రమే బాబు ఇలా అన్నారు అని మీడియాకు చెప్తుంటారు. అదే సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లినప్పుడు తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తెలంగాణపై తనకే నిర్దిష్టమైన విధానం లేని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అధికారం కోసం కుట్రలు చేయడం, ప్రజల మధ్య చిచ్చుపెట్టడం చంద్రబాబుకు కొత్తేమీకాదు. ఆయన రాజకీయ జీవితం మొత్తం కుట్రలు, కుతంత్రాలమయమే. 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన స్వయాన మామ ఎన్టీఆర్పైనే ఆరోపణలు గుప్పించిన చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు. అప్పట్లో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి. తర్వాత మామ ప్రాపకంతో రాజకీయంగా ఎదిగి చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచాడు. అచ్చు జానపద సినిమాలో లాగా అధికారాన్ని అహస్తగతం చేసుకుని నీచారాజకీయాలకు తెలేపారు. అధికారం కోసం టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని జై తెలంగాణ అన్న వ్యక్తి ఇప్పుడు విభజన అసంబద్ధమంటున్నాడు. ఇరు ప్రాంతాల ప్రజలంటే ఎవరు..? వారు ఎవరో తానే ఎందుకు చేయరు. ఇదంతా ఎందుకు తన పార్టీలోని ఇరు ప్రాంత నేతలతో చర్చించి వారిని ఒక్కతాటిపైకి తెచ్చారా? ఎందుకు ఆ ప్రయత్పం చేయలేదు. ఇరు ప్రాంతాల టిడిపి నేతలు బాహాబాహీకి తలపడుతుంటే ఎందుకు వారిన రెచ్చగొడుతున్నారు. ఢిల్లీతో పాటు దేశ యాత్రలు చేసిన బాబు తన పార్టీలో ఏకాభిప్రాయ సాధనకు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఎందుకు చేయలేదు. ఇరు ప్రాంతాల నేతలను ఇప్పటికీ ఎందుకు ఎగదోస్తున్నారు. నామా నాగేశ్వరారావును తమ నేతగా అంగాకరించమని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు అంటే ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదు. కేవలం అధికారం కోసం ప్రజల మధ్య తీరని అంతరాన్ని సృష్టించిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే. ఏ రోటికాడి పాట ఆ రోటికాడ పాడుతూ ఇప్పటికే కాదు తెలుగు ప్రజలు ఎప్పటికీ కలుసుకోలేనంత విద్వేషాన్ని నింపాడు చంద్రబాబు. విజయనగరం సభలోనూ అదే పనిచేశాడు. కాకినాడలో నిర్వహించిన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశంలో ‘ఒక ఓటు – రెండు రాష్ట్రాలు’ అంటూ తీర్మానం చేసిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ముందే ఇచ్చిన హామీ అయిన తెలంగాణను విస్మరించడానికి కారకుడే చంద్రబాబు. ఇదే విషయాన్ని గతంలో పలుమార్లు చెప్పిన చంద్రబాబు విజయనగరం సభలోనూ పునరుద్ఘాటించారు. అప్పట్లో టీడీపీకి 29 మంది ఎంపీల బలముండేది. ఎన్డీఏలో రెండో అతిపెద్ద రాజకీయ పార్టీ టీడీపీ. ఇంతమంది సంఖ్యాబలమున్న చంద్రబాబును కాదని బీజేపీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి సాహసించలేకపోయింది. అప్పట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన సీమాంధ్ర నాయకుడు వెంకయ్యనాయుడుతో జతకూడి తెలంగాణను అడ్డుకున్న ఘన చరిత్ర చంద్రబాబుదే. ఆది నుంచి వెన్నుపోటు, అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న చంద్రబాబు తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను చిదిమేయడానికి పన్నని కుట్రలు లేవు. మళ్లీ బీజేపీతో జతకట్టడం ద్వారానైనా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని చంద్రబాబు అనేక ప్రయత్నాలు సాగించారు. చివరికి ఆ పార్టీ అవసరం లేకుండానే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు గట్టెక్కే పరిస్థితి రావడంతో బీజేపీ బిల్లుకు మద్దతునివ్వడం ద్వారా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లైంది. తనకు సంఖ్యాబలముంటే తెలంగాణను అడ్డుకునే వాడినన్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఇరు రాష్ట్రాల పునర్నిర్మాణం, సమగ్రాభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమంటున్నాడు. పాములా విషం కక్కుతున్న చంద్రబాబు తనను ఇంకా తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారనే నమ్మకంతో ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు చంద్రబాబు ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు. తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సన్నద్ధమవుతున్నారు.