పార్టీ వీడుతున్నా.. బాధతోనే నిర్ణయం : పురందేశ్వరి


విశాఖపట్నం, మార్చి 6 (జనంసాక్షి) :
బాధగా ఉన్నా కాంగ్రెస్‌ను వీడుతున్నానని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. గురువారం వైజాగ్‌లో మీడియాతో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నానని, వారితో అన్ని విధాలుగా చర్చించిన తరువాతే.. వారి అభీష్టం మేరకే తాను పార్టీని వీడాలన్న నిర్ణయాన్ని తీసుకున్నాను. రాజకీయాల నుంచి కూడా తప్పుకుందామని నిర్ణయించుకున్నాను. అయితే తమ నియోజకవర్గ ప్రజలు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు వారించారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో నిలదొక్కుకుంటున్న తరుణంలో రాజకీయాల నుండి తప్పుకోవడం మంచిది కాదని నచ్చజెప్పారని అన్నారు. శుక్రవారం ఢిల్లీకివెళ్లి..బిజెపి అగ్రనేతలు అద్వానీతోనూ, సుష్మాస్వరాజ్‌తోనూ, అరుణ్‌జైట్లీతోనూ భేటీ కానున్నట్టు చెప్పారు. బిజెపిలో చేరడానికి తానెటువంటి షరతులు పెట్టబోవడం లేదు. కేంద్ర మంత్రులుగా ఉన్న తమను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర విభజనను చాలా అన్యాయమైన పద్ధతిలో చేశారని, సీమాంధ్ర ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. నెల రోజుల నుండి తమ కుటుంబ సభ్యులు, దగ్గర వాళ్లు అందరుకూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారని అన్నారు. పదేళ్లు చేశాం కాబట్టి.. అసలు రాజకీయాలే వద్దనుకున్నాను. నిలదొక్కుకుంటున్నందున కొనసాగాలని వారందరూ చెప్పారు. అందుకే తాను తుది నిర్ణయం తీసుకున్నాని అన్నారు. ముందుగా ఆ నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు, నాయకులతో పంచుకోడానికి వచ్చానని పురందరేశ్వరి తెలిపారు. తనతో రావాలని నాయకులెవర్నీ ఒత్తిడి చేయబోవడం లేదు. వారి ఆలోచనకే ఆ అంశాన్ని వదిలేస్తున్నా. తన నిర్ణయం సరైనదో కాదో ప్రజలే తేలుస్తారు. ఎన్నికల ఫలితాలతో ఆ విషయం వెల్లడవుతుందని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం స్థానిక నాయకులతోను, శ్రేయోభిలాషులతోను, అనుచరులతోను విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మాజీమంత్రి పురంధరేశ్వరీతో పాటు ఆమె భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.