భాజపాతో పొత్తు పొడిస్తే ఎలా ఉంటుంది?


తెరాస, జేఏసీ శ్రేణులతో ఆరా

హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) :

భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందంటూ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ఆరా తీస్తోంది. ఆదివారం పార్టీ శ్రేణులతో పాటు జేఏసీ నాయకుల అభిప్రాయాలను టీఆర్‌ఎస్‌ కోరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తమ పార్టీని విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్‌ పార్లమెంట్‌లో బిల్లు నెగ్గిన తర్వాత అందుకు ససేమిరా అన్నారు. తెలంగాణ సాధనకు ఉద్యమించిన తమతోనే పునర్నిర్మాణమూ సాధ్యమంటూ భీష్మించుకు కూర్చున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ జోక్యం చేసుకున్నా టీఆర్‌ఎస్‌ పొత్తుకు ముందుకు రాలేదు. పై పెచ్చు టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ కాంగ్రెస్‌తో పొత్తుకు ద్వారాలు మూసుకుపోయాయంటూ వ్యాఖ్యానించి పుండుమీద కారం చల్లాడు. అయినా ఓపిక వహించిన కాంగ్రెస్‌ పార్టీ శనివారం ఇక టీఆర్‌ఎస్‌తో తమకు సరిపడదని నిర్దారించుకుంది. సీపీఐ, ఎంఐఎం, టీఆర్‌ఎల్డీ, న్యూడెమోక్రసీతో ఎన్నికల అవగాహనకు సిద్ధపడింది. అలాగే టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులను తమ పార్టీలో చేరేలా ప్రోత్సహిస్తోంది. దీంతో కేసీఆర్‌ బీజేపీవైపు మొగ్గు చూపినట్లుగా సమాచారం. పెద్దపల్లి ఎంపీ వివేక్‌, ఆయన సోదరుడు, మాజీ కార్మిక మంత్రి వినోద్‌ సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కాకుండా బీజేపీ వైపు వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురుకావచ్చో తెలుసుకోవాలంటూ కేసీఆర్‌ పార్టీ శ్రేణులను పురమాయించారు. వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీకి 25 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమనే సంకేతాలు ఆ పార్టీ ముఖ్య నాయకులకు చేరవేశారు. మరోవైపు టీడీపీ, బీజేపీ మధ్య నెలరోజులుగా కొనసాగుతున్న పొత్తు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి టీడీపీ ససేమిరా అనడంతో ఆ పార్టీ ముఖ్య నాయకుడు వెంకయ్యనాయుడు పొత్తులపై 24 గంటల్లోగా తేల్చాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు డెడ్‌లైన్‌ విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ తనకు తానుగా బీజేపీకి స్నేహ హస్తం చాచడం చర్చనీయాంశమైంది.