మీరే పసిపిల్లలు


సోనియా పిల్ల చేష్ట వ్యాఖ్యలపై మండిపడ్డ కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) :తనవి పిల్ల చేష్టలు కాదని, కాంగ్రెస్‌ నేతల పనులే పసిపిల్లలు వ్యవహరించే తీరులో ఉన్నాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ముఖ్యమంత్రి పదవి
అంటే కొంత మందికి ‘పిల్ల చేష్ట’లాగా తయారైందంటూ యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన విమర్శలపై ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ ఘాటుగా స్పందించారు. తనది చిన్నపిల్లలాట కాదన్నారు. తనకు 43 ఏళ్ల వయస్సు దాటిపోయినట్లు చెప్పారు. తనవి పిల్ల చేష్టలంటూ సోనియా చేసిన వ్యాఖ్యలు ఆమె పుత్ర రత్నం, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి అతికినట్లు చక్కగా సరిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. అంతేగాకుండా సీఎం పదవి వదులుకోవడానికి దమ్ము కావాలన్నారు. మంగళవారం దేశ రాజధాని హస్తినలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేజీవ్రాల్‌ యూపీఏ అధ్యక్షురాలు సోనియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం యూపీఏ అధ్యక్షురాలు న్యూఢిల్లీ, అసోంలోని లఖింపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ కొంతమంది ముఖ్యమంత్రి పదవి అంటే పిల్ల చేష్టలాగా అనుకుంటారని, అందుకే న్యూఢిల్లీ సీఎం పదవిని కేజ్రీవాల్‌ వదలి పారిపోయారని సోనియా విమర్శించారు. ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓటమికి కేజీవ్రాలే కారణమని ఆయనపై సోనియా ఈ సందర్భంగా దుమ్మెత్తి పోశారు. గతేడాది చివరిలో న్యూఢిల్లీ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 28 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌ కేవలం 7 సీట్లు మాత్రమే కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ మద్దతుతో ఆప్‌ కన్వీనర్‌ కేజీవ్రాల్‌ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కేవలం 49 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేజీవ్రాల్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ అధినేత కేజీవ్రాల్‌ పై సోనియా ఆరోపణలు వర్షం కురిపించారు. దీనిని ఆయన ఖండించారు. తాను ఓ లక్ష్యం కోసం పని చేశానని, సిఎం పదవిని తృణపాయంగా వదులుకున్నానని అన్నారు.