ఆయారాం.. గయారాంలు పార్టీలో వద్దు
కాంగ్రెస్‌లో రాహుల్ మార్క్ రాజకీయాలు
దీర్ఘకాలిక వ్యూహంపై రాహుల్ దృష్టి
అందులో భాగంగానే కొండా, కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్ టికెట్ల నిరాకరణ
తాత్కాలిక అధికారం కాదు
పార్టీని పటిష్ట పరిస్తేనే పూర్వ వైభవం
హైదరాబాద్, ఏప్రిల్ 9 (జనంసాక్షి) :ఎన్నికల్లో గెలుపే ఏ పార్టీకైనా ప్రధానం. అందుకోసం ఎలాంటి వారితోనై దోస్తీ కడతారు. ఎవరితోనైనా అంటకాగుతారు. నిన్నటి వరకు దుమ్మెత్తిపోసిన వారిని సైతం అక్కున చేర్చుకొని గుండెలకు హత్తుకుంటారు. ప్రత్యర్థి పార్టీ నుంచి గోడ దూకేయడమే తరువాయి టికెట్టిచ్చి అతడికే ఓటేయమంటూ డంకా బజా యించి చెప్తారు. ఓట్ల రాజకీయాల్లో ఇవన్ని సర్వసాధారణం. రాత్రికి
రాత్రే కండువాలు మార్చడం, తెల్లారేసరికల్లా కొత్త పార్టీ జెండాతో ప్రత్యక్షమవడం ఎన్నికల రుతువులో మామూలే. నిన్నమొన్నటి వరకు అన్ని రాజకీయ పార్టీలది రంగులు మార్చే ఊసరవెళ్లి రాజకీయమే. ఓట్లు.. సీట్లే లక్ష్యంగా పార్టీలు మారే నేతలకు వీరతిలకం దిద్ది ప్రజాక్షేత్రంలోకి పంపడం, గెలిచినోళ్లు ఉంటే ఐదేళ్లు ఆ పార్టీతోనే ఉండి మళ్లీ ఎన్నికల సమయంలో టికెట్ రాకుంటే మరో పార్టీ వైపు తొంగిచూడటం మామూలే. ఇలాంటి కప్పదాటు రాజకీయాలకు చరమగీతం పాడేందుకు సంకల్పించారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ. ఫక్తు ఓట్ల రాజకీయాలు.. గెలుపు గుర్రాలు ఫార్మూలాను పక్కనబెట్టి పార్టీ విధేయులకే ప్రాధాన్యం అనే కొత్త ఒరవడికి రాహుల్ శ్రీకారం చుట్టారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌లో పాటించిన ఫార్మూలానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేశారు యువనేత. 90వ దశకంలో యూపీలో తన ప్రభావాన్ని కోల్పోయి సింగిల్ డిజిట్‌కే పరిమితమైన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడమే ధ్యేయంగా రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయక ఓటు బ్యాంకుకు గండికొట్టిన పరిణామాలు ఇతరత్రా అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేసి స్థానికంగా పార్టీ కోసం కష్టపడుతున్న వారిని గుర్తించి ప్రోత్సహించారు. ఫలితంగా 2009 సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 21 పార్లమెంట్ స్థానాలను సాధించగలిగింది. పార్టీ జెండా మోస్తున్న వారికి ప్రాధాన్యం ఉంటుందనే భరోసా ఇవ్వడంలో రాహుల్ కృతకృత్యులయ్యారు. ఇప్పుడు అదే ఫార్మూలాను తెలంగాణలోనూ అమలు చేశారు. టికెట్ల కేటాయింపు సందర్భంగా ఇతర పార్టీల నుంచి గోడ దూకిన వారిని మొత్తానికి మొత్తంగా పక్కనబెట్టారు. వాళ్లలో పలువురు గెలిచే అవకాశమున్నా ఓట్లు.. సీట్లు తనకు ప్రాధాన్యం కాదని, పార్టీని నమ్ముకున్న వారికి అవకాశాలు కల్పించడమే ప్రధానమని తేల్చిచెప్పాడు. కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల పూర్తిగా నిర్వీర్యం కావడానికి కారణం కప్పదాట్లకు ప్రాధాన్యం ఇవ్వడం అందలమెక్కించడమేనని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలతో జట్టు కట్టిన వాళ్లు, అక్కడ టికెట్లు రాక గుర్తింపు లేక పార్టీ మారిన వారికి తీసుకువచ్చి ఇప్పటికిప్పుడు నియోజకవర్గ అభ్యర్థులుగా ప్రకటిస్తే ఇన్నాళ్లు పార్టీ జెండా మోసిన వాళ్లకు ఇంకెప్పుడు అవకాశం దక్కుతుందని ఆయన ఫిరాయింపుదారుల పక్షాన తన వద్దకు వచ్చిన నేతలకు తేల్చిచెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు టికెట్లు ఆశించకుండా పార్టీ అభ్యర్థుల గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తే వారికి ఇతర అవకాశాలు కల్పిస్తామని, కేవలం టికెట్ల కోసం వచ్చే వారికి మాత్రం పార్టీలో చోటు ఉండబోదని ఆయన తేల్చిపారేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అక్కడి ప్రజలను ఓటు అడుగుదామే తప్ప గెలుపు గుర్రాల పేరుతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తే ఇన్నాళ్లు పార్టీకోసం కష్టపడిన వారి దృష్టిలో పలుచనవుతామని ఆయన తేల్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో రాహుల్‌గాంధీ తనదైన మార్క్ ప్రదర్శించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరి, అక్కడి నుంచి మళ్లీ సొంతగూటికి చేరిన మాజీ మంత్రులు కొండా సురేఖ, ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, మక్కాన్‌సింగ్ తదితరులు, పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులకు టికెట్లు నిరాకరించారు. వీరిలో కొందరు మళ్లీ వేర్వేరు పార్టీల్లో చేరి టికెట్లు దక్కించుకోగా మరికొంతమంది స్వతంత్రులుగానే పోటీకి సిద్ధమయ్యారు. తెలంగాణలో కనీసం అర డజను సీట్లలో గెలిచే అభ్యర్థులు కాంగ్రెస్ పక్షాన పోటీకి సిద్ధపడ్డ రాహుల్ ససేమిరా అన్నారు. వారి స్థానంలో పార్టీ కోసం పాటు పడిన నాయకులకే అవకాశం ఇచ్చారు. అదే సమయంలో ఉద్యమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇబ్రహీం, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మైనంపల్లి హన్మంతరావు తదితరులకూ టికెట్లు నిరాకరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ అధిష్టానంపై పలుమార్లు ఒత్తిడి పెంచి, కాంగ్రెస్ పార్టీ ఎంతకూ స్పందించక పోవడంతో ఉద్యమ పార్టీలో చేరిన కాకా తనయులు పెద్దపల్లి ఎంపీ వివేకానంద, మాజీ మంత్రి వినోద్‌కు మాత్రం మినహాయింపునిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వగానే టీఆర్‌ఎస్‌ను వీడి సొంతగూటికి చేరిన వారికి టికెట్లు కేటాయించారు. అలాగే తెలుగుదేశం పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని వచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యకూ అవకాశమిచ్చారు. వీరు మినహా మిగతా నేతలెవరికీ టికెట్లు ఇవ్వడానికి రాహుల్‌గాంధీ సుముఖత వ్యక్తం చేయలేదు. తద్వారా మిగతా నేతలెవరూ పార్టీని వీడినా వారికి భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని హెచ్చరించడంతో పాటు పార్టీ కోసం కష్టపడిన అవకాశాలు కచ్చితంగా వస్తాయనే నమ్మకాన్ని కల్పించడమే ధ్యేయంగా రాహుల్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఒక కుటుంబానికి ఒకే సీటు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. రాంరెడ్డి సోదరులిద్దరికీ, రెడ్యానాయక్‌తో పాటు ఆయన కుమార్తె కవితకు, ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు ఆయన భార్య ఇందిరకు, మల్లు సోదరులకు టికెట్లు ఇచ్చారు. అయితే వీరిలో ఉత్తమ్ సతీమణి ఒక్కరే మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మిగతా వాళ్లంతా ఇది వరకు ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్లే. తాత్కాలిక అధికారం కంటే పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ట పరచడం ద్వారా పూర్వవైభవం సాధించగలమని రాహుల్‌గాంధీ నాయకులు, శ్రేణులకు ఉద్బోధిస్తున్నారు.