మలి విడత పరిషత్ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
త్వరలోనే కౌంటింగ్
నిర్భయంగా ఓటేయండి : ఈసీ
హైదరాబాద్, ఏప్రిల్ 10 (జనంసాక్షి) :
జిల్లా పరిషత్, మండల పరిషత్ మలి, తుది విడత ఎన్నికలకు పటిష్ట ఏర్పా ట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. తొలిదశ పోలింగ్ 6న పూర్తి కాగా మలిదశ శుక్రవారం జరుగనుంది. దీనికి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది పోరు చివరి అంకం చేరుకుంది. మలి విడత ప్రచార గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది. శుక్రవారం రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగన్నాయి. మలి విడతలో 536 జెడ్పీటీసీలకు, 7,975 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలం గాణలో 217, సీమాంధ్రలో 319 జెడ్పీటీసీలకు శుక్రవారం ఎన్నికలు జరగ నున్నాయి. మలి విడతకు రాష్ట్ర వాప్తంగా 25758 పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేయగా 1.31 లక్షలమంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాలు పంచుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సగం సమస్యాత్మకమైనవే కావ డంతో భారీ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 6057, అతి సమస్యాత్మకమైనవి, 6483, గొడవలు జరిగే అవ కాశం ఉన్నవి 238 పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. మావోయిస్టు ప్రభా వం ఉన్న 558 పోలింగ్ కేంద్రాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పాడేరు, జి.మాడుగుల, జీకేవీధి, ముంచంగిపుట్టు,
చింతపల్లి, అరకు, పెదబయలు తదితర మండలాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కరీంనగర్ జిల్లా మంథని రెవెన్యూ డివిజన్‌లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పాడేరు ఏజెన్సీలోనూ పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటల వరకూ ఉండేలా మార్పులు చేయనున్నారని తెలిసింది. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు దక్కించుకునేందుకు కీలక ఘట్టం కావడంతో పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. జిల్లా పరిషత్‌లు దక్కించుకోవాలంటే మలివిడతలోనూ మెజార్టీ స్థానాలను దక్కించుకోవాల్సిన నేపథ్యంలో పార్టీలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో ముక్కోణపు పోటీలు జరుగుతున్నాయి. స్థానికంగా పార్టీల పరంగా పట్టు నిరూపించుకునేందుకు కీలకమైన ఎన్నికలు కావడంతో ప్రధానపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తలపడుతున్నాయి. మొదటి విడత భారీగా పోలింగ్ నమోదు కావడంతో బలబలాలను విశ్లేషించుకుని రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓట్ల కొనుగోలులో పోటీపడుతున్నాయి. బేరసారాలు ఊపందుకున్నాయి. ఓటుకు కనీస రేటు వెయ్యి ఉండగా రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు వెనుకాడటంలేదు. డబ్బుతో పాటు వెండి వస్తువులు, చీరలు తదితరాలను పంపిణీ చేస్తున్నారు. దీనికితోడు తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు నామినేషన్ల చివరిరోజు కావడంతో నేతల హడావుడి కొనసాగింది.