లౌకికవాదానికి, మతతత్వానికి మధ్య పోరు


గంగజమునా తహెజీబ్‌ను విడదీయడం ఎవరితరం కాదు శ్రీమతోన్మాదులను ఓడించండి
కాంగ్రెస్‌కు పట్టం కట్టండి శ్రీకేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌
కరీంనగర్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) :
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు లౌకికవాదానికి, మతతత్వానికి మధ్య జరుగుతున్న పోరాటమని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. సోమవారం నగరంలోని మానేర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన ముస్లింల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశం విభిన్న జాతులు, మతాలు, కులాలకు నిలయమని ఇలాంటి దేశంలో విద్వేషాలు రగల్చాలని విచ్ఛిన్నకర శక్తులు, మతోన్మాదులు కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకైన భారత్‌లో చిచ్చుపెట్టడం ఎవరితరం కాదని, ప్రజలను ఎవ్వరూ విడదీయలేరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మతోన్మాదులకు బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రజల మధ్య విద్వేషాలు రగల్చేందుకు అనేక కుట్రలు పన్నుతున్నాడని, దేశంలో అత్యధికులైన హిందువులను మతం పేరుతో విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలను అణగదొక్కాలని కుట్రలు చేస్తున్నాడని తెలిపారు. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.