హైదరాబాద్‌పై ఆంధ్రోళ్ల కుట్ర
పైలంగుండాలే : కేసీఆర్
నిజామాబాద్, ఏప్రిల్ 28 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేసేందుకు ఆంధ్రోళ్లతో కలిసి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేం ద్రమోడీ కుట్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్ అధినేత కె.చం ద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఈ విష యంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆంధ్రా వాళ్లతో పంచాయతీ తెగలేదని తాను చేస్తున్న హెచ్చ రికలను నిజం చేస్తూ మోడీ చేసిన ప్రకటనలే నిదర్శ నమన్నారు. హైదరాబాద్ ఒక్క ప్రాంతానికి చెందిన నగరం కాదని నరేంద్రమోడీ అంటున్నాడని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ ఎన్ని కల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ మోడీ నిజ స్వరూపం ఏంటో పత్రికలో వచ్చిన మోడీ ఇంట ర్వ్యూను చూస్తే తెలుస్తుందని అన్నారు. మోడీ చచ్చి పోయిన శవంలా టీడీపీని భుజాన వేసుకొని తిరుగు తున్నాడని ధ్వజమెత్తారు. మా తాత
ముత్తాతల తహసీల్‌తో కట్టిందే హైదరాబాద్ అని.. హైదరాబాద్‌ను యూటీ చేసే కుట్ర జరుగుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ ను తెలంగాణకు కాకుండా చేస్తున్న బీజేపీని పాతాళంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ కలసి కుట్ర చేస్తున్నాయని, తాను చేస్తున్న హెచ్చరికతో జాగ్రత్త పడాలని ఆయన తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా నాలుగు లక్షలతో పేదలకు ఫ్లాట్స్ నిర్మించి ఇస్తామన్నారు. నిజామాబాద్ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు చెప్పారు. బీడీ కార్మికుల కోసం నిజామాబాద్‌లో బీడీ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కారు గుర్తుపై ఓటు వేసి తెరాస అభ్యర్థులు గణేశ్ గుప్తాను, కవితను గెలిపించాలని ఓటర్లను కేసీఆర్ కోరారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమన్నారు. ఇప్పుడు జరుగుతున్నవి ఆషామాషీ ఎన్నికలు కావని, మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే అవకాశమిచ్చేవని అన్నారు. ఇంకా సీమాంధ్ర పాలకులకు గులాంగిరి చేద్దామా? వారికి సామంతులుగా ఉందామా? లేక స్వతంత్రులుగా ఉందామా? అన్నది ఆలోచించుకొని ఓటువేయాలి అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఇక ఈ ఎన్నికల్లో గెలువాల్సింది తెలంగాణవాదులా? లేక ద్రోహులా? విూరే తేల్చాలని అన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లను నాలుగు నెలల్లోగా అమలు జరిగేలా చుస్తామన్నారు. ముస్లింల సంక్షేమానికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ హావిూ ఇచ్చారు. తెలంగాణ తెచ్చిన కీర్తి వెయ్యి జన్మలకు చాలనుకున్నా. అయితే కాంగ్రెస్‌లో కలువొద్దని తెలంగాణ సమాజం, ప్రతీ తెలంగాణవాది నుంచి ఒత్తిళ్లు రావడంతోపాటు.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే ఎన్నికల బరిలోకి దిగామని తెలిపారు. హక్కులు, వాటాలు అడిగితే సీమాంధ్రులు పరిహాసం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి సొల్లుగాళ్ల మాటలు పడే కర్మ తనకెందుకన్నారు. బీజేపీ నేత నరేంద్రమోడీ చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ ప్రజలకు దుష్మన్‌గా మారాడని అన్నారు. తెలంగాణలో 90 సీట్లలో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగరవేస్తుందని పలు సర్వేలు చాటుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారం టీఆర్‌ఎస్‌దేనని ఖాయమైనట్లేనని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు ఇస్తున్న రుణాలను రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతుందని హావిూనిచ్చారు. బలహీనవర్గాలకు మంచి గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. రైతులకు వంద శాతం రుణ మాఫీ చేసి రైతన్నల కుటుంబాలకు అదుకుంటామన్నారు. లంబాడీ తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి ఆయా గ్రామాలకు నిధులు కేటాయిస్తామన్నారు. బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవిత, బిగాల గణేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ రాజకీయ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చిన హావిూలను తూచ తప్పకుండా అమలు చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ హావిూఇచ్చారు. రైతులకు రుణమాఫీ వందశాతం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లాలోని మందమర్రిలో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని అన్నారు. బలహీనవర్గాలకు 125 గజాల్లో ఇల్లు నిర్మిస్తామన్నారు. మహిళలకు రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని తెలిపారు. బీడీ కార్మికుల కోసం భవనం నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎవరి వల్ల తెలంగాణ అభివృద్ధి చెందుతుందో ప్రజలు వేసే ఓట్ల ద్వారా వెల్లడి కాబోతుందన్నారు. కాబట్టి ప్రజలు బాగా ఆలోచించి సరైన పాలనకు ఓటు వేయాలని కోరారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి ఓటేస్తే హైదరాబాద్‌ను పోగొట్టుకోవడమే అని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ప్రధాని కాకుండా చూద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు