చెన్నైలో ఉగ్రపంజా
రైల్వే స్టేషన్‌లో పేలుళ్లు శ్రీఆంధ్రా అమ్మాయి మృతి
18 మందికి గాయాలు శ్రీదేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్
చెన్నై, మే 1 (జనంసాక్షి) :
దేశంలో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. చెన్నై విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారని హెచ్చరించిన 24 గంటల్లోనే బాంబు పేలుళ్లతో భయోత్పాతం సృష్టించారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బుధవారం పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆంధ్రా అమ్మాయి మృతి చెందగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎన్నికల వేళ విధ్వం సం సృష్టించాలన్న లక్ష్యంతో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే, చెన్నై లక్ష్యంగా జరిగిన దాడులు కావని తమిళనాడు పోలీసులు తెలిపారు. ఆంధ్ర
ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని బాంబులు అమర్చారని వెల్లడించారు. బెంగళూరు నుంచి గౌహతి వెళ్తున్న బెంగళూరు-గౌహతి రైలులో ఉదయం 7 గంటల సయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన యువతిని గుంటూరు జిల్లాకు చెందిన స్వాతి (22)గా గుర్తించారు. ఆమె బెంగళూరు నుంచి విజయవాడకు వస్తూ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ప్రమాదంలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారికి చాలా మందికి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఉదయం 7.30 గంటల సమయంలో ప్లాట్‌ఫారం నెం.9పై నిలిపి ఉంచిన రైలులో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భీతిల్లారు. పేలుళ్ల తీవ్రతకు ఎస్-3, ఎస్-4, ఎస్-5 బోగీలు దెబ్బతిన్నాయి. భారీ శబ్దం రావడంతో ప్రయాణికులతో పాటు స్టేషన్ చుట్టుపక్కల ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. బాంబు పేలుడు అని తెలిసిన వెంటనే పోలీసు, రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రైల్వేస్టేషన్‌ను అదుపులోకి తీసుకొని బాంబ్‌స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. కీలక ఆధారాలు సేకరించారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లను అప్రమత్తం చేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పేలుళ్లతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బాంబు పేలుళ్లలో ఏం వాడారనే దానిపై పోలీసులు ఇంకా ప్రకటించలేదు. దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని తేల్చారు. అయితే, ఏ బోగీలో తొలుత పేలుళ్లు జరిగాయన్నది కూడా తేల్చలేదు. తీవ్రవాదులు పేలుళ్లకు ఆర్డీఎక్స్‌తో పాటు టైమర్‌ను ఉపయోగించారు. దెబ్బతిన్న బోగీలను వేరు చేసి ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలించనున్నట్లు సదరన్ రైల్లే అధికారి విజయకుమారన్ తెలిపారు. తమిళనాడు, కర్ణాటకలలో విధ్వంసానికి కుట్ర పన్నిన తీవ్రవాది మహమ్మద్ జకీర్ హుస్సేన్‌ను అరెస్టు చేసిన రెండ్రోజులకే పేలుళ్లు జరగడం విశేషం. ప్రమాద ఘటన విషయం తెలియగానే తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు ఆదేశించింది. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.పేలుళ్లు తమిళనాడు లక్ష్యంగా జరిగినవి కావని ఆంధ్రలో పేలుళ్లు జరపాలన్న లక్ష్యంతో బాంబులు పెట్టారని తమిళనాడు డీజీపీ రామానుజం వెల్లడించారు. రైలు గంటన్నర ఆలస్యం కావడంతో చెన్నైలో పేలుళ్లు జరిగాయని తెలిపారు. పేలుళ్లకు కారకులు ఎవరనేది ఇంకా గుర్తించలేదని చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఆర్డీఎక్స్, టైమర్‌తో పేలుళ్లకు పాల్పడ్డారని వివరించారు. బాధితుల వివరాల కోసం రైల్వే శాఖ హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది. చెన్నై 044-2535 7398, 6450 2416, బెంగళూరు 080 2287 6288. పేలుడు ఘటనపై తమిళనాడు గవర్నర్ రోశయ్య దిగ్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పేలుడు ఘటనలో మృతి చెందిన స్వాతి కుటుంబానికి రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేల పరిహారం ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థం గల ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఆవిరైన ఆశలు..
గుంటూరు : భవిష్యత్తుపై ఎన్నో ఆశలు.. త్వరలోనే పెళ్లి.. ఆనందంతో ఇంటి ముఖం పట్టిన ఆ అమ్మాయి అనుకోని రీతిలో దుర్మరణం చెందింది. తమ కూతురు ఇంటికి వస్తుందనే సంతోషంలో తల్లిదండ్రులకు పిడుగు లాంటి వార్త వినపడడంతో తల్లడిల్లిపోయారు. గురువారం గౌహతి రైలు పేలుళ్లలో గుంటూరుకు చెందిన స్వాతి (22) మృతి చెందింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ‘అమ్మా బయల్దేరాను. రైలెక్కేశాను. బోగీలోకి వచ్చేశాను. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటానని’ చెప్పిన కొద్దిసేపటికే స్వాతి మాటు అవే ఆఖరి మాటలు అవుతాయని ఆమె తల్లి ఊహించుకోలేక పోయింది. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుతుందని ఆశగా ఎదుఉ చూస్తున్న తల్లిదండ్రులకు పేలుళ్లు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. తమ కుమార్తె చివరిచూపుల కోసం తల్లిదండ్రులు హుటాహుటిన రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లారు. గురువారం ఉదయం 7.30 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి స్వాతి తన తల్లికి ఫోన్ చేసింది. మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు రైలు విజయవాడ చేరుతుందని, అక్కడి నుంచి త్వరగా ఇంటికి వచ్చేస్తానని చెప్పింది. అదే ఆమె చివరి మాట అయిందని తల్లి దిగ్భ్రాంతికి గురైంది. గతేడాది టీసీఎస్‌లో ఉద్యోగిగా చేరిన స్వాతికి ఇటీవలే పెళ్లి కుదిరింది. త్వరలోనే ఆమెకు వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పేలుళ్లకు బలైపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పేలుళ్లు హేయమైన చర్య : మన్మోహన్
న్యూఢిల్లీ : చెన్నై పేలుళ్ల ఘటనను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. దీన్ని దుశ్చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని తెలిపారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారికి ఆయన తన సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని, దేశ సమగ్రతపై ఉగ్రవాదులు పాల్పడే దాడులను దేశం ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. అమాయకులు, మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రమాదంలో గాయపడిన వారికి, వారి కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారని తెలిపింది.చెన్నై పేలుళ్లు దురదృష్టకరమని రైల్వే శాఖ మంత్రి ఖర్గే తెలిపారు. చెన్నై సెంట్రల్ స్టేషన్‌లోని 9వ నెంబర్ ప్లాట్‌ఫారంపైకి వచ్చిన పది నిమిషాలకే పేలుళ్లు జరిగాయని ఆయన తెలిపారు. పేలుళ్ల ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామన్నారు. పేలుళ్లలో మృతి చెందిన స్వాతి కుటుంబానికి రూ. లక్ష నష్ట పరిహారం ఇస్తామని, గాయపడిన వారికి రూ.25 వేలు ఇస్తామని తెలిపారు.