మోడీ ఇద్దరు పెట్టుబడిదారులకే ప్రతినిధి
సిమ్లా, మే 1 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అంబానీ, అధానీ గ్రూపు సంస్థలకే ప్రతినిధి అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గురువారం హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబానీ, అధానీల ప్రయోజనాల కోసమే మోడీ గుజరాత్‌ను దారాదత్తం చేశాడని రాహుల్ ఆరోపించారు. ఆ రాష్ట్ర బడ్జెట్, భూములు అన్ని ధనికుల కోసమే కేటాయిస్తూ ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని మోడీ పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మే 7న పోలింగ్ జరగనుంది. సిమ్లా నియోజకవర్గ పరిధిలోని సోలన్ ప్రాంతంలో, హామీర్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని బిలాన్‌పూర్‌లో రాహుల్ ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా రాహుల్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని, విభజన పార్టీ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే సామాన్య ప్రజల కోసం పాటుపడుతుందని తెలిపారు. భాజపా ఒకే వ్యక్తి చేతిలో అధికారం కట్టబెట్టాలని చూస్తోందని రాహుల్ విమర్శించారు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేవలం కార్పొరేట్ల అభివృద్ధికి సంబంధించినది మాత్రమేనని అక్కడ సామాన్యులు కనీస అవసరాలు తీరక అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజలు విచ్ఛిన్నకర శక్తులకు అధికారం కట్టబెట్టవద్దని సూచించారు