ఆఫ్ఘాన్‌లో ఘోరం
కొండచరియలు విరిగిపడి 2,100 మంది మృతి
కాబూల్, మే 3 (జనంసాక్షి) :
ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోరం జరిగింది. కొం డ చరియలు విరిగిపడి మరణమృదంగం మోగింది. వేలాదిగా పౌరులు చనిపోగా, మరికొంతమంది బండరాళ్ల కింద చిక్కుకున్నట్లు సమాచారం. కొండచరియలు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 2100కు చేరిందని ఆఫ్ఘనిస్థాన్ ప్రొవిజనల్ గవర్నర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. 300 కుటుంబాలకు చెందిన సుమారు 2100 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్దారించారు. దాదాపు 4వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బదక్షన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దిగువన ఉన్న గ్రామాలను నేలమట్టం చేశాయి. దీంతో రోడ్డు మార్గాలన్నీ మూసుకుపోవడంతో సహాయ చర్యలు చేపట్టేందుకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైమానిక దళం సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు, క్షతగాత్రులను అస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే వాతావరణం కూడా సరిగా లేదని అధికారులు తెలిపారు.