అసోంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
గౌహతి, మే 3 (జనంసాక్షి) :
అస్సాంలో తీవ్రవాద దా డుల్లో మృతి చెందిన వారి సంఖ్య 32కు చేరింది. అస్సాంలో శుక్రవారం
తీవ్రవాదులు పేట్రేగిపోయారు. బోడోల్యాండ్ ప్రాదేశిక పరిపాలన ప్రాంతం (బీటీఏడీ)లో సాయుధ తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమస్యాత్మక ప్రాంతాలైన కోక్రాఝర్, బక్సా ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 23 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే, శనివారం ఉదయం నాటికి అధికారులు మరో తొమ్మిది మృతదేహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య 32కు చేరింది. దాడులకు భయపడి నదీ సమీపంలో దాక్కున్న ముగ్గురు చిన్నారులను అధికారులు రక్షించారు. శుక్రవారం నాటికి 23 మంది మృతి చెందగా, తీవ్రవాదులు హింసాకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. హింసను అరికట్టేందుకు అస్సాం ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఇదిలా ఉంటే, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు హింసాత్మక ప్రాంతాల్లో సైన్యం కవాతు నిర్వహించింది. హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. అస్సాంలో తీవ్రవాద దాడుల్ని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఖండించారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యావత్ భారతదేశం బాధితుల వెంట ఉందని భరోసానిచ్చారు. దాడులకు పాల్పడుతున్న తీవ్రవాదుల భరతం పడతామని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా దాడులను తీవ్రంగా ఖండించారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. లౌకిక దేశమైన భారత్‌లో హింసాత్మక దాడులకు తావులేదని పేర్కొన్నారు.