తొలి సర్కారు మాదే
కేసీఆర్‌కు ఫామ్ హౌస్‌లోనే విశ్రాంతి
కోవర్టులపై చర్యలు తప్పవు : టీ పీసీసీ చీఫ్ పొన్నాల
హైదరాబాద్, మే 5 (జనంసాక్షి) :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరి మద్దతు తీసుకోమని, సొంతంగానే అధికారంలోకి వస్తామని తెలిపారు. టీఆర్ ఎస్‌తో పొత్తు పెట్టుకొనే అవసరం కానీ, ప్రసక్తే కానీ లేదని స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో పొన్నాల లక్ష్మ య్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు సానుభూతితో ఉన్నార ని, ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించిందన్నారు. అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అభిప్రాయ పడ్డారు. సంక్షేమ పథకాలే మమ్మల్ని కనిపిస్తాయి.. తెలం గాణ ఎలా వచ్చిందో ప్రజలకు తెలుసు అని అన్నారు. ఎన్ని కల తర్వాత కూడా టీఆర్‌ఎస్ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ నెల 16 నుంచి కేసీఆర్‌కు విశ్రాంతేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, ఆయనను ప్రజలు నమ్మరని తెలిపారు. తెలంగాణ కేసీఆర్ వల్ల వచ్చిందని చ ెబితే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌వి తుపాకి రాముడి మాటలు అని,ఆయన మైండ్‌గేమ్ ఆడుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ అంచనాలు వాస్తవం కాబోవని అన్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం తమదే అంటూ పార్టీ శ్రేణులను, ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని తెలిపారు. కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో కూర్చొని అధికారం తమదేనంటూ మైండ్‌గేమ్ ఆడుతున్నారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని పొన్నాల తెలిపారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం కానీ, మద్దతు తీసుకోవడం కానీ ఉండదన్నారు. తాము సొంతంగానే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం కనిపించిందని చెప్పారు. తెలంగాణ ఇచ్చామనే భావనతో పాటు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి విజయం అందిస్తాయన్నారు. టీఆర్‌ఎస్ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పార్టీ అని, ఆ పార్టీ తమకు పోటీయే కాదని తెలిపారు. తెలంగాణలో టీడీపీ పనైపోయిందని, అందుకే ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందన్నారు. ఈ నెల 10 నుంచి ఎన్నికలపై సవిూక్ష నిర్వహించనున్నట్లు పొన్నాల తెలిపారు. 10న అన్ని జిల్లాలలో ఎంపీ, ఎమ్మేల్యే, జెడ్పీటీసీ అభ్యర్థులతో సవిూక్ష ఉంటుందని, 11 నుంచి మునిసిపల్ అభ్యర్థులతో సవిూక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్ని గెలుస్తాం, ఎన్ని ఓడిపోతాం, ఎక్కడ గట్టి పోటీ ఉంది, స్థానిక సంస్థలలో విజయావకాశాలు వంటి అంశాలపై ఈ సవిూక్షలో చర్చించనున్నారు. ఎన్నికలలో ప్రభావితం చేసిన అంశాలు, లోటుపాట్లు, అసమ్మతులు తదితర అంశాలపైనా దృష్టి సారించనున్నారు. సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యల ఉంటాయని పొన్నాల తెలిపారు. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జానారెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న రాంరెడ్డి దామోదరరెడ్డి వ్యాఖ్యలను పొన్నాల దృష్టికి తీసుకురాగా ఆ అభిప్రాయం ఆయన వ్యక్తిగతమన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు.