విడిపోయాయి
శాసనసభ, మండలి, సచివాలయం, ఏపీ భవన్ పంపకాలు పూర్తి
సమీక్షించిన గవర్నర్
హైదరాబాద్, మే 6
(జనంసాక్షి) :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే తేదీ దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం విభజన పనులను వేగవంతం చేసింది. జూన్ 2న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు అమల్లోకి వస్తున్నందున అసెంబ్లీ, కౌన్సిల్, సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్ల పంపిణీతో పాటు వాటిలో ఏర్పాట్లను ఈనెల 20 తేదీలోగా పూర్తి చేయాలని గవర్నర్ నరసింహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మంగళవారం గవర్నర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విభజనపై ఏర్పాటు చేసిన 21 కమిటీలు సమర్పించిన నివేదికలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని ఆదేశించారు. అలాగే పోలీసు శాఖ విభజనకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు రెండు రాష్ట్రాలకు సంబంధించి కార్యాలయాల ఏర్పాటు పూర్తి చేయాలని డీజీపీ ప్రసాద్‌రావును ఆదేశించారు. తెలంగాణకు ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ భవనాన్ని కేటాయించినందున, సీమాంధ్రకు జూబ్లీహాల్‌ను కౌన్సిల్ భవన్‌గా రూపుదిద్దాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్‌ను ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఉన్న క్యాంపు కార్యాలయాన్ని కేటాయించినందున, సీమాంధ్ర ముఖ్యమంత్రికి లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ను రూపుదిద్దాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి సీనియర్ అధికారులు దగ్గర ఉండి పనులను సమీక్షించాలని ఆదేశించారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌ను విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి కార్యాలయాలు, గదులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని గవర్నర్ తెలిపారు. అలాగే సచివాలయంలో ఏ,బీ,సీ,డీ బ్లాకులు తెలంగాణకు, జె.కె.ఎల్.హెచ్ బ్లాకులు సీమాంధ్రకు సచివాలయంగా కేటాయించినందున వీటిల్లో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయా మంత్రుల, అధికారుల గదుల ఏర్పాటు కూడా ఈనెల 20లోగా పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు. ఈనెల రెండో వారంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి హైదరాబాద్‌కు వస్తున్నందున ఈలోగా ఆయా శాఖలకు సంబంధించిన గదులు, భవనాలు ఏర్పాటు పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు. ఈ సమావేశంలో గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్ ఆహ్మద్, ఏ.ఎన్ రాయ్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.