ఎన్‌డీఏకు మద్దతివ్వం
మాయావతి స్పష్టీకరణ
లక్నో, మే 9 (జనంసాక్షి) :బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశా రు. బీజేపీ కూటమికి తమ పార్టీ దూరమని తేల్చి చెప్పారు. కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా మద్దతు ఇవ్వబోమన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఊహించినంతగా ఫలితాలు రావన్న విషయం మోడీకి తెలిపోయిందని, అందుకే జయలలిత, మమతాబెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, మాయావతి మద్దతు తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని మోడీ చెబుతున్నారని మండిపడ్డారు. జయ, ములాయం, మమత మోడీకి మద్దతిచ్చినా తాము మాత్రం మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం మాయా లక్నోలో విూడియాతో మాట్లాడారు. మోడీ ప్రభావం కేవలం విూడి యాలోనే ఉందని, గెలుపుపై బీజేపీకి నమ్మకం లేదని తెలిపారు. ‘అవసరమైతే అన్నాడీఎంకే, తృణమూల్, బీఎస్పీ మద్దతు తీసుకుంటామని ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో మోడీ చెప్పారు. మోడీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదు. ఎన్డీయేకు ఏ రూపంలోనూ మద్దతు ఇవ్వబోం’ అని తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రారంభంలో ఏ పార్టీ మద్దతు తీసుకోమని, సొంతం గానే ప్రభుత్వంలోకి వస్తామన్న మోడీ.. ఇప్పుడెందుకు మద్దతు కోరుతున్నారని ప్రశ్నించారు. విజయావకాశాలు ఉన్న ఏ పార్టీ కూడా ఇతర పార్టీల మద్దతు కోరదని మాయా గుర్తు చేశారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, మైనార్టీల ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.