నేడే మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు


తెేలనున్న 10 కార్పొరేషన్లు, 146 మున్సిపల్‌ అభ్యర్థుల భవితవ్యం
గట్టి భద్రతా ఏర్పాట్లు చేశాం : రమాకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌, మే 11 (జనంసాక్షి) :
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 30న జరిగిన పది నగర పాలక, 146 పురపాలక సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం బుద్ధభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మొత్తం 65 కేంద్రాల్లో 150 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇందుకుగానూ 8వేల మంది సిబ్బందిని వినియోగిస్నున్నట్లు చెప్పారు. గట్టి పోలీస్‌ బందోబస్తు మధ్య లెక్కింపు జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు 35 వార్డుల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్టు చెప్పారు. లెక్కింపు పరిసర ప్రాంతాలతో పాటు ఆయా మునిసిపాలిటీల్లో కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం తర్వాతే ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్‌ఆఫీషియో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
13 జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు..
అలాగే, ఏప్రిల్‌ 7, 11 తేదీల్లో జరిగిన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. 16,214 ఎంపీటీసీి, 1,093 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందుకుగానూ 2,099 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రమాకాంత్‌రెడ్డి వివరించారు. వీరికి బ్యాలెట్‌ పేపర్‌ వినియోగించినందున ఓట్ల లెక్కింపు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. సాయంత్రం వరకు పూరిస్థాయి ఫలితాలు వెల్లడవుతాయని అన్నారు. స్థానిక సంస్థల ఓట్లలెక్కింపు సందర్భంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయన ఆదేశించారు. మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇవి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.