మున్సిపల్‌లో హస్తం హవా
22 మున్సిపాల్టీలు, 2 కార్పొరేషన్‌లో గెలుపు
మెజార్టీ డివిజన్లు, వార్డులు కాంగ్రెస్ ఖాతలోకి
8 మున్సిపాల్టీలు, 1 కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ పాగా
భైంసాలో ఎంఐఎం, నిర్మల్‌లో బీఎస్పీ విజయం
హైదరాబాద్, మే 12 (జనంసాక్షి):
మున్సిపల్స్‌లో హస్తం హవా కొనసాగింది. మెజార్టీ స్థానాలు గెలుపొంది తన ప్రాభావాన్ని చాటింది. ఇప్పటివరకూ 19 మున్సిపాల్టీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రధానంగా పట్టున్న వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ గట్టి పోటీనిచ్చింది. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు పలు జిల్లాల్లో తన ఉనికిని చాటుకుంది. అయితే ఇతరులే ఎక్కువగా వార్డుల్లో గెలవడంతో టీఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ, ఎంఐఎం, బీఎస్పీ ఒక్కో మున్సిపాల్టీలను దక్కించుకున్నాయి.
ఆదిలాబాద్‌లో పోటాపోటీ..
ఆదిలాబాద్ జిల్లాలో ఏ పార్టీ పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించలేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోటాపోటీగా తలపడ్డాయి. ఆరు మున్సిపాల్టీల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చేరో రెండు గెలుచుకోగా, నిర్మల్‌లో బీఎస్పీ, భైంసాలో ఎంఐఎం చేరో చోట గెలిచి సత్తా చాటాయి. ఆదిలాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాల్టీలను టీఆర్‌ఎస్ దక్కించుకోగా, బెల్లంపల్లి, మంచిర్యాల మున్సిపాల్టీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.
నిజామాబాద్‌లో కాంగ్రెస్ హవా..
నిజామాబాద్‌లో కాంగ్రెస్ సత్తా చాటింది. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ మున్సిపాల్టీల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఎవరికి అధికారం దక్కనుందనేది ఉత్కంఠగా మారింది. ఇక్కడ ఇతరులే అత్యధిక చోట్ల గెలుపొందడం విశేషం. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ 10, టీఆర్‌ఎస్ 10, బీజేపీ 6, ఎంఐఎం 15, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. ఇక్కడ ఎంఐఎం ఆధిక్యత కనబరచడం విశేషం. కామారెడ్డిలో మొత్తం 33 వార్డులకు ఎన్నికలు జరుగగా.. 181 మంది బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ 17 స్థానాలను గెలుచుకొని చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకుంది. బోధన్‌లో 35 వార్డులకు గాను కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలుపొంది, స్వతంత్రుల మద్దతుతో చైర్మన్ పదవిని చేపట్టనుంది. ఇక్కడ టీఆర్‌ఎస్ 9, టీడీపీ ఒకచోట గెలువగా, 10 మంది ఇతరులు విజయం సాధించారు. ఆర్మూర్ మునిసిపాలిటీలో 23 వార్డులకు గాను.. ఎవరికీ పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. 11 స్థానాల్లో కాంగ్రెస్, 10 చోట్ల టీఆర్‌ఎస్, ఒకచోట టీడీపీ
గెలుపొందగా, ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు.
కరీంనగర్‌లో కారు జోరు..
కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ జోరు కొనసాగింది. కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి దక్కించుకుంది. అలాగే, జిల్లాలోని మొత్తం తొమ్మిది మున్సిపాల్టీలకు ఐదింటిని దక్కించుకుంది. సిరిసిల్ల, జమ్మికుంట, హుస్నాబాద్, హుజురాబాద్, మెట్‌పల్లి మున్సిపాల్టీల్లో కారు జోరు కొనసాగింది. జగిత్యాల, కోరుట్ల మున్సిపాల్టీలను కాంగ్రెస్ దక్కించుకోగా, వేములవాడలో బీజేపీ పాగా వేయగా, పెద్దపల్లిలో హంగ్ ఏర్పడింది.
వరంగల్ ‘హస్త’గతం..
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తం ఐదు మున్సిపాల్టీలకు కాంగ్రెస్ జనగామ, నర్సంపేట, మహబూబాబాద్ మున్సిపాల్టీలను దక్కించుకుంది. పరకాల మున్సిపాల్టీలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించగా, భూపాలపల్లిలోని 20 వార్డులకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చేరో 7 స్థానాలు దక్కించుకున్నాయి. ఇతరులు 3, టీడీపీ 2, వామపక్షాలు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక్కడ ఇతరులు ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ చైర్మన్ స్థానాన్ని అధిష్టించనుంది.
ఖమ్మంలో..
ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ కూడా పూర్తి ఆధిక్యత ప్రదర్శించలేదు. మొత్తం నాలుగు మున్సిపాల్టీలకు కాంగ్రెస్, టీడీపీ చేరో మున్సిపాల్టీ దక్కించుకోగా, వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ మరో చోటా అధికారం చేపట్టనుంది. కొత్తగూడెం మునిసిపాలిటీని కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో కైవసం చేసుకోనుంది.
నల్లగొండలో కాంగ్రెస్ హవా..
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ గత ప్రాభావం చాటుకుంది. మొత్తం 7 మున్సిపాల్టీలకు ఆరింటిని సాధించి పట్టు నిలుపుకుంది. నల్లగొండ మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. 40 వార్డులకు గాను 22 చోట్ల కాంగ్రెస్, టీడీపీ, 4, టీఆర్‌ఎస్2, వామపక్షాలు 2, ఇతరులు 10 చోట్లు గెలుపొందారు. సూర్యాపేటలో టీడీపీ ఆధిక్యం సాధించింది. 34 వార్డులకు గాను 12 చోట్ల టీడీపీ, కాంగ్రెస్ 9, టీఆర్‌ఎస్ 4, వామపక్షాలు 3, ఇతరులు 6 స్థానాలు కైవసం చేసుకున్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. మొత్తం 36 వార్డులకు గాను 30 వార్డులు సాధించి చైర్మన్ పీఠం దక్కించుకుంది. టీఆర్‌ఎస్, వామపక్షాలు, ఇతరులు చేరో రెండు చోట్ల గెలుపొందారు. కోదాడలోని 30 వార్డులకు గాను కాంగ్రెస్ 14, టీడీపీ 13, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. హుజూర్‌నగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ 10 స్థానాలు గెలిచి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. టీడీపీ, వామపక్షాలు చేరో మూడు, ఇతరులు 4 సీట్లు కైవసం చేసుకున్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌లలో టీఆర్‌ఎస్ ఇక్కడ ఖాతా కూడా తెరవలేదు. దేవరకొండలోని 20 వార్డులకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, ఇతరులు చేరో మూడు చోట్ల గెలుపొందారు. భువనగురిలోని 30 వార్డులకు గాను ఇతరులు 14 చోట్ల, కాంగ్రెస్ 8, టీడీపీ 7, వామపక్షాలు ఒకచోట విజయం సాధించారు.
మెదక్‌లోనూ కాంగ్రెస్..
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తం ఆరు మున్సిపాల్టీలకు నాలుగు చోట్ల ఆధిక్యం చాటుకుంది. సదాశివపేటలోని 23 వార్డులకు గాను 13 చోట్ల గెలిచిన కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. టీఆర్‌ఎస్ 5, టీడీపీ 2, ఇతరులు 3 చోట్లు గెలుపొందారు. జహీరాబాద్‌లోని 24 వార్డులకు గాను 12 చోట్ల కాంగ్రెస్, టీఆర్‌ఎస్ 5, టీడీపీ 3, ఇతరులు 5 చోట్ల విజయం సాధించారు. ఆందోల్-జోగిపేటలోని 20 స్థానాలకు గాను 13 చోట్ల కాంగ్రెస్ గెలుపొంది చైర్మన్ గిరి కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్ 4, టీడీపీ 2, ఇతరులు 1 స్థానం దక్కించుకున్నారు. గజ్వేల్ మునిసిపాలిటీని టీడీపీ దక్కించుకుంది. మొత్తం 20 స్థానాలకు గాను 10 చోట్ల టీడీపీ, టీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 1 స్థానం కైవసం చేసుకున్నాయి. మెదక్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యత చాటింది. 27 వార్డులకు గాను 11 చోట్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్ 6, టీడీపీ 5, ఇతరులు5 చోట్ల విజయం సాధించారు. సంగారెడ్డిలోని 31 వార్డులకు గాను కాంగ్రెస్ 10, టీఆర్‌ఎస్ 2, వామపక్షాలు 1, ఇతరులు 18 చోట్ల గెలుపొందారు.
రంగారెడ్డిలో ¬రా¬రీ
రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల ¬రా¬రీ పోరు నెలకొంది. చేరో రెండు మున్సిపాల్టీలకు దక్కించుకోగా, ఒకచోట టీఆర్‌ఎస్ ఆధిక్యం సంపాదించింది. తాండూర్‌లోని 31 వార్డులకు గాను 11 చోట్ల ఇతరులు గెలుపొందగా, టీఆర్‌ఎస్10, కాంగ్రెస్ 8, టీడీపీ2 స్థానాలు దక్కించుకున్నాయి. వికారాబాద్‌లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధించింది. ఆ పార్టీకి 14 స్థానాలు రాగా, టీడీపీ 7, టీఆర్‌ఎస్ 5, ఇతరులు 2 స్థానాలు దక్కించుకున్నారు. పెద్దఅంబర్‌పేటలోని 20 వార్డులకు టీడీపీ 9, కాంగ్రెస్ 6, వామపక్షాలు 1, ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు. బడంగ్‌పేటలో 15 స్థానాలతో కాంగ్రెస్ చైర్మన్ గిరి సాధించింది. ఇతరులు 4, టీడీపీ 1 స్థానం దక్కించుకునున్నాయి. ఇబ్రహీంపట్నంలోని 20 వార్డులకు గాను టీడీపీ 10, కాంగ్రెస్ 4, టీఆర్‌ఎస్ 1, ఇతరులు 5 స్థానాలు కైవసం చేసుకున్నారు.
మహబూబ్‌నగర్‌లో..
ఎనిమిది మున్సిపాల్టీలకు రెండు చోట్ల కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ చేరో మున్సిపాల్టీల్లో విజయం సాధించాయి. మరో మూడు చోట్ల ఉత్కంఠ నెలకొంది. గద్వాల్‌లోని 33 వార్డులకు గాను కాంగ్రెస్ 23 చోట్ల విజయం సాధించి అధికారం దక్కించుకుంది. టీఆర్‌ఎస్ 9, ఇతరులు 1 స్థానం కైవసం చేసుకున్నారు. నారాయణపేటలోని 23 వార్డులకు గాను ఇతరులు 15, కాంగ్రెస్, టీడీపీ చేరో 3 చోట్ల గెలుపొందగా, టీఆర్‌ఎస్ 2 స్థానాలు దక్కించుకుంది. వనపర్తిలో ఎవరికి మెజార్టీ రాలేదు. మొత్తం 26 వార్డులకు గాను ఇతరులు 9 చోట్ల, టీడీపీ 8, కాంగ్రెస్ 7, టీఆర్‌ఎస్ 2 స్థానాలు కైవసం చేసుకున్నాయి. షాద్‌నగర్‌లోని 23 వార్డులకు గాను కాంగ్రెస్ 15 చోట్ల గెలిచి చైర్మన్ పీఠం దక్కించుకుంది. టీఆర్‌ఎస్ 1, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు. నాగర్ కర్నూల్‌లో బీజేపీ ఆధిక్యతం సాధించింది. 8 చోట్ల ఇతరులు, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చేరో ఆరు వార్డులు సాధించాయి. ఐజలో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. 20 వార్డులకు 16 గెలిచి చైర్మన్ పీఠం దక్కించుకోగా, కాంగ్రెస్ 4 స్థానాలతోనే సరిపెట్టుకొంది. కల్వకుర్తిలోని 20 వార్డులకు గాను ఇతరుల 9, కాంగ్రెస్ 6, టీఆర్‌ఎస్ 5 స్థానాలు దక్కించుకున్నాయి. మహబూబ్‌నగర్‌లోని 41 వార్డులకు గాను 17 చోట్ల ఇతరులు గెలుపొందారు. కాంగ్రెస్ 14, టీఆర్‌ఎస్ 7, టీడీపీ 3 చోట్ల గెలుపొందాయి.