పాతబస్తీలో ఉద్రిక్తత

]పోలీసు కాల్పులు.. ఇరువురి మృతి
పరిస్థితి అదుపులో ఉంది : డీజీపీ
హైదరాబాద్‌, మే 14 (జనంసాక్షి) :
రాజధానిలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలో చెలరేగిన అల్లర్లు పోలీసుల కాల్పులకు దారి తీశాయి. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో తొమ్మిది తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని సిఖ్‌చౌని, కిషన్‌బాగ్‌ పరిసరాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక వర్గానికి చెందిన జెండాను కాల్చివేశారని పుకార్లు వ్యాప్తి చెందడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒక వర్గం వారి ఇళ్లపై, షాపులపై మరో వర్గం వారు దాడులకు దిగారు. దీంతో ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, తొమ్మిది మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కర్ఫ్యూ విధించారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నామని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. పుకార్లు నమ్మవద్దని ప్రజలను కోరారు. సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు. ప్రస్తుతం అంతా అదుపులోని ఉందని ఆయన చెప్పారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, శాంతిని పునరుద్ధరించేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఘర్షణలు పాతబస్తీకి వ్యాప్తి చెందకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిషేధాజ్ఞలు విధించడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. చార్మినార్‌ చుట్టుపక్కల షాపులను మూసివేయించారు. ఇదిలా ఉంటే, పాతబస్తీలని సిఖ్‌చౌనీ ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌ ఆరా తీశారు. కర్ఫ్యూ విధింపుపై ఆయన సమీక్షించారు. పాతబస్తీలో నెలకొన్న పరిస్థితులపై డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని గవర్నర్‌ సూచించారు. జంట నగర ప్రజలంతా సామరస్యాన్ని పాటించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలది గంగా, జమున, తహజీబ్‌గా ప్రసిద్ధి చెందినదని.. జంటనగరాల బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడుకుందామని కోరారు. ప్రజలు సంయమనం పాటించి సామరస్యంగా జీవించేందుకు సన్నద్ధులు కావాలని పిలుపునిచ్చారు. తప్పు చేసిన వారిని చట్టం కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు. పాతబస్తీలో శాంతి పరిఢవిల్లాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, వదంతులు నమ్మొద్దని ఆయన కోరారు.