కిషన్‌బాగ్ అల్లర్లపై గవర్నర్ సీరియస్
మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
మృతుల కుటుంబాలకు ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియా
గాయపడిన వారికి ఉచిత వైద్యంతో పాటు రూ.50 వేల సాయం
ఈ కాల్పులు జరుపుతున్న వ్యక్తి ఎవరు?
పోలీసులతో తల్వార్లతో వీరెందుకున్నారు?
అల్లర్లపై అనుమాన కోణాలు
హైదరాబాద్, మే 15 (జనంసాక్షి) :
కిషన్‌బాగ్ అల్లర్లపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సీరి యస్ అయ్యారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. నగరంలోని కిషన్‌బాగ్‌లో జరిగిన అల్లర్లపై న్యాయవిచారణ జరిపించేందుకు గవర్నర్ నరసింహన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహం తి, డిజిపి ప్రసాదరావు, హోం శాఖ కార్యదర్శి, పలువురు పోలీసు అధికారులతో గవర్నర్ సమావేశం నిర్వహించారు. అల్లర్ల సందర్భంగా పోలీసులు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో కూడా వివరణ కోరాలని డిజిపిని ఆదేశించారు. అల్లర్ల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెం దిన వారి కుటుంబానికి ఆరు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులైన వారికి 50 వేల రూపాయలు నష్టప రిహారం అందించాలని ఆదేశించారు. అలాగే గాయపడి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా గవర్నర్ సూచించారు. అల్లర్ల కారణంగా ఆస్తులు కోల్పోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టప రిహారం చెల్లించాలని గవర్నర్ ఆదేశించారు. కాగా కిషన్ బాగ్‌లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో డిజిపి ప్రసాదరావు, ఇంటలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి
పర్యటించారు. 16న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంలో పోలీసులు శాంతిభద్రతలను కాపాడడంలో అప్రమత్తంగా ఉండాలని డిజిపి ఆదేశించారు. ఘర్షణల్లో ఆస్తులు నష్టపోయినవారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయం అందించనున్నట్లు గవర్నర్ తెలిపారు. పాతబస్తీ ప్రజలందరకూ ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఘటనలో గాయపడిన వారంతా ప్రస్తుతం ఉస్మానియా, ప్రీమియర్, నిమ్స్, అపోలో, కేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ కాల్పులు జరుపుతున్న వ్యక్తి ఎవరు?
పోలీసులతో తల్వార్లతో వీరెందుకున్నారు?
అల్లర్లపై అనుమాన కోణాలు
హైదరాబాద్ :కిషన్‌బాగ్‌లోని సిక్‌చావ్నీలో బుధవారం చెలరేగిన అల్లర్లలో ఒక వ్రైవేటు వ్యక్తి తుపాకులతో కాల్పులు జరపడంపై గవర్నర్ నరసింహన్ పోలీసు ఉన్నతాధికారులను ఆరాతీశారు. ఒక వ్యక్తి తన చేతిలో రివాల్వల్‌తో ఘర్షణ జరుగుతున్న ప్రాంతంలో హల్‌చల్ సృష్టించాడు. ఎదుటి వర్గం వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. తన చేతుల్లోని రివాల్వల్‌ను ఎదుటి వర్గం వారిపైకి ఎక్కుపెట్టాడు. అయితే సదరు వ్యక్తి ఎవరు, ఆయన ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్ల సమక్షంలో సదరు వ్యక్తి రివాల్వర్ తిరుగుతున్న వాళ్లు ఏం చేస్తున్నారో అంతుపట్టడం లేదు. అలాగే ఘర్షణలకు కారకులుగా భావిస్తున్న వర్గీయులు తల్వార్లతో పోలీసుల మధ్యనే ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే వారు ఎదుటి వర్గంపై దాడులకు దిగినట్లుగా ఫొటో క్లిప్పింగులు కూడా ఉన్నాయి. మారణాయుధాలతో వారు దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది అనే సందేహాలు కూడా ముసురుకుంటున్నాయి. కిషన్‌బాగ్ అలర్లపై అనేక అనుమానపు కోణాలు ఉన్నాయి. వాటిపై సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే వారిని కూడా కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.