తెలంగాణ సమస్యల పరిష్కారానికి సహకరించండి

గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ
కలిసి పనిచేద్దాం
తెలంగాణ పునర్నిర్మిద్దాం

నా పూర్తి సహకారం అందిస్తా : గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌, మే 18
(జనంసాక్షి) :
తెలంగాణ సమస్యల పరిష్కారానికి సహకరించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. టీఆర్‌ఎస్‌ శాస నసభ పక్షనేతగా ఎన్నికైన అనంతరం ఆయన ఆదివారం రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సం దర్భంగా పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్‌ నరసింహన్‌కు తీర్మాన పత్రా న్ని అందజేసింది. ఈ సందర్భంగా కేసీఆర్‌, గవర్నర్ల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్టు సమాచారం. తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి విషయంలో సంపూర్ణ సహకారాలు అందించారని కేసీఆర్‌ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి నాళ్లలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉంటుందని, దీనిని అధిగమించేందుకు మరిన్ని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంలో కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో గవర్నర్‌ సైతం కేసీఆర్‌ను ఉద్దేశించి ‘పవరే మీ చేతిలో ఉంది. విద్యుత్‌ సమస్య ఎంత’ అంటూ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహకరించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు గవర్నర్‌ పలు సూచనలు చేసినట్టు తెలిసింది. ప్రజలు పెట్టుకున్న ఆశలను ఒమ్ము ఏయవద్దని అందుకు అనుగుణంగా పనిచేద్దామని కేసీఆర్‌తో గవర్నర్‌ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో కేసీఆర్‌ సైతం తెలంగాణకు మీరు అండగా ఉంటే అభివృద్ధిని ఏస్థాయిలో చేతనైతే ఆ స్థాయిలో చేద్దామని కోరినట్టు తెలిసింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి తమ ప్రభుత్వం పాటు పడుతుందని, అందుకు సహకరించాలని కేసీఆర్‌, గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై పార్టీ నేతలు చేసిన విమర్శలను కూడా గవర్నర్‌ నవ్వుతూ ప్రస్తావించినట్లు తెలిసింది. అధికార స్థానంలో కూర్చున్న తనకు ఎవరిపై, ఏ ప్రాంతంపై రాగద్వేషాలు ఉండవని ఆయన తెలిపినట్లు సమాచారం. తన బాధ్యత తాను నిర్వర్తించానని గవర్నర్‌ చెప్పినట్లు తెలిసింది.