స్థానికత ఆధారంగానే పంపకాలు జరగాలి
కేంద్ర మార్గదర్శకాలు అశాస్త్రీయం
మరో పోరాటానికి సిద్ధం : కోదండరామ్
మెదక్, మే 24 (జనంసాక్షి) :
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కో దండరామ్ డిమాండ్ చేశారు. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే పని చేయా లని కోదండరామ్ అన్నారు. రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకే విభజన జరగాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపత్యంలో ఉ ద్యోగుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం వెలువరించిన
మార్గదర్శకాలు అసంబద్ధంగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై అవగాహన లేని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో విభేదిస్తున్నామని తెలిపారు. ఆర్టికల్ 371 (డి), రాష్ట్రపతి ఉత్తర్వులు, రాష్టాల్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు రూపొందించలేదని తెలిపారు. కేవలం రాష్ట్ర స్థాయి పోస్టులే కాకుండా కింది స్థాయి పోస్టులలో ఉన్న ఉద్యోగులు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో పని చేయాలన్నారు. తాత్కాలిక కేటాయింపుల్లోనూ ఇదే విధానం పాటించాలని కోరారు. ఉద్యోగుల విభజనపై టీ-టీడీపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజనపై వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి కింది స్థాయి కార్యాలయాల వరకు ఏ ప్రాంతం వారు వారు ఆ ప్రాంతంలోనే పని చేయాలని కోరారు. గతంలో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి తెలంగాణలో ఉద్యోగాలు పొందిన వారు సీమాంధ్రకు వెళ్లిపోవాల్సిందేనని అన్నారు. తప్పుడు ధ్రువీకరణలు సమర్పించే అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు.