చిన్నారుల పట్టుదలకు ఎవరెస్ట్ శిఖరం లొంగిపోయింది
రెండు రికార్డులను సొంతం చేసుకున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు
అత్యున్నత శిఖరంపై తెలంగాణ ఖ్యాతి
మువ్వన్నెల జెండా రెపరెప
అంబేద్కర్, శంకరన్‌కు ఘన నివాళి
అభినందించిన కేసీఆర్
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు పూర్ణ
తొలి దళిత విద్యార్థి ఆనంద్
వెన్నుతట్టి ముందుకు నడిపిన
డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
పట్టుదల, దీక్ష, అంకితభావం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఉన్నత శిఖరం అంటే ఎవరెస్ట్ ఎత్తంత. సాహికుల స్వప్నం ఎవరెస్టు అధిరోహనే. అందుకు ఎంతో కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షతో పాటు భారీగా డబ్బు అవసరం. కానీ సంకల్పం ఉంటే ప్రపంచంలోని ఎత్తయిన ఎవరెస్టు శిఖరమే తలవంచుతుందని చాటారు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థలకు చెందిన ఆణిముత్యాలు. అత్యున్నత శిఖరంపై తెలంగాణ ఖ్యాతిని చాటారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దళితుల అభ్యున్నతే లక్ష్యంగా అహర్నిశలు కృషి సల్పిన శంకరన్‌ల చిత్రపటాలను ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. ఈ కృత్రిమ పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు. అందునా సాంఘిక సంక్షేమ గురుకులాలంటే మరింత చిన్నచూపు. కానీ మట్టిలో మాణిక్యాలుంటాయి. వాటికి సానబెడితే కోహినూర్ వజ్రాలవుతాయి. చదువులు ఆటపాటల్లోనే కాదు.. ఏకంగా ఎవరెస్టు శిఖరానికి ఎగబాకడంలో నేడు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఈ మార్పు ఒక్కరోజులో జరిగింది కాదు. ఈ సొసైటీకి కార్యదర్శిగా డాక్టర్ ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు చేపట్టాక పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గురుకులాలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. న భూతో న భవిష్యత్ అన్న చందంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాయి. అందుకే పేరున్న ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థుల్ని ఈ పాఠశాలలకు తీసుకువచ్చి చేర్పిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మొన్నటి వరకు ఈసడింపులు, నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్న గురుకులాలు ఇప్పుడు విద్యార్థుల వికాసానికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్నాయి. అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్నాయి. గురుకుల విద్యార్థులు ఎవరెస్టుపై భారత జాతీయ పతాకాలను రెపరెపలాడించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. అడుగడుగునా ప్రతిబంధకాలు.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించారు విద్యార్థులు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దళితుల అభ్యున్నతే లక్ష్యంగా అహర్నిశలు కృషి సల్పిన శంకరన్‌ల చిత్రపటాలు ప్రపంచంలోనే అతి ఎత్తయిన మౌంట్ ఎవరెస్టుపై ఆదివారం సగర్వంతో నిలిపారు గురుకులాల చిన్నారులు. వీరిని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు.
హైదరాబాద్, మే 25 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మలావత్ పూర్ణ, ఖమ్మం ఎస్సీడబ్ల్యూఆర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాధనపల్లి ఆనంద్ ఆదివారం ఉదయం ఆరు గంటలకు ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరంపై భారత జాతీయ పతాకాన్ని ఉంచి సెల్యూట్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్, ప్రముఖ ఐఏఎస్ అధికారి దివంగత శంకరన్‌ల చిత్రపటాలు ఉంచి ఘన నివాళులర్పించారు. ఎవరి వల్ల తాము ఇంతటి ఉన్నత శిఖరం వరకు చేరుకోగలిగామో వారికి వినమ్రంగా నమస్కరించారు. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ విద్యార్థులుగా వీరు అపూర్వమైన ఘనతను తమ సొంతం చేసుకున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ (13) అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. అలాగే ఎవరెస్టుపై కాలు మోపిన తొలి దళిత విద్యార్థిగా ఆనంద్ చరిత్ర సృష్టించాడు. పూర్ణ తల్లిదండ్రులు దినసరి కూలీలు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం నుంచి గురుకులంలో చదువు కోసం ప్రవేశించిన పూర్ణలోని చురుకుదనాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు, అధికారులు ఆమెను ఎవరెస్టు అధిరోహణ దిశగా ప్రోత్సహించారు. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా కోరి పోస్టింగ్ తెచ్చుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విద్యార్థులను చదువుల్లోనే కాదు అన్ని రంగాల్లో ప్రోత్సహించారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్ తండ్రి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతడిది పేద కుటుంబమే. చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండే ఆనంద్, పూర్ణతో పాటు మరికొంత మంది విద్యార్థులను సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మౌంట్ ఎవరెస్టు అధిరోహణం దిశగా ప్రేరేపితులను చేశారు. ఎవరెస్టు అధిరోహణ అంటే ఆశామాషీ విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ పర్వతాన్ని గడిచిన 62 ఏళ్లలో వందలాది మంది అధిరోహించారు. కానీ ఈ ప్రయత్నంలో రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం, తీవ్రమైన చలి, అత్యధిక పీడనం, ఆపై అత్యంత ఎత్తయిన లక్ష్యాన్ని చేరుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఇందుకోసం విద్యార్థులకు ఎంతో శిక్షణ కావాలి. వారిని మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయాలి. లక్ష్యం తప్ప వారికి మరేమి కనిపించకూడదు. ఈ క్రమంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీసుకున్న చొరవ విద్యార్థులను ఎవరెస్టుపైకి ఎగబాకేలా చేసింది. 52 రోజుల పాటు సాగిన వీరి సాహస యాత్రం ఆదివారం ఉదయం లక్ష్యాన్ని ముద్దాడింది. సురక్షితంగా గమ్య స్థానానికి చేరకున్న పూర్ణ, ఆనంద్ ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉన్నారు. మరో వారం రోజుల తర్వాత కాని వారు నిర్దేశిత క్యాంపునకు చేరుకోలేరు. అంతవరకు కూడా అదే అప్రమత్తత అవసరం.
పూర్ణ, ఆనంద్‌ల సాహస యాత్ర ఏప్రిల్ 4న ప్రారంభమైంది. వారివురితో పాటు 47 మంది సభ్యుల బృందం హైదరాబాద్ నుంచి నేపాల్‌కు పయనమయ్యింది. వీరు శిక్షకుడు శేఖర్‌బాబు, అధికారులతో కలిసి చైనాకు చేరుకున్నారు. అక్కడ భారత్‌తో పాటు టిబెట్, చైనా, నేపాల్‌కు చెందిన శిక్షకుల బృందం నేతృత్వంలో నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మే 4న విద్యార్థులు ఎవరెస్ట్ అధిరోహణ సాహస యాత్ర ప్రారంభించారు. మే 14న 21,100 అడుగుల ఎత్తైన నార్త్‌కోల్ శిఖరాన్ని వీరు అధిరోహించారు. ఈనెల 23న 7800 అడుగుల ఎత్తులోని క్యాంపు రెండుకు చేరారు. 24 మధ్యాహ్నం అత్యంత క్లిష్టమైన డెత్ జోన్‌కు చేరుకున్నారు పూర్ణ, ఆనంద్. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఈ డెత్ జోన్ నుంచి 8,800 అడుగుల లక్ష్యాన్ని చేరుకోవడం అంటే ప్రాణాలకు సైతం తెగించడమే. నిట్టనిలువుగా ఉండే ఇక్కడి నుంచి శిఖరాన్ని అధిరోహించే వరకు అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలి. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలతో బయట పడటం సాధ్యం కాదు. ఇక్కడ మృతిచెందిన వారి మృతదేహాలను కూడా తీసుకురావడం అసాధ్యమే. ఇలాంటి చోటు నుంచి శనివారం రాత్రి 9.30 అడ్వెంచర్ అసలు యాత్ర మొదలు పెట్టారు పూర్ణ, ఆనంద్. ఉదయం 6 గంటలకు శిఖరాన్ని అధిరోహించారు. మరో గంట తర్వాత ఆనంద్ శిఖరం భారత జాతీయ పతాకాన్ని ఎగురువేసి వందనం చేశారు. అనంతరం అంబేద్కర్, శంకరన్ చిత్రపటాలను ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన విద్యార్థులు ఇంతటి సాహసకృత్యానికి పూనుకోవడం, లక్ష్యాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా అధిరోహించడం ఏదో ఒక్కరోజులో జరిగిన విషయం కాదు. ఇంతటి సాహస యాత్రకు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడంలో నూటికి నూరుపాళ్లు విజయం సాధించారు సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్. తాను చదువుకున్న విద్యాసంస్థలకు కార్యదర్శిగా అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రవీణ్‌కుమార్ తన జాతికి ఏదో చేయాలనే సంకల్పంతో పోలీసు శాఖలో కీలక హోదా దక్కే అవకాశం ఉన్న వదులుకొని విద్యాసంస్థలను పరిపుష్టం చేయడంలో మమేకమయ్యారు. కెరియర్ గైడెన్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో గురుకుల విద్యార్థులు ఇప్పుడు సత్తా చాటుతున్నారంటే అందులో ప్రవీణ్‌కుమార్ కృషి, చొరవ అంతా ఇంతా కాదు. మట్టిలో మాణిక్యాలు ఉంటారని, వారిని గుర్తించి మెరుగు పెడితే వజ్రాలవుతారని నిరూపించారు ప్రవీణ్‌కుమార్. విద్యార్థుల సాహస యాత్ర విజయవంతమైన సందర్భంలో ఆయన ఆనందంతో పొంగిపోయారు. విద్యార్థుల కృషిని, పట్టుదలను కొనియాడారు. వారు జూన్ మూడో తేదీన నేపాల్‌లోని క్యాంపునకు తిరిగి చేరుకుంటారని చెప్పారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌లను పొగడ్తలు, ప్రశంసల్లో ముంచెత్తారందరూ. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విద్యార్థులను అభినందించారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తలా రూ.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు.
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలిగా ఘనూతికెక్కిన మలావత్ పూర్ణ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన వారు. మలావత్ దేవిదాస్, లక్ష్మీ దంపతులకు 10 జూన్ 2000 సంవత్సరంలో జన్మించిన పూర్ణ లంబాడ కులానికి చెందిన విద్యార్థిని. పూర్ణ సోదరుడు పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన వీరి సంవత్సరాదాయం కేవలం 35 వేలు. 2010లో గురుకుల విద్యాలయంలో ఆమె ఆరో తరగతిలో అడ్మిషన్ పొందారు. ఎవరెస్టు శిఖరం అధిరోహణ పూర్వం ఆమె అనేక పర్వతాలను అధిరోహించారు. దక్షిణ సిక్కింలోని హిమాలయ మౌంటేనేరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. 2013 నవంబర్ 10న డార్జిలింగ్‌లోని 17 అడుగుల ఎత్తయిన పర్వతాన్ని ఆమె అధిరోహించారు.
మరో విద్యార్థి సాధనపల్లి ఆనంద్‌కుమార్ ఖమ్మం జిల్లా మారుమూల మండలమైన చర్లలోని కల్లివేరు గ్రామానికి చెందిన వారు. కొండల్‌రావు, లక్ష్మి దంపతులకు 18 ఏప్రిల్ 1996లో జన్మించిన ఆనంద్‌కుమార్ అన్నపురెడ్డిపల్లిలోని గురకుల కళాశాలలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కొండల్‌రావు గ్రామంలో సైకిల్ రిపేరింగ్ షాప్ నిర్వహిస్తుండగా, లక్ష్మి అంగన్‌వాడీ కేంద్రంలో ఆయా. 7వ తరగతిలోనే చదువుకు స్వస్తి పలికిన ఆనంద్ వాచ్‌మన్‌గా పనికి కుదిరాడు. కానీ అతడి తండ్రి కొండల్‌రావు అన్నరెడ్డిపల్లిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఎనిమిది తరగతిలో చేర్పించాడు. చదువుతో పాటు కబడ్డీ, హ్యాండ్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచే అతడిని అధికారులు ఎవరెస్ట్ అధిరోహణ దిశగా ప్రోత్సహించారు. అంతే పట్టుదలతో ప్రయత్నించి ఆనంద్ ఆదివారం లక్ష్యాన్ని చేరుకున్నాడు. వీరివురి స్వగ్రామాల్లోనూ, పాఠశాలల్లోనూ పండుగ వాతావరణం కనిపించింది.