సర్కారు ఏర్పాటు చేయండి

kcr

తెరాస చీఫ్‌కు గవర్నర్‌ ఆహ్వానం

జూన్‌ 2న ప్రమాణం

హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) :తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్‌ కె. చంద్రశేఖర్‌రావుకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ నుం చి ఆదేశం అందింది.  ఈ మేరకు కేసీఆర్‌కు రాజ్‌భవన్‌ వర్గాలు అధికారిక సమాచారం పంపారు. రాజ్‌భవన్‌లో నిర్వహించే ప్రమాణస్వీకార కార్యక్రమంలో జూన్‌ 2 తేదీ ఉదయం 8:15కు సీఎంగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత గా కేసీఆర్‌ ఎంపికయ్యారు. దీంతో 2వ తేదీన తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు మంగళం పాడనున్నారు. అదేరోజు సీఎంగా కెసిఆర్‌ ప్రమాణం చేస్తారు. మంత్రివర్గ సహచరులు కూ డా కేసీఆర్‌తో పాటే ప్రమాణం చేస్తారు. దీనికి సంబంధించి జాబితానుకేసీఆర్‌ తుదిరూపు ఇచ్చే పనిలో ఉన్నారు. ఇందులో ఎవరెవరు ఉండేది రాజ్‌భవన్‌కు అందించాల్సి ఉంటుంది. ప్రమాణం తరవాత తర్వాత జూన్‌ 2 ఉదయం 10:45కు సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొంటారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో కేసీఆర్‌ తోపాటు గవర్నర్‌ నరసింహన్‌ కూడా పాలుపంచుకుంటారు.  ఇదిలావుంటే అదేరోజు ఉదయం గవర్నర్‌ నరసింహన్‌ కూడా తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం చేస్తారు. 2వ తేదీ ఉదయం 6:30కి తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరోజే ఉదయం 8:15 నిమిషాలకు కేసీఆర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రయాణం చేయించనున్నారు. గవర్నర్‌తో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణం చేయిస్తారు. రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్లో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం ఉంటుంది. మరోవైపు విభజన అంశం కొలిక్కి రావడంతో అన్నిశాఖల ఉన్నతాధికారులతో గవర్నర్‌ నరసింహన్‌ గురువారం సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులపై తుది కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఆయన జూన్‌ 2న ఉదయం 6.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.