స్వర్ణ దేవాలయంలో కత్తులు లేచాయి
ఇరు వర్గాల ఘర్షణ
12 మందికి గాయాలు
అమృతసర్, జూన్ 6 (జనంసాక్షి) :
అమృతసర్‌లోని చారిత్రక స్వర్ణదేవాలయంలో ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శిరోమణి అకాలీదళ్, శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ)కి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. కత్తులు, కర్రలతో పరస్పర దాడులకు దిగడంతో 12 మందికి గాయాలయ్యాయి. ఆపరేషన్ బ్లూస్టార్‌కు 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వర్గం వారికి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వకపోవడమే ఘర్షణలకు కారణమని తెలుస్తోంది. కత్తులు, ఇతర సంప్రదాయ ఆయుధాలు లోనికి తీసుకెళ్లకూడదని, ఖలిస్తాన్ మద్దతుగా నినాదాలు చేయొద్దని సీజీపీసీ వాలంటీర్లు అడ్డుకోవడంతోనే ఘర్షణ మొదలైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శిరోమణి అకాలీదళ్ నేత సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ తొలుత ప్రసంగించడానికి లేచి ఆలయ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన జాగీర్దార్ నుంచి బలవంతంగా మైక్ తీసుకోవడానికి యత్నించడంతో శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీకి చెందిన టాస్క్‌ఫోర్స్ వాలంటీర్లు, సిక్కు కార్యకర్తలకు మధ్య మొదలైన వాగ్వాదం దాడులకు దారి తీసింది. కత్తులు, కర్రలతో ఇరువురు దాడులకు దిగారు. విూడియా ప్రతినిధులపైనా ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో అత్యంత పవిత్రంగా భావించే ఆలయంలోని అకాల్ తఖ్త్ భవనం ఉద్రిక్తతంగా మారింది. ఈ ఘటనలో 12 మందికి పైగా గాయపడ్డారు. 1984 జూన్‌లో ఉగ్రవాది జర్నైల్‌సింగ్ భింద్రాన్‌వాలే నేతృత్వంలో తీవ్రవాదులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ధరించి స్వర్ణదేవాలయంలోకి ప్రవేశించారు. దీంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సైనిక చర్యకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సైన్యం ఉగ్రవాదులను కాల్చి చంపింది. దీన్నే ‘ఆపరేషన్ బ్లూస్టార్’ అని పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా స్వర్ణ దేవాలయంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం వారోత్సవాల ముగింపు సందర్భంగానే ఘర్షణలు తలెత్తాయి.