ఏపీ రాజధానిపై శివరామకృష్ణన్‌ కమిటీతో బాబు భేటీ

ap-cm
హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) :
ఆంధప్రదేశ్‌ రాజధా నిపై కసరత్తు వేగవం తమైంది. రాజధాని ఎంపిక కోసం ఏర్పా టైన శివరామకృష్ణన్‌ కమిటీ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ శనివారం ఉదయం అయింది. ఆంధప్రదేశ్‌ రాజధాని ఎంపికపై వారు చర్చించారు. చంద్రబాబుకు కమిటీ సభ్యులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. నలుగురు సభ్యులతో
పాటు చైర్మన్‌ శివరామకృష్ణన్‌ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వ సూచనలు సలహాలు తీసుకున్న అనంత రం కేంద్రానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటి వరకు ఆంధప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ సభ్యులు రాజధాని ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులపై వివరాలు సేకరించారు. దీనిపై ఆగష్టు 31 నాటికి కేంద్రానికి కమిటీ నివేదిక అందించనుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సభ్యులు ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించారు. కొత్త రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్‌ కమిటీ సభ్యులు చంద్రబాబుతో ఈ వివరాలను కూడా చర్చించారు. చంద్రబాబు కూడా తన అభిప్రాయాలను వారికి వెల్లడించినట్లు సమాచారం. మొత్తంగా గుంటూరు, వజియవాడల మధ్యరాజధాని ఉంటేనే బగుంటుందని వివరించినట్లు తెలుస్తోంది. కమిటీ సభ్యులు కూడా పర్యటన వివరాలను వారు చంద్రబాబుకు వివరించారు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు సాధ్యాసాధ్యాలను చంద్రబాబు వారిని అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తదితర ప్రాంతాలను సందర్శించి వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరిపారు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని చంద్రబాబు ఇదివరకే చెప్పారు. ఇదిలావుంటే రాజధాని నిర్మాణానికి ఆంధప్రదేశ్‌ రాజధానిని ఎక్కడ నిర్మిస్తారనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా ఇందుకు సంబంధించి అన్ని వర్గాలలో, రాజకీయ పార్టీలలోనూ రసవత్తర చర్చ సాగుతోంది. రాష్ట్ర రాజధానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం త్వరలోనే కేంద్రానికి నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో కొత్త రాజధాని నిర్మాణ వ్యవహారం ఆసక్తికర అంశంగా మారింది. త్వరలో నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయని భావిస్తున్న కొత్త రాజధానిని గుంటూరు-విజయవాడ నగరాల మధ్య ఏర్పాటు చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు సుముఖంగా ఉండడమే కారణం. గుంటూరు-విజయవాడల మధ్య రాజధాని ఏర్పడుతుందనే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో రాజధానిపై నియమించిన కమిటీ ఇదే తరహా నివేదికను సమర్పించే అవకాశం వుందని సమాచారం. శీఘ్రగతిన రాజధాని నిర్మాణం చేపట్టాలని కృతనిశ్చయంతో వున్న చంద్రబాబు ఇందుకు సంబంధించిన నివేదికను తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న భూసేకరణపై కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చారు. విజయవాడ, తెనాలి, గుంటూరు, మంగళగిరి పట్టణ ప్రాంతాలకు తోడు మరికొన్ని ప్రాంతాలను కలిపితే వి.జి.టి.ఎం. విస్తీర్ణం హెదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ కన్నా వెయ్యి చదరపు కిలోవిూటర్లు ఎక్కువగా అంచనా వేయడం జరిగింది. వి.జి.టి.ఎం. పరిధిలోనే కొత్త రాజధాని వస్తుందని ఇప్పటికే బలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా కేంద్రం కూడా రాజధాని నగరం ఎక్కడ వుండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ప్రకటించారు. ఫలితంగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన సంకేతాలను ప్రాతిపదికగా తీసుకోనుండటంతో విజయవాడ-గుంటూరు మధ్యనే రాష్ట్ర రాజధాని వుంటుందనే ప్రచారం బలపడుతోంది. రాజధానికి సంబంధించి మంగళగిరితో పాటు నూజివీడు ప్రాంతాలను కూడా చురుకుగా పరిశీలిస్తున్నారు. విజీటీయం పరిధిలో మరో 632 గ్రామాలను విలీనం చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వి.జి.టి.ఎం. సంస్థ రానున్న 30 సంవత్సరాలకు విజన్‌ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నం కావడం మరింతగా ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడ-గుంటూరుల మధ్యనే రాజధానిని ఏర్పాటు చే యాలని నిర్ణయించిన పక్షంలో భూసేకరణ పెద్ద సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అయితే తగిన ప్యాకేజి ఇచ్చిన పక్షంలో భూములు అప్పగించేందుకు కొందరు రైతులు స్వచ్చందంగా ముందుకు వస్తారని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తమ భూములు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చే రైతాంగానికి చంద్రబాబు కొన్ని ప్రతిపాదనలు సిద్దం చేశారని తెలిసింది. ప్రభుత్వానికి అప్పగించిన భూములను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి సంకల్పిస్తున్నారు. రాజధాని కోసం అమూల్యమైన భూములను రైతులు ఇచ్చే యోచనలో వున్నందువల్ల నలబై శాతం భూమిని అభివృద్ది చేసి అన్నదాతలకే ఇవ్వాలనేది బాబు యోచనగా వున్నారని తెలుస్తోంది. దీంతో భూసేకరణ విషయంలో పెద్ద గా ఇబ్బందులు వుండకపోవచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర రాజధాని వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇంతవరకు ఎకరానికి 4 కోట్లు ఉన్న భూముల ధర ఏకంగా 8 కోట్ల రూపాయల పైచిలుకు పలుకుతోంది. దుగ్గిరాల ప్రాంతంలో ఎకరం 20 నుంచి 25 లక్షల రూపాయలు ఉన్న ధర ఇప్పుడు ఎకరానికి కోటి రూపాయల దాకా పలుకుతోంది. కృష్ణానది ప్రక్కనే ఉండటంతో కొత్త రాజధానికి నీటికొరత ఉండదనే అభిప్రాయం ఉంది. ప్రకాశం బ్యారేజితో పాటు కోల్‌కతా జాతీయ రహదారి ఉండటం, గుంటూరు, విజయవాడల్లో రైల్వే సౌకర్యం ఉండటం కూడా మరో కలిసివచ్చే అంశం. దేశంలోనే అతిపెద్ద జంక్షన్‌లలో విజయవాడ రైల్వే ఒకటిగా ఉంది. సాప్‌టవేర్‌ రంగంతో పాటు పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అబివృద్ది చేయాలని చంద్రబాబు సంకల్పిస్తున్నారు. అదేవిధంగా గన్నవరం విమానాశ్రమాన్ని అంర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దటానికి అవకాశాలు ఉన్నాయి.