మన తొలి పండుగలు రంజాన్‌, బోనాలు

seven
ఘనంగా జరపాలి శ్రీమంత్రులు పాల్గొనండి
గంగాజమున తెహజీబ్‌ మనది శ్రీముఖ్యమంత్రి కేసీఆర్‌
హైదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలో తొలి పండుగలు రంజాన్‌, బోనాలను ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రంజాన్‌ పండుగ, బోనాల ఏర్పాట్లపై ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నగర మేయర్‌ హాజరయ్యారు. నగరానికి చెందిన మంత్రి పద్మారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్‌ పండుగ ఏర్పాట్లపై చర్చించారు. రంజాన్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.. రంజాన్‌, బోనాల పండుగల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్షించారు. రంజాన్‌, బోనాలు పండుగల సమయంలో విద్యుత్‌, మంచినీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ రెండు పండుగల్లో మంత్రులు పాల్గొనాలనీ సీఎం ఆదేశించారు. మసీదులకు మంచినీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని అన్నారు. తెలంగాణ గంగాజమున తెహజీబ్‌కు ప్రతీక అని, అన్ని పండుగలను మనం ఔన్నత్యం చాటేలా నిర్వహించి తీరుతామని అన్నారు. ఈ భేటలో డెప్యూటీ సీఎం రాజయ్య, అఖిలపక్ష నేతలు హాజరయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, డీజీపీ, మేయర్‌ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలా మీడియాతో మాట్లాడారు. రంజాన్‌ పండుగకు 10 జిల్లాల్లో రూ. 5 కోట్లు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మసీదుల్లో సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారని చెప్పారు.