ఇరాక్‌లో ఉద్రిక్తత

erakఒక్కో పట్టణాన్ని స్వాధీనం
చేసుకుంటున్న ఐఎస్‌ఐఎల్‌
మన బిడ్డల క్షేమం చూడండి
అధికారులకు కేసీఆర్‌ ఆదేశం
హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
అవసరమైతే వెంటనే
వెనక్కు రప్పించండి
సీఎస్‌తో ముఖ్యమంత్రి చర్చలు
బగ్దాద్‌/హైదరాబాద్‌, జూన్‌ 17 (జనంసాక్షి) :ఇరాక్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సద్దాం హుస్సేన్‌ అనుచరులుగా భావిస్తున్న ఐఎస్‌ఐఎల్‌ మిలిటెంట్‌ గ్రూపు ఆ దేశంలోని ఒక్కో న గరాన్ని స్వాధీనం చేసుకుంటూ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. ఇరాక్‌లో మానవ విధ్వంసక అణుబాంబులున్నాయని ఆరోపిస్తూ అమెరికా దురాక్రమణకు పాల్పడింది. అలాంటి ఆన వాళ్లేవి అక్కడ లభించపోయిన ఆ దేశ పాలకుడు సద్దాం హుస్సేన్‌ను అగ్రరాజ్యం ఉరితీయించింది. అప్పటి నుంచి అమెరికా సంయుక్త బలగాల నీడలో ఉన్న ఇరాక్‌పై ఇప్పుడు అతివాద గ్రూపు ఆధి పత్యం చెలాయించే దిశగా ముందుకు సాగుతోంది. తాము ఇప్పటి వరకు 1700 మంది సైనికులు కాల్చి చంపినట్లు ఐఎస్‌ఐఎల్‌ మిలిటెంట్‌ గ్రూపు ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటో లను కూడా పోస్టు చేసింది. మరోవైపు ఇరాక్‌ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని ఐఎస్‌ఐఎల్‌ పేర్కొంది. సోమ వారం షియా మిలీషియా వాలంటీర్లపై దాడికి తెగబడ్డ ఐఎస్‌ఐఎల్‌ 29 మందిని హతమార్చి మరో కొత్త నగరాన్ని స్వాధీనం చేసుకుంది. షియా వాలంటీర్లు వెళ్తున్న కాన్వా య్‌పై దాడి చేసి మొత్తం వాలంటీర్లను హతమార్చింది. ఈ ప్రాంతంలో సున్నీ, షియా వర్గాల మధ్య జరిగిన మొదటి దాడి ఇదే. దశాబ్దం క్రితం నుంచి అమెరికాపై, అగ్రరాజ్యా నికి సహకరించిన షియా వర్గంపై కసితో ఉన్న సున్నీలు అదను చూసి దెబ్బకొట్టారు. క్రమంగా ఇరాక్‌ను తమ అధీనంలోకి తెచ్చుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాక్‌లో మరోసారి వేలు పెట్టాలని అగ్ర రాజ్యం అమెరికా ఎత్తులు వేస్తోంది. బగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి భద్రత కల్పించేందుకు 275 మందితో కూడిన సాయుధ బలగాన్ని ఇరాక్‌ పంపాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నిర్ణర ుుంచారు. ఇన్నాళ్లు ఇరాక్‌ ప్రధాని నౌరి అల్‌ మలికిని వెనకేసుకొచ్చిన అమెరికా అతివాదుల దాడులను అరికట్టడంలో ఆయన విఫలమయ్యారని భావిస్తోంది. అతడిపై నమ్మకం సడలిన నేపథ్యంలోనే తన బలగాలను మళ్లీ ఇరాక్‌ గడ్డపై దించేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే ఇరాక్‌లో జరుగుతోన్న అంతర్యుద్ధం కారణంగా అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల భద్రతపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం
చేశారు. ఇరాక్‌లో ఇరు వర్గాల మధ్య పోరులో తెలంగాణ ప్రజలు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మను ఆదేశించారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో ఆరా తీయాలని ఆదేశించారు. ఈమేరకు సీఎస్‌ కేంద్ర విదేశాంగశాఖతో సంప్రదింపులు ప్రారంభించారు. అక్కడ మనవారు సేఫ్‌గా ఉన్నారా లేదా తెలుసుకోవాలన్నారు. ఇరాక్‌లో ఉన్న తెలంగాణవారి సమాచారం కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్‌లో ఈ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. 040-23220603, 94408 54433 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా అక్కడ ఉన్న భారతీయులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో భారత దౌత్యకార్యాలయంలో 24 గంటలపాటు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఇరాక్‌లో దాదాపు పదివేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా వేస్తున్నామని స్పష్టం చేసింది. తిక్రిత్‌లో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులు సురక్షితంగా ఉన్నారని, వారితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని తెలిపింది.