ఎట్టకేలకు దొరికిన రెండు శవాలు
సిమ్లా, జూన్ 18 (జనంసాక్షి) : బియాస్ నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బుధవారం పండో రిజర్వాయర్ వద్ద రెండు మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన వెంకట దుర్గా తరుణ్‌గా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. దీంతో ఇప్పటివరకూ పది మృతదేహాలు లభించగా, మరో 14 మంది విద్యార్థుల ఆచూకీ లేకుండా పోయింది. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత వరుసగా నాలుగు రోజుల్లో ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. ఆ తర్వాత నుంచి ఒక్క మృతదేహం కూడా బయటపడలేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అదనపు సిబ్బంది, ఆర్మీ, నేవీ ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నా పెద్దగా ఫలితం లేకపోవడంతో గాలింపు యత్నాలు బుధవారం మందగించాయి. సుమారు 700 మందితో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఆశించిన ఫలితాలను సాధించలేక పోయింది. దీంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందిని సగానికి సగం తగ్గించారు. 250 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ సిబ్బంది వెనుదిరిగారు. మిగిలిన వారితోనే బియాస్ నదిలో గాలింపు చేపట్టారు. విజ్ఞానయాత్రకు వెళ్లిన వీఎన్నార్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు 24 మంది ఈ నెల 8వ తేదీన బియాస్ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. వీరి ఆచూకీ కోసం తర్వాతి రోజు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్), ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ), ఎస్‌ఎస్‌బీ, ఆర్మీ, నేవీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. గత పది రోజులుగా గాలిస్తున్నా కేవలం ఎనిమిది మంది మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ఇంకా 16 మంది ఆచూకీ దొరకలేదు. వారి కోసం తీవ్రంగా యత్నించినప్పటికీ జాడ తెలియరాలేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మానవ రహిత విమానాలు, సోనార్ పరికరాలతో నదిని జల్లెడ పట్టినా విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలోనే ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో గాలింపు చర్యలను తగ్గించారు. వరద ఉద్ధృతి, పెద్ద పెద్ద బండరాళ్లు, బురద వంటి ప్రతికూల సవాళ్ల నడుమ విద్యార్థులను కనుగొనడం కష్టంగా మారింది. పది రోజులుగా అక్కడే మకాం వేసి ఎదురుచూసిన తల్లిదండ్రులు.. తమ వారిపై ఆశలు వదిలేసుకున్నారు. నిరాశతో కన్నీరుమున్నీరవుతూ స్వస్థలాలకు చేరుకున్నారు.లార్జీ డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో సైరన్ పని చేయలేదని తెలంగాణ రావాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. సైరన్ పని చేసి ఉంటే విద్యార్థులు అప్రమత్తంగా ఉండే వారని చెప్పారు. బియాస్ నది ఘటనకు కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో అనుభవం లేని సిబ్బందిని విహార యాత్రకు పంపటం వల్లే విద్యార్థులు నదిలోకి దిగారని వివరించారు. 11వ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు నిరాశతో స్వస్థలాలకు వెళ్లారని తెలిపారు. ఉత్తరాఖండ్ బాధితుల మాదిరిగా వారికి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు చెప్పారు. గాలింపు చర్యలను మంత్రి మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు లవ్ అగర్వాల్, కార్తికేయన్, రాజీవ్ త్రివేది స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
తరుణ్ మృతదేహం తరలింపు : మహేందర్ రెడ్డి
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థులలో ఒక విద్యార్థి మృతదేహం లభించింది. దీనిని తరుణ్ మృతదేహంగా గుర్తించారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ తరలిస్తారు. తరుణ్ మృతదేహం రేపు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. ఆ మృతదేహం వెంకట దుర్గా తరుణ్‌దిగా గుర్తించామన్నారు. పండో రిజర్వాయర్ వద్ద రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే వాటిలో ఒకటి ఇంజనీరింగ్ విద్యార్థి తరుణ్‌దిగా కాగా, మరొకటి స్థానికుడిదిగా గుర్తించారు. తరుణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. రోడ్డు మార్గంలో మృతదేహాన్ని ఢిల్లీకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో ఈ నెల 8వ తేది ఆదివారం 24 మంది విద్యార్థులు గల్లంతయిన విషయం తెలిసిందే. వారిలో ఆరుగురు విద్యార్థినులు, 18 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంతకు ముందు 8 మృతదేహాలు దొరికాయి. ఈ రోజు దొరికి మృతదేహంతో మొత్తం 9 దొరికాయి. ఇంకా 15 మృతదేహాలు లభ్యం కావలసి ఉంది. మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తునే ఉన్నారు. గల్లంతయినవారిలో కల్లూరి శ్రీహర్ష, ఆషిష్ మంత, సందీప్ బస్వరాజ్, అరవింద్, పరమేష్, జగదీష్ ముదిరాజ్, అఖిల్-మిట్టపల్లి, ఉపేందర్, అఖిల్-మాచర్ల, భానోతు రాంబాబు, శివప్రకాష్ వర్మ, ఎం.విష్ణువర్ధన్, సాయిరాజ్, సాబేర్ హుస్సేన్, కిరణ్ కుమార్, పి.వెంకట దుర్గ తరుణ్ ఉన్నారు.