నో! నెవర్‌..

samavesam
పీపీఏలపై వెనక్కు తగ్గొద్దు శ్రీఏపీ వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టండి
పరిశ్రమలు స్థాపించని భూములు వెనక్కి శ్రీకాలుష్య రహిత రాష్ట్రంగా తెలంగాణ
ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష
హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి):
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)పై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గవద్దని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ పీపీఏల రద్దుకు ఏకపక్షంగా లేఖ రాసిన నేపథ్యంలో ఆయన శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణ యాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని, అం దుకు సంబంధించిన పూర్తిసమాచారాన్ని సేక రించాలని అన్నారు. అందుకోసం ఆర్థిక శాఖ కార్యదర్శి కొన్ని రోజుల పాటు ఢిల్లీలోనే ఉం డాలని, కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సమాచారాన్ని ఇచ్చి ఏపీ ప్రభుత్వ నిర్ణయంలోని లోటుపాట్లను, దురుద్దేశాన్ని తెలియజెప్పాలని సూచించారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయంపై తెలంగా ణలోని అన్ని రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన మంత్రివర్గ సహచరులు ఏపీ సర్కారు కుట్రను ఎండగట్టడంతో కృతకృత్యులయ్యారు. ఫలితంగా కేంద్రం ఏపీ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. పీపీఏల రద్దు విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యేందుకు కేసీఆర్‌ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే తెలంగాణలో పరిపాలనను గాడిలోకి తెచ్చేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఒక్కో అడుగు ముందు కస్తు న్నారు. తాజాగా శుక్రవారం సచివాల యం లో ఇండస్ట్రీల పాలసీపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు. దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధా నాన్ని రూపొందించాలని కేసీఆర్‌ అధికా రులను ఆదేశించారు. మనం రూపొం దించే విధానం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఉండాలని ఆయన సూచించారు. సింగిల్‌ విండో ద్వారా అనుమతులు పొందేలా త్వరితగతిన అనుమతులు వచ్చేలా చూడాలని చెప్పారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాయితీలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పరిశ్రమలు పెట్టని సంస్థల నుంచి ప్రభుత్వం కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. పీపీఏల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రకటన చేస్తున్న వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవసరమైన సమాచారాన్ని తెప్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కావలసిన సమాచారాన్ని అందించడానికి విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శిని ఢిల్లీలోనే కొన్ని రోజులు ఉంచాలని నిర్ణయించారు. తెలంగాణకు అవసరమయ్యే విద్యుత్‌ ఎక్కడ తెప్పించుకోవాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. విద్యుత్‌ విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని కేసీఆర్‌ ఆదేశించారు. కాగా, రుణమాఫీపై కూడా ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్షించారు. దీనిని త్వరితగతిన అమలు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను చర్చించేందుకు వారం రోజుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. రుణమాఫీ వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థికభారంతో పాటు ఇతర వివరాలను కూడా కేసీఆర్‌ తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు సమాచారం.