నల్లధనంపై కదులుతున్న డొంక
భారతీయుల ఖాతా వివరాలను సిద్ధం చేస్తున్న స్విస్ బ్యాంక్
సిట్‌తో సహకరిస్తాం
రహస్య నిబంధనని పట్టించుకోం : యూబీఎస్
జ్యూరిచ్, జూన్ 22 (జనంసాక్షి) :విదేశాల్లో భారతీయులు అక్రమంగా దాచి ఉంచిన నల్లధనం డొంక కదులుతోంది. ము ఖ్యంగా స్విస్ బ్యాంకుల్లో దేశానికి చెందిన కుభేరులు దాచుకున్న అక్రమ సంపాదన వివరాలు వెల్లడించడానికి ఆ దేశం సుముఖత వ్యక్తం చేసింది. ఈమేరకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లించకుండా స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దా చుకున్న భారతీయుల జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం తయారు చేసింది. ఈ వివరాలను త్వరలోనే మన ప్రభుత్వానికి అందజే య నుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన కుభేరులు, రాజకీయ నేతలు అక్రమంగా కూడబెట్టిన మొత్తాన్ని ఆయా దేశా లకు పన్ను చెల్లించకుండా అక్రమ మార్గాల్లో స్విట్జర్లాండ్‌కు తర లించి అక్కడి బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారి వివరాలు గోప్యంగా ఉంచే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది తమ డ బ్బును అక్కడే దాచుకునేవారు. అయితే ఇలా దాచుకున్న వారు తమ పేర్లపైనే కాకుండా, ట్రస్ట్, కంపెనీ
తదితర పేర్లతో డబ్బులు దాచి ఉంచారు. ఇలా దాచిన డబ్బుకు అసలు యజమానులెవరో తెలుసుకునే పనిలో నిమగ్నమైనట్లు యూబీఎస్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఆయా ఖాతాలపై నిఘా వేసినట్టు ఆయన పేర్కొన్నారు. దాదాపు ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే అక్రమ ఖాతాలు కలిగిఉన్న వారి వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆ అధికారి నిరాకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమాచార మార్పు దౌత్య ఒప్పందంలో భాగంగా ఆ వివరాలను గొప్యంగా ఉంచాలన్న నిబంధన ఉందని, ఆ నిబంధనను తాను పాటిస్తానని తెలిపారు. అయితే వివరాలను మాత్రం భారత్‌కు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. నల్లధనం వెలికితీసేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. దీంతో స్విస్ బ్యాంకుల్లో పన్ను చెల్లించకుండా భారీ ఎత్తున డబ్బులు దాచేసిన పెద్దలకు వణుకు పుడుతోంది. తమ వివరాలు బయటికి వస్తే పరువు గంగలో కలుస్తుందని ఎన్‌డీఏ సహచర పార్టీలకు చెందిన నాయకులు సైతం వాపోతున్నారు. మొత్తానికి ఖాతాదారుల వివరాలను రహస్యంగా ఉంచాలన్న నిబంధనను స్విట్జర్లాండ్ ప్రభుత్వం తీసి గట్టుమీద పెట్టడంతో భారత్‌కు పెద్ద ఎత్తున నల్లధనం తిరిగి రానున్నట్టు సమాచారం. అయితే స్విట్జర్లాండ్‌లో ధనాన్ని దాచిన దేశాల్లో భారత్ 54వ స్థానంలో ఉన్నట్లు యూబీఎస్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం మీద స్విస్ బ్యాంకుల్లో భారతీయులకు చెందిన నల్లధనం రూ.14 వేల కోట్లు ఉంటుందని సమాచారం. అయితే ఇది ఇంకా ఎక్కువే ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. స్విస్ ప్రభుత్వం ఇచ్చే సమాచారం భారత్‌కు చేరితేకాని పూర్తి వివరాలు వెల్లడికావు.