పీపీఏలపై ఢిల్లీలో సవాల్
అఖిలపక్షంతో 25, 26 తేదీల్లో హస్తినకు కేసీఆర్
హైదరాబాద్, జూన్ 23 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ సర్కారు దొడ్డిదారిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుకు ప్రయత్నించడంపై కేంద్రం వద్ద అమీ తుమీ తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్ధమయ్యారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దు, పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్రమోడీకి వాస్తవాలను తెలియజేసేందుకు సీఎం కేసీఆర్ అఖిలపక్షంతో కలిసి ఈనెల 25న ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన హస్తినలోనే మకాం వేసి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు వెనుక దాగి ఉన్న సీమాంధ్ర ప్రభుత్వ కుట్రను కేంద్రానికి తేటతెల్లం చేయాలనే యోచనలో ఉన్నారు. ఈమేరకు సీఎం సహా అఖిలపక్షం హస్తిన పర్యటన ఖరారైనట్లు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్. వేణుగోపాలాచారి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై అఖిలపక్షం ప్రధాని వద్ద తమ నిరసన తెలపనుంది. ముంపు గ్రామాలను తెలంగాణ లోనే కొనసాగించాలని డిమాండ్ చేయనుంది. తాము పోలవరం నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ప్రస్తుత డిజైన్ మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్తున్న సీఎం కేసీఆర్ అందుకు ప్రత్యామ్నాయాలను మోడీ ముందు ఉంచనున్నారు. గిరిజన హక్కుల చట్టాలకు వ్యతిరేకంగా తెచ్చిన ఆర్డినెన్స్‌పై తాము
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తద్వారా అడ్డుకుంటామని సీఎం కేసీఆర్ ఇదివరకే మోడీకి స్పష్టం చేసిన నేపథ్యంలో అఖిలపక్షాన్ని తీసుకెళ్లి తమ నిరసన తెలపనున్నారు. అలాగే పీపీఏ రద్దు వెనుక ఉన్న అసలు కారణాలను కేంద్రానికి వివరించనున్నారు.