కూలుతున్న సీమాంధ్ర కలల సౌధం
కబ్జాకోరులపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం
గురకుల్ ట్రస్ట్ స్థల స్వాధీనంతో
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
627 ఎకరాల్లో అంగుళం వద్దలొద్దు
కొనసాగుతున్న కూల్చివేతలు
ఉన్నతాధికారుల పర్యవేక్షణ
హైదరాబాద్, జూన్ 24 (జనంసాక్షి) :
వలస పాలకుల అండతో సీమాంధ్ర పెత్తందారులు అక్ర మంగా నిర్మించుకున్న కలల సౌధాలు కూలుతున్నాయి. గురుకుల్ ట్రస్ట్ భూమిని స్వాహా చేసి కబ్జాకోరులపై తెలం గాణ సర్కారు ఉక్కుపాదం మోపింది. ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామునే జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసుల భద్రత నడుమ కూల్చివేతలను ప్రారంభించారు. సీమాం ధ్ర పెత్తందారుల తొత్తులు కొందరు దీనిని అడ్డుకునే ప్ర యత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుతొలగించి కూ ల్చివేతలను కొనసాగించారు. భారీ పోలీసు బందోస్తు మధ్య జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నారు. సోమవారం ఈ భూముల అన్యాక్రాంతంపై సమీక్షించిన సీఎం కఠిన ఆదేశాలు ఇవ్వడంతో కూల్చి వేతకు రంగం సిద్ధం చేశారు. ఉదయమే పెద్ద ఎత్తున సిబ్బందితో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ కట్టడా లను నేలమట్టం చేసే పనిలో పడ్డారు. అయితే అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల
కూల్చివేత కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కట్టడాల కూల్చివేత కొనసాగుతుండగా, కూల్చివేతను శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అడ్డుకున్నారు. కూల్చివేతలను ఆపివేయాలని ఆయన ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కోరారు. అయితే కూల్చివేతలు ఆపేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. దాంతో కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అక్రమ నిర్మాణాలపై చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గురుకుల ట్రస్ట్ భూముల్లోని అక్రమ నిర్మాణాల వివరాలను ఆగమేఘాల మీద ఆరా తీసి కూల్చివేతలు కూడా చేపట్టారు. ట్రస్ట్ భూముల్లో వెలిసిన కాలనీల్లో ఒకటైన అయ్యప్ప సొసైటీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సెంట్రింగ్‌ను, మరో భవనంపై పిల్లర్లను సోమవారం ధ్వంసం చేశారు. దీంతో అయ్యప్ప సొసైటీలోని భవన యజమానుల గుండెల్లో దడ మొదలైంది. ఏ క్షణాన తమ భవనంపైకి వచ్చి పడతారోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైఎస్ హయాంలో అడ్డూఅదుపూ లేకుండా బడాబాబులు చెలరేగిపోయి, చట్టాలను, నిబంధనలను కాదని దోచుకుతిన్నారు. సీమాంధ్రుల భూ కబ్జాలకు ఒక ఉదాహరణ ఈ గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారం. ఆయన తన భూ ఆక్రమణల పర్వాన్ని గురుకుల్ ట్రస్ట్ భూములతోనే కొనసాగించారు. ఇక్కడ తన తమ్ముడు సహా అనేకులు భూములను ఆక్రమించుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడే గురుకుల్ ట్రస్ట్ భూముల ఆక్రమణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో బన్సీలాల్ వ్యాస్ అనే ఆదర్శవాది అందరికీ వేదవిద్యతో పాటు ఆధునికమైన సాంకేతిక విద్యనందించాలన్న పవిత్ర లక్ష్యంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా, ఆయన మామగారైన బద్రీనాథ్ 627 ఎకరాల భూమిని ట్రస్ట్‌కు దానంగా ఇచ్చారు. 1951లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని ట్రస్ట్‌కు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. సీమాంధ్ర సర్కారు యూఎల్‌సీ పేరుతో ట్రస్ట్ భూములను కబ్జాదారులకు కట్టబెట్టింది. ఆస్తుల నిర్వహణ మీరు చేయలేరంటూ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకున్న సర్కారే కబ్జా చేసింది. ఇప్పుడు ఘట్‌కేసర్‌లోని 20 ఎకరాల గురుకులంలో కళాశాల, స్కూల్ ఉన్నాయి. దేవాదాయశాఖ అధీనంలో ఈ పాఠశాల అతిదీనావస్థలో నడుస్తున్నది. హైటెక్ సిటీకి చేరువగా భూమి ఉండడంతో అప్పనంగా దీన్ని దోచుకున్నారు. అధికారం అడ్డు పెట్టుకుని అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినవారి బంధుగణమే నిర్మాణాలను పూర్తి చేసింది.వైఎస్‌ఆర్, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో గ్రేటర్ మునిసిపల్ అధికారులు పక్షపాతంగా వ్యవహరించారు. అప్పటి సీమాంధ్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన నిర్మాణాల జోలికి వెళ్ళని అధికారులు అమాయకులుగా ఉన్నవారి పై మాత్రం చర్యలు తీసుకున్నారు. వైఎస్ సోదరుని నిర్మాణాన్ని మాత్రం వదిలేశారు. అదే తరహాలో కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుని భవనం జోలికి వెళ్లలేదు. సర్కారు స్వాధీనం చేసుకున్న భూమిలో 120 ఎకరాల విస్తీర్ణంలో నాక్ బిల్డింగ్, హైటెక్స్ ఏర్పాటు కాగా, 100 ఎకరాల భూమిని నోవాటెల్ ¬టల్‌కు అప్పనంగా అప్పగించారు. మరో 30 ఎకరాల భూమిని హూందాయ్ కార్లసంస్థకు కట్టబెట్టారు. అన్నమయ్య కళా పీఠానికి, ఆవధాన పీఠానికి దాదాపు ఆరు ఎకరాల భూమిని కేటాయించారు. కబ్జా చేసిన ట్రస్ట్ భూమిలో కడప బ్యాచ్ ఏకంగా వైఎస్ ఆర్ హిల్స్ ఏర్పాటు చేసింది. వివేకా ఓబంగళా నిర్మించుకోగా.. అక్కినేని నాగార్జున 9 ఎకరాల భూమిలో ఎన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి 22 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి అమ్మారని స్థానికులు చెప్తుంటారు. చంద్రబాబు 5 ఎకరాల భూమిని కొని విక్రయించగా, ఆయన భార్య భువనేశ్వరి పేరుతో ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశారు. పురందేశ్వరి, డీఎల్ రవీంద్రారెడ్డి, వైఎస్ తమ్ముడు సుధీకర్‌రెడ్డి, వైఎస్ ఆంతరంగికుడు సూరి అలియాస్ సూర్యనారాయణరెడ్డి, అప్పటి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్‌రెడ్డి, సినీ నిర్మాత వడ్డే రమేశ్ తదితరులకు ఇక్కడ భూములున్నాయి. దానం నాగేందర్ కూడా భారీ ఎత్తున గురుకుల్ ట్రస్ట్ భూములను విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే ట్రస్ట్ భూమిలో ఓ పత్రికాధిపతి భారీ భవనాన్ని నిర్మించి పత్రిక కార్యాలయాన్ని అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. మొత్తానికి కూల్చివేతలు సమూలంగా చేపడతారా లేదా అన్నది చూడాలి.