ప్రభుత్వ ‘నెల’ బాలుడు
ప్రజలకు భరోసానిస్తున్న తెలంగాణ సర్కారు
మంత్రుల తడబాటు.. కేసీఆర్ దిద్దుబాటు
రుణమాఫీ, వాహనాల రిజిస్ట్రేషన్ వివాదానికి ఆదిలోనే సీఎం తెర
ప్రతిపక్షాలనూ కలుపుకొని పాలనలో ముందుకు
అన్ని వర్గాలకు చేరువయ్యే యత్నం
ఆంధ్ర సర్కారు కుట్రలు తుత్తినియలు
పీపీఏల రద్దుపై పోరాడి విజయం
మన బిడ్డలకే ఫీజు రీయింబర్స్‌మెంట్
సీమాంధ్ర కబ్జాకోరుల గుండెళ్లో రైళ్లు
గురుకుల్ ట్రస్ట్ ఆక్రమణలపై ఉక్కుపాదం
ల్యాంకోహిల్స్ అక్రమాలపై నజర్
‘మెట్రో’ అడ్డగోలు అనుమతులకు కళ్లెం
హైదరాబాద్ హెరిటేజ్ కాపాడే దిశగా అడుగులు
నిత్యం సమీక్షలు.. పాలనపై పట్టు
బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందడుగు
తెలంగాణ సర్కారు నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్
హైదరాబాద్, జులై 1 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులవుతోంది. ఈ 30 రోజుల పాలనలో తెలంగాణ తొలి సర్కారు ప్రజల్లో విశ్వాసాన్ని నింపడంలో నూటికి నూరుపాళ్లు విజయం సాధించింది. ఎన్నికల సందర్భంగా భారీ హామీలిచ్చినా, వాటిలో ఇప్పటి వరకూ ఒక్కటీ అమలు కాకున్నా కచ్చితంగా చేసి తీరుతాం అని చెప్పడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన మంత్రివర్గ సహచరులు కృతకృత్యులయ్యారు. మన రాష్ట్రంలో మన సర్కారు.. మనకోసం, మనోళ్ల కోసం పనిచేస్తుందని స్పష్టమైన సంకేతాలిచ్చారు. కొత్త రాష్ట్రం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరు దశాబ్దాలు కునారిల్లిన ప్రాంతం.. ప్రతి సందర్భంలో వివక్షను, వెక్కిరింతను ఎదుర్కొన్న నేల.. సర్వం కోల్పోయి మొండిగోడలను తలపించే గడ్డ.. ఇలాంటి తెలంగాణాను పునర్నిర్మించి బంగారు తెలంగాణాగా నిలబెడతామని, ప్రజలిచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయబోమని కేసీఆర్ ఘంటాపథంగా చెప్తున్నారు. అంతే దీక్షా దక్షతతో పాలనపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారుల కొరత ఉన్నా, సీఎం పేషీలోనే సరిపడా సిబ్బంది లేకున్నా ఉన్నవాళ్లతోనే సుపరిపాలన అందించేందుకు అహరహం శ్రమిస్తున్నారు. ప్రజలు తమపై మోపిన బాధ్యతను నెరవేర్చడానికి ప్రతి అడుగునూ జాగ్రత్తగానే వేస్తున్నారు.
తెలంగాణ సర్కారు కొలువుదీరిన రోజే హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో హైదరాబాద్‌కు చెందిన వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది గల్లంతయ్యారు. తొలి కేబినెట్ భేటీ జరుగుతున్న సమయంలోనే ఈ వార్త అందింది. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి నేతృత్వంలో అధికారుల బృందాన్ని హిమాచల్‌కు పంపారు. వారం రోజుల తర్వాత అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను, ఆ తర్వాత రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డిని హిమచల్‌కు పంపి గల్లంతయిన విద్యార్థుల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం పక్షాన విద్యార్థుల కుటుంబాలకు మేమున్నాం అనే భరోసా కల్పించింది తెలంగాణ సర్కారు. ఆ వెంటనే ప్రధాన హామీ రైతు రుణమాఫీపై మంత్రుల ప్రకటనలతో కొంత అస్పష్టత ఏర్పడ్డ, తెలంగాణ తొలి సర్కారు గొంతును పురిట్లోనే నులిమేసేందుకు సీమాంధ్ర పెద్దల తాబేదార్లు తీవ్ర ప్రయత్నాలు చేసినా, తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టి సర్కారుపై తిరగబడాలనే దిశగా వారిని రెచ్చగొట్టడానికి యత్నించినా ఏమాత్రం ఆందోళన చెందకుండా సీఎం కేసీఆర్ ఆ వివాదానికి తెరదించారు. అనుభవ లేమి ఇతరత్రా కారణాలతో మంత్రుల తప్పడుగులను సీఎం దిద్దుబాటు చేశారు. కొత్త రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లపైనా మొదట్లో ఇదే సందిగ్ధత కొనసాగినా దానికీ ఆదిలోనే తెరదించారు సీఎం కేసీఆర్. కొత్త రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరినీ కలుపుకుపోతామన్న సీఎం ప్రతిపక్షాలను పిలిచిమరీ అఖిలపక్షాలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, తెలంగాణ తొలి పండుగలు బోనాలు, రంజాన్‌లను స్టేట్ ఫెస్టివల్స్‌గా ప్రకటించడం వాటిని మన రాష్ట్రంలో సగర్వంగా నిర్వహించుకునేలా ఆర్థిక, హార్థిక తోడ్పాటునిచ్చింది ప్రభుత్వం. తెలంగాణ పునర్నిర్మాణానికి గుండె కాయ హైదరాబాద్. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో మన నగరం ఎంతో విధ్వంసమయ్యింది. మన చరిత్రను తెరమరుగు చేసేందుకు వలస పాలకులు సాగించిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. మన రాష్ట్రంలో హైదరాబాద్ చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి తెలిసేలా నిర్దిష్టమైన చర్యలు చేపట్టారు. వలస పాలకులు అడ్డగోలు మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులపై సమీక్షించి సుల్తాన్‌బజార్, మొహింజాహి మార్కెట్, అసెంబ్లీ, లక్డికాపూల్, ఇతర చారిత్రక కట్టడాలు ఉన్నచోట భూగర్భమార్గంలో రైల్వేలైన్ వేసుకోవాలని ఆదేశించింది. తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో సుల్తాన్‌బజార్, మొహింజాహి మార్కెట్లలో సంబరాలు జరుపుకున్నారంటే ఆ నిర్ణయం హైదరాబాదీల గుండెలకు ఎంతగా హత్తుకుందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తెలంగాణలో 2019లో అధికారం దక్కించుకుంటానని చెప్తున్న చంద్రబాబు తమను కాదని విడిపోయిన తెలంగాణ ఎలా బాగుపడుతుందో చూస్తాననే కుట్రతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కేంద్ర ప్రభుత్వం తన జేబులో ఉందనే అతి విశ్వాసంతో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టాన్ని అతిక్రమించి పీపీఏల రద్దుకు యత్నించిన ఏపీ సర్కారు ఈఆర్సీ సమావేశంలో ఏకాకిగా మిగిలి నగుబాటును ఎదుర్కొంది. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని కోరుతున్న తెలంగాణ సర్కారు విజ్ఞప్తిని కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనిపై ప్రమాణ స్వీకారానికి ముందే కేసీఆర్ బంద్‌కు పిలుపునిచ్చి తెలంగాణ సత్తా చటగా, పార్లమెంట్‌లో మన ఎంపీలు తమ నిరసనతో సభ కార్యక్రమాలే నడువకుండా అడ్డుకున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం తలుపులు తడుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి శాఖపై ఇప్పటికే స్పష్టమైన అవగాహనతో ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ తెలంగాణ పునర్నిర్మాణానికి రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా శాఖల అధికారులు అరకొర సమాచారంతో సమావేశానికి వస్తుండగా తనకు ఏం కావాలో వారికి నిర్దిష్టంగా చెప్పి మరీ ఆ దిశగా నివేదికలు రూపొందించాలని ఆదేశిస్తున్నారు. గతంలో మరేం సీఎం ఇలాంటి ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. సమీక్షల పేరుతో బ్యూరోక్రాట్లు రూపొందించిన నివేదకలను అటు ఇటు సర్ది సంతకాలు చేయడం మాత్రమే మనకు తెలుసు. కానీ కేసీఆర్ ప్రతి శాఖపై అధికారులనే విస్మయ పరిచే విషయాలు చెప్తూ తాను చెప్పినట్టుగా పనిచేయమని కోరుతున్నాడు. ప్రతి రోజు సమీక్షలతో ఏఏ పనులు ఎక్కడి వరకు వచ్చాయో తెలుసుకుంటున్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్ అందుకు భద్రత ఎంతో అవసరమని గుర్తించారు. అందుకే నగరంలో న్యూయార్క్ తరహా పోలీసింగ్‌కు చర్యలు చేపట్టారు. రూ.350 కోట్లతో 1600 ఇన్నోవాలు, 1650 మోటారు సైకిళ్లను కొనుగోలు చేయాలని ఆదేశించారు. పోలీసు వాహనాలను ఇంటర్నెట్, జీపీఎస్‌తో కనెక్ట్ చేసి నేరం జరిగిన నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకునేలా సాంకేతికతను వాడుకునేందుకు వ్యూహం సిద్ధం చేశారు. మొదటగా పోలీసుల యూనిఫాం మార్చడం ద్వారా వారిలో మార్పు తీసుకురావడం, వేతనాల పెంపు, ప్రత్యేక అలవెన్స్‌లు ఇతరత్రా సౌకర్యాల కల్పన ద్వారా వారిలో మనోధైర్యం పెంపొందించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌ను మరింత విస్తరించాలంటే, ఇక్కడికి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రావాలంటే భద్రత ఎంతో ముఖ్యమని కేసీఆర్ చెప్తున్నారు. అంతేకాదు హైదరాబాద్‌ను ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామో అదే స్థాయిలో ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు శ్రద్ధ తీసుకుంటున్నారు. రాబోయే మూడేళ్లలో 3.3 కోట్ల మొక్కలను జీహెచ్‌ఎంసీ పరిధిలో నాటడంతో పాటు వారంలో ఒక రోజు వాటి సంరక్షణపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగింపుపై ఇంకా విధివిధానాలు రాకున్నా తెలంగాణ బిడ్డల ఫీజులను మన సర్కారే కడుతదని చెప్పింది. హైదరాబాద్ స్టేట్‌ల పుట్టినోళ్ల వారసులకు మాత్రమే ఫీజులు కడ్తమని, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ చదివేటోళ్లకు కట్టబోమని తేల్చిచెప్పింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పకడ్బందీగా రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఏదేదో మాట్లాడి న్యాయపోరాటం చేస్తామనేదాక పోయిండు. మన బిడ్డల ఫీజులు మన కడ్తం అంటే కూడా తప్పే అన్నట్టు కొందరు సీమాంధ్ర ఏజెంట్లు గొట్టాల ముందు గొడవకు దిగారు. నాగార్జున సాగర్ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుపోయినట్టుగానే జబర్దస్తీగా నీళ్లు పట్టుకుపోవడానికి ప్రయత్నించిన సీమాంధ్ర సర్కారు యత్నాలకు బ్రేకులు వేసింది మన సర్కారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ, వక్ఫ్, ట్రస్ట్ భూములను ఇష్టారాజ్యంగా కొట్టేసిన సీమాంధ్ర గద్దలకు చెక్ పెట్టేందుకు సర్కారు ముందడుగు వేసింది. గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని అక్రమ కట్టడాలను కూల్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు మిగతా ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. గురుకుల్ ట్రస్ట్ భూములతో పాటు చెరువునూ ఆక్రమించి సినీ హీరో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు నోటీసులు జారీ చేసి కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మణికొండలో వక్ఫ్ భూములు ఆక్రమించి నిర్మించిన ల్యాంకోహిల్స్ కూల్చివేతలపై సర్కారు నజర్ వేసింది. వీటిపై సుప్రీం కోర్టును ఆశ్రయించి ఆక్రమణలు తొలగించాలని ప్రయత్నిస్తోంది. అలాగే హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన రెండు లక్షల ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.
నగరాన్ని ఐటీకి కేరాఫ్‌గా మార్చేందుకు సర్కారు నిర్దిష్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే నగరానికి వచ్చిన ఐటీఐఆర్ పనులు మొదలు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా దేశంలోనే మొట్టమొదటి సారిగా నగరంలో ఇంక్యూబేటర్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని భాస్కర సెజ్‌లో టాటా ఆధ్వర్యంలో రూ.500 కోట్లతో విమానాల విడిభాగాలు తయారు చేసే పరిశ్రమకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఐటీ, ఫార్మా, ఇతర రంగాల్లో పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. వైద్య సేవలను గ్రామీణులకు విస్తరింపజేసేందుకు ప్రతి జిల్లాలో నిమ్స్ తరహాలో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అధికార వికేంద్రీకరణ, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. రూ.3 లక్షలతో రెండు బెడ్రూంల ఇళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ, ఇతర హామీల్లో ఇప్పటికీ ఒక్కటీ అమలు చేయకున్నా వాటిని రానున్న రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తారని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల కుటంబాలను ఆదుకుంటామని సర్కారు చెప్పింది. అది కూడా అమలు కావాల్సి ఉంది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరుల్లా బతుకులీడ్చిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు సగర్వంగా తలెత్తుకుని నిలబడ్డారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా సర్కారు తొలి అడుగులు పడుతున్నాయని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజల పక్షం వహిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల తెలంగాణ సర్కారు ప్రజల్లో విశ్వాసాన్ని నింపగలిగింది. మున్ముందు స్ఫూర్తివంతమైన పాలన అందిస్తుందనే విశ్వాసంలో ప్రజల్లో నెలకొంది. వారి ఆకాంక్ష, విశ్వాసం నెరవేరాలని ఆశిద్దాం.