మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌ ఘనవిజయం

MAIN
పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్‌

చప్రాసీ నుంచి చైర్మన్‌ అయ్యాను

ఇది ప్రజాస్వామ్య విజయం : స్వామిగౌడ్‌

హైదరాబాద్‌, జులై 2 (జనంసాక్షి) :

శాసనమండలి చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌  ఘన విజయం సాధించారు. బుధవారం నిర్వహించిన రహస్య బ్యాలెట్‌ పద్ధతి ఎన్నికలో ఆయన విజయం సాధించారు. ఎన్నికల ప్రక్రియ తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ పోటీ నుంచి తప్పుకుంది. అలాగే, చైర్మన్‌ ఎన్నికలను బహిష్కరించింది. అంతకు ముందు చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా సభలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ తోపులాడుకున్నారు. ఈ ఉత్కంఠ మధ్యే డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రాజా సదారాం అక్షర క్రమంలో పేర్లను పిలవగా సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

21 మంది మద్దతు

21 మంది ఎమ్మెల్సీలు ఓటు హక్కు వినియోగించుకోగా.. అన్ని ఓట్లు స్వామిగౌడ్‌కే పడడం విశేషం. మొత్తం ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు విప్‌ను ధిక్కరించి టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్‌, యాదవరెడ్డి, రాజేశ్వరరావులతో పాటు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఆ పార్టీ ఎమ్మెల్సీలు జగదీశ్వర్‌రెడ్డి, కేఆర్‌ ఆమోస్‌, రాజలింగం, భూపాల్‌రెడ్డి, భానుప్రసాదరావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటేయడం గమనార్హం. ఇద్దరు ఎంఐఎం ఎమ్మెల్సీలతో పాటు స్వతంత్ర ఎమ్మెల్సీ నాగేశ్వరరావు కూడా స్వామిగౌడ్‌కు మద్దతు ప్రకటించారు. ఓటింగ్‌ అనంతరం స్వామిగౌడ్‌ ఎన్నికయ్యారని సభాపతి స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్‌ ప్రకటించారు. అనంతరం స్వామిగౌడ్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు, సభ్యులు సాదరంగా చైర్మన్‌ స్థానానికి తీసుకెళ్లారు.

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వాగ్యుద్ధం

చైర్మన్‌ ఎన్నికకు ముందు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్మన్‌ ఎన్నిక అప్రజాస్వామికమని, వెంటనే వాయిదా వేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ అప్రజాస్వామికమని మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్‌ మండిపడ్డారు. నిరవధికంగా వాయిదా (సైన్‌ ఏ డై) పడిన సభను అయిన కేవలం చైర్మన్‌ ఎన్నిక కోసం సమావేశపరచడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికార పక్షం వ్యవహరిస్తోందని, ఇప్పటికిప్పుడు ఇంత హడావుడిగా మండలి చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. అది కూడా రహస్య బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాల్సిన అవసరం ఏముందన్నారు. తనకు కూడా నిబంధనలు తెలుసని, అయినా సంప్రదాయాలను బట్టి ఎన్నిసార్లు నిబంధనలు మార్చుకోలేదని తెలిపారు. ఇంత దౌర్జన్యంగా సభను నడిపించాలా? అని అన్నారు. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకోబోగా డీఎస్‌ ఆవేశానికి లోనయ్యారు. ఇది పద్ధతి కాదన్నారు. నాయకులంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పిన డీఎస్‌ చైర్మన్‌ ఎన్నికకు తర్వాత ఎప్పుడు పిలిచినా తామంతా నిర్మాణాత్మక సహకారం అందిస్తామన్నారు. ఇప్పుడు మాత్రం వాయిదా వేయాలని కోరారు.దీనిపై హరీశ్‌రావు స్పందిస్తూ మండలి చైర్మన్‌ ఎన్నికను గవర్నర్‌ షెడ్యూల్‌ చేశారని, ఇది మనమెవరం పెట్టుకున్నది కాదని తెలిపారు. పోటీలో  ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే బ్యాలెట్‌ ద్వారానే చైర్మన్‌ను ఎన్నుకోవాలని కూడా నిబంధనలో ఉందంటూ ప్రస్తావించారు. దీనిపై కాంగ్రెస్‌ సభ్యులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ప్రతి సభ్యుడికీ ఎన్నిక ప్రక్రియపై సమాచారం అందించామన్నారు. ఎన్నిక ప్రక్రియ సరిగా లేదంటున్న కాంగ్రెస్‌ తన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. పోటీలో ఉంటున్నారంటే ఎన్నికల ప్రక్రియ సమంజసమేనని కాంగ్రెస్‌ అంగీకరించినట్లే కదా అని అన్నారు. ప్రజాస్వామ్యాయుతంగా ఎన్నిక నిర్వహించి పెద్దల సభ గౌరవం పెరిగేలా చూడాలని ప్రతిపక్ష సభ్యులను కోరారు. దీనిపై డీఎస్‌ స్పందిస్తూ గవర్నర్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారంటున్న హరీశ్‌రావుకు చైర్మన్‌ ఎన్నికపై ప్రభుత్వం సిఫార్సు చేసిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. గవర్నర్‌ ఎప్పుడూ ప్రభుత్వ సూచనలను బట్టే నిర్ణయం తీసుకుంటారన్నారు. ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌కు కూడా తాము ఫిర్యాదు చేశామని అయితే, ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే తాము నామినేషన్‌ వేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిని కాపాడేందుకే రహస్య బ్యాలెట్‌ పద్ధతిని ప్రవేశపెట్టారని విమర్శించారు. తమ వాణిని వినిపించాలన్న ఉద్దేశ్యంతోనే తాము నామినేషన్‌ వేశామని చెప్పారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా వ్యవహరించొద్దన్నారు. అధికార పక్షం సభను హైజాక్‌ చేస్తోందని షబ్బీర్‌ అలీ విమర్శించారు. చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మంత్రులు సభకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

గందరగోళం, తోపులాట

అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతుండగానే చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రాజాసదారాం అక్షర క్రమంలో పేర్లను చదవడం మొదలుపెట్టారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత డీఎస్‌ పేరును పిలవగా ఆయన వెళ్లలేదు. గందరగోళం మధ్య ఎన్నిక నిర్వహించంపై కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. పేపర్లు చించి సెక్రటరీ జనరల్‌పై విసిరేశారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్లోకి వచ్చి ప్రతిపక్ష పార్టీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బహిష్కరించిన కాంగ్రెస్‌, టీడీపీ

పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కడంతో డీఎస్‌ జోక్యం చేసుకున్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ ఎన్నికలకు నిరసనగా తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. అలాగే, ప్రభుత్వ తీరుకు నిరసనగా చైర్మన్‌ ఎన్నికను బహిష్కరిస్తున్నామని చెప్పి సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకు ముందే టీడీపీ కూడా ఓటింగ్‌ను బహిష్కరించింది. చైర్మన్‌ ఎన్నికపై అధికార, ప్రధాన ప్రతిపక్షాలు రెండూ తప్పు చేశాయని.. అందుకే ఆ ప్రక్రియలో తాము భాగస్వామ్యం కాదలుచుకోలేదని పేర్కొంది. రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ పద్ధతి ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. ఓటింగ్‌ను బహిష్కరించాలన్న కాంగ్రెస్‌ నిర్ణయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీలు తిరస్కరించారు. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు విప్‌ను ధిక్కరించి టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, యాదవరెడ్డి, రాజేశ్వరరావులతో పాటు ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన కేఆర్‌ ఆమోస్‌, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాదరావు, భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతివ్వడం విశేషం.

తట్టుకోలేని ఉద్వేగానికి లోనౌతున్న సందర్భం ఇది, ఆనందబాష్పాలు రాలుతున్న క్షణాలివి అని శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. మండలి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాక సభ్యులు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ బోనాలు, రంజాన్‌ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అందరి సహకారంతో సభను హుందాగా నడపడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. చెప్రాసిగా ఉన్న నన్ను శాసనమండలి చైర్మన్‌ చేసిన ఘనత ప్రజాస్వామ్యానిదేనన్నారు. రాజకీయాల్లో తాను పసిబాలుడినని తెలిపారు. మండలి నిర్వహణకు అందరి సహకారం కావాలని కోరారు. శాసనమండలి హుందాగా నడిచేలా తన వంతు కృషి చేస్తానన్నారు. అందరం తెలంగాణ ప్రజల అభివృద్ధికి పాటుపడదామన్నారు. నేను, విూరు అనే పదాలను మర్చిపోయి మనమందరం కలిసి ముందుకు నడుద్దామన్నారు. చైర్మన్‌గా తన విధి నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తానని స్వామిగౌడ్‌ అన్నారు. కలిసి పనిచేసి, దేశంలోనే తెలంగాణ శాసనమండలి ఆదర్శంగా ఉండేలా చూద్దామన్నారు. హుందాగా వ్యవహరిద్దామన్నారు. ఇదిలావుంటే నియమ నిబంధనల మేరకే తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ ఎన్నిక జరిగిందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల సమాచారం జూన్‌ 29 నాడే సభ్యులు అందరికీ పంపినట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్‌ ప్రకారం ఎన్నిక జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. సభాగౌరవం పెరుగుతందంటే నిబంధనలు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమని హరీశ్‌రావు తెలిపారు. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి లద్ఘిర్మన్‌ అవుతుంటే సంతోషించాలన్నారు. మండలి ప్రొసీజర్‌ను కూడా కొందరు వక్రీకరించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. మండలి చైర్మన్‌ ఎన్నికకు సహకరించిన వారందరికీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మండలి చైర్మన్‌ ఎన్నిక సభ నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. మండలి ప్రొసీజర్‌ను కొందరు వక్రీకరించారని ఎద్దేవా చేశారు. పెద్దల సభను అగౌరవ పరిచేలా కాంగ్రెస్‌ సభ్యులు ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఓటింగ్‌ ప్రారంభమైన తరువాత పోటీ నుంచి విత్‌డ్రా చేసుకుంటామని డీఎస్‌ చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ మొదటి శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్నికైన స్వామిగౌడ్‌కు మంత్రి ఈటెల రాజేందర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల జనుల సమ్మెలో స్వామిగౌడ్‌ పాత్ర మరువలేనిదన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌గా, శాసనమండలిలో ఛైర్మన్‌గా బలహీనవర్గాలకు చెందిన నేతలనే ఎన్నుకున్న ఘనత టీఆర్‌ఎస్‌ సర్కార్‌దని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో చట్ట సభలు వేదికగా ఉండాలని సూచించారు. పెద్దల సభలో ఉన్నవాళ్లు ప్రజల అభిప్రాయాలను ఆవిష్కరించాలని కోరారు. అవసరమైతే ప్రజాసమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీని, మండలిని ఎన్నిసార్లయినా సమావేశపరుస్తమని వెల్లడించారు