మెదక్‌, కరీంనగర్‌ ఇక ఉక్కు నగరాలు

5

ఐరన్‌ ఓర్‌ పెల్లెట్స్‌ యూనిట్ల ఏర్పాటు

ఆస్ట్రేలియాకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్‌ కస్సారిడేటెడ్‌ కంపెనీ ముందుకు

ప్రతినిధులతో చర్చించిన కేసీఆర్‌

హైదరాబాద్‌, జులై 2 (జనంసాక్షి) :

మెదక్‌, కరీంనగర్‌లను ఉక్కు నగరాలుగా తీర్చిదిద్దుతామని, ప్రైవేటు భాగస్వామ్యంతో ఉక్కు పరిశ్రమలు నెలకొల్పుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలోని సిద్దిపేటలో రూ.1000 కోట్ల పెట్టుబడితో ఐరన్‌ ఓర్‌, పెల్లెట్స్‌ తయారీ యూనిట్లను స్థాపించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్‌ కస్సారిడేటెడ్‌ కంపెనీ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆ కంపెనీ డైరెక్టర్‌ ప్రియాన్‌ కలిశారు. ఈ సందర్భంగా ఐరన్‌ ఓర్‌ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రంలో లభించే ఐర్‌ ఓర్‌ సాంద్రత 25 నుండి 30శాతం మాత్రమే ఉన్నదని, దీన్ని 65 శాతానికి పెంచే ఐరన్‌ ఓర్‌ను ఉక్కు పరిశ్రమలకు ఉపయోగించే విధంగా మారుస్తామని చెప్పారు. ఇప్పటికే కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో దాదాపు 200 మిలియన్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ ఉన్నట్టు వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. కరీంనగర్‌ జిల్లా ఆత్మకూరులో, సిద్దిపేట పరిశ్రమ ప్రాంతాల్లో పెల్లెట్స్‌ తయారీ యూనిట్లు ప్రారంభించాలని అనుకున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మొదటి దశలో వెయ్యి కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తామని, దీనికిసంపూర్ణ సహకారం అందించాలని కేసీఆర్‌ను కోరారు. ఇందుకు కేసీఆర్‌ సానుకూలంగా స్పందిస్తూ, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకునే చర్యలను వివరించారు. వనరులను సద్వినియోగం చేసుకోవడం, యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పారిశ్రామికీకరణ ఉంటుందని అన్నారు. పారిశ్రామిక విధానం కూడా పూర్తి పారదర్శకంగా, సరళంగా ఉంటుందని అన్నారు. పరిశ్రమను స్నేహపూరిత వాతావరణంలో ఏర్పాటు చేస్తామని అన్నారు. పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చిన కంపెనీ ప్రతినిధులను కేసీఆర్‌ అభినందించారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారాలు ఉంటాయని అన్నారు. బొగ్గు మాదిరిగానే పలుచోట్ల ఐరన్‌ ఓర్‌ ఖనిజ సంపద ఉందని, వాటిని ఉపయోగించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంవల్ల పారిశ్రామిక వ్యక్తులతో పాటు యువతకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ రెండు జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు చేయడంవల్ల వెయ్యిమందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.