పోలవరం ముమ్మాటికీ మనల్ని ముంచే ప్రాజెక్టే
గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలకు ఒప్పుకోవద్దు
తెలంగాణపై ఎవరి పెత్తనాన్ని సహించం
టీఆర్‌ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్, జూలై 6 (జనంసాక్షి) :
పోలవరం ముమ్మాటికీ తెలంగాణాను ముంచే ప్రాజెక్టేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలు పేర్కొంటూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో విలీనం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం అజ్రాస్వామికమని, ఆ బిల్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడితే అడ్డుకోవాలంటూ టీఆర్‌ఎస్ ఎంపీలకు దిశా నిర్దేశనం చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన బిల్లును పార్లమెంట్ ముందుకు రాకుండా అడ్డుకోవాలని ఆయన పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్థానిక ప్రజల మనోభీష్టాలకు వ్యతిరేకంగా పోలవరం ముంపుపేర ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగా విరుద్ధమని, పార్లమెంట్‌లో ఆర్డినెన్స్ స్థానంలో ఆ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తేవాలని కేంద్రం నిర్ణయం తీసుకుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలాగైనా పోలవరం బిల్లును పార్లమెంట్ ముందుకు రానివ్వకుండా చేయాలని ఆయన ఎంపీలను కోరారు. తెలంగాణాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరుతూ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఆయన ఎంపీలకు సూచించారు. తెలంగాణాకు ప్రత్యేక హోదా కల్పించేందుకు కృషి చేయాలని కూడా కేసీఆర్ ఎంపీలను కోరినట్లు తెలుస్తోంది. ఏదేమైనా, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ఎంపీలు పార్లమెంట్‌లో వ్యవహరించాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్‌పై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలను ఒప్పుకోబోమని, ఇందుకు సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్‌లో అడ్డుకొని తెలంగాణ ప్రజల పక్షాన నిరసన తెలపాలని ఉద్బోధించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదని, దాన్ని తెలిసివచ్చేలా చేయలంటూ ఎంపీలకు ఉపదేశించారు. హైదరాబాద్‌లో కామన్ పోలీసింగ్ అభ్యంతరకరమని ఆయన అన్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక నిర్ణయాలను చాటి చెప్పాలని సూచించారు. గవర్నర్ నేతృత్వంలోని ప్రత్యేక బోర్డుకు పోలీసులు, అధికారుల బదిలీల అధికారాన్ని కట్టబెట్టడాన్ని నిలదీయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయమై పోరాడాలని ఎంపీలను కోరారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డితో పాటు వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, విశ్వేశ్వరరెడ్డి, మహేష్, బీబీ పాటిల్, బాల్క సుమన్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని దాన్ని పార్లమెంట్‌లో ఎండగడతామని అన్నారు.