రైల్వేల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

COVER 9

ప్రైవేటు రంగానికి పెద్దపీట

భద్రతకు ప్రాధాన్యం

అహ్మదాబాద్‌-ఢిల్లీ బుల్లెట్‌ ఎక్స్‌ప్రెస్‌

రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సదానందగౌడ

దూరదృష్టితో కూడిన బడ్జెట్‌ ఇది : ప్రధాని నరేంద్రమోడీ

పెదవి విరిచిన విపక్షాలు

న్యూఢిల్లీ, జూలై 8 (జనంసాక్షి) :

‘స్వదేశీ’ పాలకులు మన రైల్వేల్లోకి విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అంటూ ప్రైవేటు రంగానికి పెద్దపీట వేసేందుకు సిద్ధపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వ తొలి రైల్వే బడ్జెట్‌ ఊరించి ఉసూరుమనిపించింది. బడ్జెట్‌లో సామాన్యులకు పెద్దగా ఉపయోగపడే నిర్ణయాలేవీ లేవు. కేవలం ఆధునికీరణకు ప్రాధాన్యమిచ్చింది. రక్షణ, వేగం, భద్రత (సేఫ్టీ, స్పీడ్‌, సెక్యూరిటీ)లకు పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో తొలి బుల్లెట్‌ రైలు అహ్మదాబాద్‌-ముంబై మధ్య పట్టాలెక్కించనున్నట్లు తెలిపింది. అలాగే సెమీ బుల్లెట్‌, హైస్పీడ్‌ రైళ్ల ఏర్పాటు, కొత్త రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. కొత్తగా 5 జనసాధారణ్‌, 5 ప్రీమియం,  27 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొంది. కొత్తగా ఆరు ఏసీ, ఎనిమిది ప్యాసింజర్‌, రెండు మెమూ, ఐదు డెమూ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. నూతన రైల్వే మార్గాలు వంటి వాటిపై బడ్జెట్‌లో నామమాత్రంగానే ప్రస్తావించింది. ఇటీవలే రైలు ప్రయాణికులపై చార్జీల భారం మోపిన కేంద్రం ఆ మేరకు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొంది. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, వసతుల కల్పనకు ప్రైవేట్‌ పెట్టుబడులు ఆహ్వానించనున్నట్లు వెల్లడించింది. రైల్వే బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముద్ర స్పష్టంగా కనిపించింది. హైస్పీడ్‌ రైళ్లు, స్టేషన్ల ఆధునికీకరణ, రైల్వేలో ఎఫ్‌డీఐలు, ప్రైవేట్‌ పెట్టుబడులు, సోలార్‌ ఎనర్జీ వంటి అంశాలకు బడ్జెట్‌లో చోటు లభించింది. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మౌలిక వసతులు అభివృద్ది చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ ప్రకటించారు. నష్టాల్లో ఉన్నాయని చెబుతూనే చార్జీల భారం తప్పదని సంకేతాలిచ్చారు. ఇంధన చార్జీలకు అనుగుణంగా సరుకు, రవాణా చార్జీలను పెంచుతామని తెలిపారు. రైల్వే భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. అలాగే, రైల్వేల అభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించాల్సి ఉందన్నారు. రైల్వే ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రైవేట్‌ భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూనే భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం సదానందౌడ రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రయాణికులపై భారం మోపడం బాధాకరమే అయినా అనివార్యమని చెప్పారు. రైల్వే అభివృద్ధికి చార్జీల పెంపు సరికాదని.. నిర్వహణ చార్జీలు, నిధుల దుర్వినియోగం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని గౌడ తెలిపారు. 2014-15లో రూ.1,64,374 కోట్లు రైల్వే టర్నోవర్‌ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైల్వే సేవలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. రైల్వే ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద రహితంగా రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమన్నారు. రైళ్లు, రైల్వేస్టేషన్లలో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

ఎఫ్‌డీఐలకు అవకాశం..

రైల్వే అభివృద్ధికి ప్రైవేట్‌ భాగస్వామ్యం తీసుకోనున్నట్లు గౌడ వెల్లడించారు. ఎఫ్‌డీఐలు, పీపీపీలు, పీపీఏల ద్వారా నిధులు సమకూర్చుకోనున్నట్లు చెప్పారు. రైల్వే అభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు అనుమతించాలని కోరారు. అయితే, రైల్వే నిర్వహణ మినహా మిగతా అంశాల్లో మాత్రమే ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎఫ్‌డీఐలపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అలాగే పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో రైల్వే మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్‌ పెట్టుబడులకు అవకాశం కల్పించాలన్నారు. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో స్టేషన్లలో ఎస్కలేటర్లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నట్లు చెప్పారు. సీనియర్‌ సిటిజన్ల కోసం బ్యాటరీ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్పీఎఫ్‌ సిబ్బందికి సెల్‌ఫోన్లు అందించనున్నట్లు చెప్పారు.

58 కొత్త రైళ్లు..

దేశవ్యాప్తంగా కొత్తగా 5 జనసాధారణ్‌, 5 ప్రీమియం,  27 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కొత్తగా ఆరు ఏసీ, ఎనిమిది ప్యాసింజర్‌, 2 మెమూ, 5 డెమూ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అన్ని మెట్రో నగరాలను కలుపుతూ వజ్ర చతుర్భుజి రైల్వే లైన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అహ్మదాబాద్‌-దర్భాంగా వయా సూరత్‌, జయనగర్‌-ముంబై, ముంబై-గోరఖ్‌పూర్‌, సహరస-ఆనంద్‌ విహార్‌ వయా మోతిహరి, సహస్ర-అమృత్‌సర్‌ మధ్య జనసాధారణ్‌ రైల్లు నడపనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-చండీగఢ్‌, ఢిల్లీ-కాన్పూర్‌లకు హైస్పీడ్‌ రైల్లు ప్రవేశ పెడతామన్నారు. సికింద్రాబాద్‌-నాగాపూర్‌, చెన్నై-హైదరాబాద్‌ మధ్య సెవిూ బుల్లెట్‌ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌- హజ్రత్‌ నిజాముద్దీన్‌ మధ్య కొత్తగా ప్రీమియం రైలు, విజయవాడ-న్యూఢిల్లీ మధ్య ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే యశ్వంత్‌పూర్‌-గుంటూరు మధ్య డైలీ ఎక్స్‌ప్రెస్‌ విశాఖ-చెన్నై, పారదీప్‌-విశాఖ మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశపెడతామన్నారు. అహ్మదాబాద్‌-పాట్నా, బీదర్‌-ముంబై, చాప్రా-లక్నో, ఫిరోజ్‌పూర్‌-చండీగఢ్‌ కొత్త రైళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.

బుకింగ్‌ విధానంలో సమూల మార్పులు

రైల్వే రిజర్వేషన్‌ విధానంలో సమూలు మార్పులు తెస్తామని మంత్రి తెలిపారు. ఇంటర్నెట్‌ బుకింగ్‌ను పటిష్టం చేస్తామని, ఈ-టికెటింగ్‌ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. ఆన్‌లైన్‌ టికెట్ల ఆధునికీకరణపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. రైల్వే రిజర్వేషన్‌ విధానాన్ని మారుస్తామని తెలిపారు. నిమిషానికి 7,200 టికెట్లు ఇచ్చే విధంగా ఈ-టికెటింగ్‌ విధానాన్ని మారుస్తామన్నారు. అధునాతన టెక్నాలజీతో రిజర్వేషన్‌ విధానంలో మార్పు తెస్తామన్నారు. పోస్టాఫీసులు, మొబైల్‌ ఫోన్ల ద్వారా రిజర్వేషన్‌ చేసుకొనే విధానానికి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఆన్‌లైన్‌లో ప్లాట్‌ఫాం, పార్కింగ్‌ టికెట్‌ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

సరుకు రవాణాకు ప్రాధాన్యం

ప్రస్తుతం 31 శాతం సరుకు రవాణా మాత్రమే చేస్తున్నామని.. సరుకు రవాణాలో అగ్రగామిగా నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రపంచంలోనే మనది అతిపెద్ద రైల్వే అని రక్షణ సామగ్రి, సరుకు రవాణాలో రైల్వేది కీలక పాత్ర అని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మ వంటిదని సరుకు రవాణాలో చైనా, రష్యాలాంటి దేశాల తర్వాత మనమే ఉన్నామని గుర్తు చేశారు. సరుకు రవాణాలో ప్రపంచంలోనే మన రైల్వేను నెంబర్‌వన్‌గా నిలబెట్టాలన్నదే లక్ష్యమన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్న భారత రైల్వేను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

చార్జీల పెంపుపై సంకేతాలు

రోజుకూ 2.3 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నా ఇంకా ప్రయాణికుల అవసరాలను తీర్చడంలో సఫలం కాలేకపోతున్నామని అంగీకరించారు. ప్రజలు సుఖంగా ఉంటేనే రాజ్యం సుఖంగా ఉంటుందన్న కౌటిల్యుడి వ్యాఖ్యలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. ధరలపై నిర్ణీత కాలావధిలో సవిూక్ష నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. సరుకు రవాణ చార్జీలను ఇంధన చార్జీలకు అనుగుణంగా పెంచుతామని చెప్పారు. లాభార్జన తమ ప్రభుత్వ లక్ష్యం కాదని చెప్పారు. అయితే, అనివార్యం కావడం వల్లే చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. మందు చేదుగా ఉన్నా ఫలితం తీయగా ఉంటుందంటూ చార్జీల పెంపును సమర్థించుకున్నారు. చార్జీల పెంపు బాధే అయినా అనివార్యమని తెలిపారు. చార్జీల పెంపు వల్ల రూ.8 వేల కోట్ల ఆదాయం లభిస్తుందన్నారు. కేవలం చార్జీల పెంపు వల్ల రైల్వే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. సామాజిక బాధ్యతను విస్మరించలేం. అలాగని ప్రజలపై భారం మోపలేమని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది రూ.602 కోట్ల మిగులు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రతి రూపాయి ఆదాయంలో 94 పైసలు రైల్వే అభివృద్ధికి కేటాయిస్తున్నామన్నారు. 1.16 కిలోమీటర్ల విస్తీర్ణంలో 13 లక్షలకు పైగా ఉద్యోగులతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే పదేళ్లలో రైల్వే అభివృద్ధికి 5 లక్షల కోట్లు అవసరమని చెప్పారు.

యూపీఏ నిర్వాకమే..

గత ప్రభుత్వ విధానాల వల్లే రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తమైందని మంత్రి సదానందగౌడ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం పనులు మంజూరు చేసింది పనులను పక్కన పెట్టిందని విమర్శించారు. 676 ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తయ్యాయన్నారు. 99 లైన్లు మంజూరు చేస్తే ఒక్క లైను మాత్రమే పూర్తి చేసిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల ఆమోదం పైనే దృష్టి తప్ప పూర్తిపై దృష్టి కొరవడిందన్న గౌడ ఏడాదిలోగా రైల్వేను గాడిలో పెడతామని చెప్పారు. వచ్చే పదేళ్లలో రైల్వే ఆధునికీకరణకు 5 లక్షల కోట్లు అవసరమని తెలిపారు. హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతామని తెలిపారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే లైన్ల అనుసంధానం చేస్తామని తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి దృష్టి సారిస్తామన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి 1.82 లక్షల కోట్లు అవసరమని తెలిపారు. ట్రాక్‌ డబ్లింగ్‌, ట్రిబ్లింగ్‌ ద్వారా రైల్వే పనితీరును మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రమాదాల నివారణకు ఆటోమేటిక్‌ డోర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

ముంబై-అహ్మదాబాద్‌ మధ్య ‘బుల్లెట్‌’

సామాజిక బాధ్యత, వ్యాపార నిర్వహణ రైల్వే అభివృద్ధికి ఈ రెండు తన ముందున్న సవాళ్లు అని సదానందగౌడ్‌ అన్నారు. త్వరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సాంకేతిక, సాంకేతికేతకర విద్యతో కూడిన యూనివర్సటీని స్థాపిస్తామన్నారు. బెంగళూరులో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. ముంబై-అహ్మదాబాద్‌ మార్గంలో బుల్లెట్‌ రైలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే, నాగపూర్‌-సికింద్రాబాద్‌ సహా ఐదు మార్గాల్లో హైస్పీడ్‌ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. హైస్పీడ్‌ రైళ్లకు రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు వివరించారు. నిర్దేశిత మార్గాల్లో రైళ్ల స్పీడ్‌ను 160 నుంచి 200 కిలోమీటర్లకు పెంచుతామన్నారు. స్వర్ణ చతుర్భుజి స్ఫూర్తితో హైస్పీడ్‌ రైళ్ల నెట్‌వర్క్‌

ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తెలంగాణ, ఏపీలపై ప్రత్యేక దృష్టి

రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రైల్వేల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు గౌడ తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్న గౌడ నూతన ప్రాజెక్టుల స్థాపనపై కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రాష్ట్రాలలోని 29 పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి 20,680 కోట్లు అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు కొత్త రైళ్లను రెండు రాష్ట్రాలకు కేటాయించారు. నాగపూర్‌-సికింద్రాబాద్‌, చెన్నై-హైదరాబాద్‌ మధ్య సెమీ బుల్లెట్‌ రైలు, సికింద్రాబాద్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌ ప్రీమియం రైలు, విశాఖ-చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, పారాదీప్‌-విశాఖ డెయిలీ ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

మరిన్ని కీలక నిర్ణయాలు..

– స్వచ్ఛంద సంస్థలకు ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఆర్‌వో నిర్వహణ బాధ్యత

– దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వేల ఏర్పాటు

– ఏ, ఏ-1 స్థాయి రైళ్లు, స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం

– పరిశుభ్రత కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు, శానిటేషన్‌ పర్యవేక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు

– ఎకో టూరిజానికి ప్రాధాన్యం

– రైల్వే కేటరింగ్‌ సర్వీస్‌ నాణ్యతను పెంచేందుకు కృషి

– ప్రయాణికులకు అపరిశుభ్ర ఆహారం అందిస్తే కఠిన చర్యలు

– భద్రతకు ప్రాధాన్యం. భద్రత కోసం 17 వేల కానిస్టేబుళ్లు, 4 వేల మంది మహిళా సీఆర్పీఎఫ్‌ సిబ్బంది నియామకం

– మెట్రోనగరాల్లోని 10 ప్రధాన స్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాలు ఏర్పాటు

– అన్ని రైల్వే స్టేషన్లలో విశ్రాంతి గదులు ఏర్పాట్లు

– రాబోయే ఐదేళ్లలో పేపర్‌లెస్‌ ఆఫీస్‌ల స్థాపన

– కాపలా లేని 5,400 క్రాసింగ్‌ల వద్ద ప్రత్యేక చర్యలు

– రైల్వే ఆస్తుల పరిరక్షణకు స్టేషన్ల చుట్టూ ప్రహరీల నిర్మాణం

– రైల్వే నిర్వహణలో ఆలస్యం లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

– రైల్వేలు, స్టేషన్లకు సోలార్‌ విద్యుత్‌ వినియోగం

– సీసీ కెమెరాల ద్వారా నిఘా

– ప్రత్యేక రైల్వే ట్యాంకర్ల బోగీల ద్వారా పాల రవాణ

– రైల్వేలో సౌర విద్యుత్‌ వినియోగానికి ప్రాధాన్యం, రైల్వే రూఫ్‌టాప్‌లపై సోలార్‌ పలకాల ఏర్పాటు

– సత్వరమే ప్రాజెక్టుల పూర్తికిగా ప్రత్యేక విభాగం ఏర్పాటు

ఈ బడ్జెట్‌ దూరదృష్టితో కూడినది ప్రధాని నరేంద్రమోడీ కితాబిచ్చారు. దేశాభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన అన్నారు. జనాకర్షక విధానాలు అనుసరిస్తే దేశం ఆర్థికంగా మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోందని, కాబట్టి ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలకు కాస్త ఇబ్బంది కలిగిన తప్పదన్నారు. రైల్వే బడ్జెట్‌పై విపక్షాలు పెదవి విరిచాయి. సదానందగౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్త అంశాలేవీ లేవని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం అంకెలతో ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించాయి. ప్రయాణికులు, సరుకురవాణాదారులపై భారీ వడ్డనకు దిగిన సర్కారు మున్ముందు కూడా చార్జీలను పెంచనున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చిందని తెలిపారు.