నగరంలో విలువైన భూములు హాంఫట్‌

` 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్‌ పాలసీ
` రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న సిఎం రేవంత్‌
` రాత్రికి రాత్రే బిలియనీర్‌ కావాలన్న లక్ష్యంతో కదుపుతున్న పావులు: కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): సిఎం రేవంత్‌ రెడ్డి అవినీతి కోసమే హిల్ట్‌ పాలసీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్‌ పాలసీ అని అన్నారు. విద్యార్థులు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్‌ సర్కార్‌ హిల్ట్‌ పాలసీకి నిర్ణయం తీసుకుందని కేటీఆర్‌ అన్నారు. ఒకప్పుడు పరిశ్రమలు, ప్రజల ఉపాధి కోసం ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులు అపార్ట్‌మెంట్లు కడతామంటే ప్రభుత్వం అనుమతినిస్తోందని తెలిపారు. దాదాపు 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్‌ పాలసీని తీసుకొస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. దాదాపు ఆ భూములన్నింటికీ రేవంత్‌ సోదరులు, అనుయాయులు ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొన్నారు. లక్షన్నర గజం విలువ చేసే భూమికి 10 వేలు కడితే చాలని పాలసీ తెచ్చారని తెలిపారు. పారిశ్రామిక వాడల భూములను అమ్మి 4`5లక్షల కోట్ల కుంభకోణం చేయాలని చూస్తున్నాడని అన్నారు. అంబానీ, అదానీలను ఒకే దెబ్బకు క్రాస్‌ చేయాలని రేవంత్‌ రెడ్డి స్కెచ్‌ వేశారని తెలిపారు. రేవంత్‌ రెడ్డి మనుమలు, మునిమలు కూర్చొని తిన్నా కూడా అరిగిపోని ఆస్తిని వెనకేసుకోవాలని ఈ స్కామ్‌కు తెరతీశాడని చెప్పారు. 50`60 ఏళ్లుగా హైదరాబాద్‌లో 21 పారిశ్రామికవాడలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ప్రజల భూములు తీసుకుని ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చిందని చెప్పారు. నగరం విస్తరిస్తున్న కొద్దీ పరిశ్రమలు మధ్యలోకి వచ్చాయని తెలిపారు. మేం అధికారంలో ఉన్నప్పుడు కూడా పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్‌ ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. కాలుష్యం లేని పరిశ్రమలు లేదా కంపెనీలు ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు. అందుకే మేం గ్రిడ్‌ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. గతంలో 50 శాతం ఐటీ ఆఫీసులకు, 50 శాతం ఇతర అవసరాల కోసం ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టినంకనే అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ధారాదత్తం చేస్తోందని అన్నారు. భూదందాపై విద్యార్థి నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హిల్ట్‌ పాలసీపై కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నిలదీశారని కేటీఆర్‌ గుర్తుచేశారు.తెలంగాణ వనరులను కాపాడుకునే బాధ్యత విద్యార్థులకు కూడా ఉందని తెలిపారు. విద్య, ఉపాధి, కాంట్రాక్టులు, రాజకీయాల్లో 42 శాతం కోటా ఇస్తామని కాంగ్రెస్‌ హావిూ ఇచ్చారని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు కాంగ్రెస్‌ అనేక హావిూలిచ్చిందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు కోర్టు ఆపింది.. మిగతావి ఎవరు ఆపారని ప్రశ్నించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే ముస్లింలందరికీ న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. ముస్లింలకు 4 వేల కోట్లు బ్జడెట్‌లో పెడతామని.. పెట్టలేదని మండిపడ్డారు.తెలంగాణపై బీఆర్‌ఎస్‌కు ఉన్న ప్రేమ ఏ పార్టీకి ఉండదని కేటీఆర్‌ అన్నారు. తెచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని పేర్కొన్నారు. తెలంగాణ వనరులను కాపాడుకునే బాధ్యత విద్యార్థులకు కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ అరాచకాలపై విద్యార్థి రణభేరీ మోగించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. నాయకులు సమాజం నుంచి వస్తారు.. నాయకుల చుట్టూ తిరిగితే నాయకులు కారని వ్యాఖ్యానించారు.