హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం

పారదర్శక ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీ – డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్ (జనంసాక్షి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పాలసీ లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ చేసిందని, ఆ వివరాలన్నీ త్వరలో ప్రజల ముందుంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అలాంటి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో కొత్త ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడం, పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించడం, ప్రజలపై పన్ను భారం మోపకుండానే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూర్చడం ఈ పాలసీ ముఖ్య లక్ష్యాలు. 50 శాతం SOR రేటుతో అందరికీ సమాన అవకాశం కల్పిస్తూ ఈ పాలసీని అమలు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
నాచారం, మౌలాలి, కూకట్పల్లి, బాలానగర్, ఉప్పల్, జీడిమెట్ల వంటి ప్రాంతాలు ఐదు దశాబ్దాల క్రితం నగరం బయట ఉండేవి. అప్పటి ప్రభుత్వాలు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశాయి. కానీ హైదరాబాద్ విశాలంగా విస్తరించడంతో ఈ పరిశ్రమలు ఇప్పుడు నగర మధ్యలోకి వచ్చేశాయి. ఫలితంగా ఈ ప్రాంతాలన్నీ రెడ్, ఆరెంజ్ జోన్లుగా మారాయి. కోర్టులు కూడా ఈ జోన్ల నుంచి పరిశ్రమలను తరలించాలని ఆదేశించాయి. ఎవరినీ ఒత్తిడి చేసి బయటికి పంపలేమని, కాబట్టి స్వచ్ఛందంగా కన్వర్షన్ చేసుకునే అవకాశం ఇస్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్కుల చుట్టూ లక్షలాది ఇళ్లు వచ్చేశాయి. ఇక్కడే పరిశ్రమలు కొనసాగితే ఢిల్లీలా హైదరాబాద్‌లోనూ పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితి రాకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అని, అందుకే పారదర్శకంగా సమగ్ర ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చి, పేదల కోసం సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా అమలు చేయడానికి అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.