డబ్ల్యూపీఎల్ వేలంలో శిఖా పాండే భారీ ధర

డబ్ల్యూపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని విధంగా శిఖా పాండే భారీ ధర పలికింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ప్రైజ్‌ పట్టేసిన భారత క్రికెటర్ ఆమెనే. ఈ మెగా టోర్నీలో మూడు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన శిఖా కోసం వేలంలో ఫ్రాంచైజీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడించింది. విదేశీ లీగ్స్‌(బిగ్‌బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, విమెన్స్ సూపర్ స్మాష్)లో ఆడుతూ మంచి ఫామ్‌లో ఉన్న ఆమెను చివరకు యూపీ వారియర్స్ రూ.2.40 కోట్లకు దక్కించుకుంది. నాలుగో సీజన్‌లో కొత్త జట్టుకు ఆడడంపై శిఖా సంతోషం వ్యక్తం చేసిందివేలం గురించి నిన్నటి నుంచి ఆసక్తిగా ఎదురుచూశా. అయితే.. ఏం జరిగితే అది జరుగుతుందని మనసుకు సర్ధి చెప్పాను. గత మూడు సీజన్లు నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు యూపీ వారియర్స్ ఫ్యామిలీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. కొత్తటీమ్‌కు ఆడనుండడం కచ్చితంగా సరికొత్త ఫీలింగ్. డబ్ల్యూపీఎల్‌లో మూడేళ్లు నాకు అవకాశం కల్పించిన ఢిల్లీ ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు. ఇక యూపీలోని చాలామందితో నేను కలిసి ఆడాను. మేగ్ లానింగ్‌కు కెప్టెన్సీ ఇస్తారని అనుకుంటున్నా’ అని 36 ఏళ్ల శిఖా చెప్పింది. డబ్ల్యూపీఎల్‌లో బౌలింగ్ రికార్డు విషయానికొస్తే ఆరో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచింది శిఖా. మూడు సీజన్లలో ఢిల్లీ తరఫున 27 మ్యాచులు ఆడిన తను 30 వికెట్లు తీసింది.కరీంనగర్‌లోని రామగుండంలో జన్మించిన శిఖా.. హిందీ టీచర్ తండ్రి సుభాష్‌ పాండే కు గోవాకు బదిలీ కావడంతో అక్కడే పెరిగింది. గోవా తరఫునే అంతరాష్ట్ర టోర్నీల్లో ఆడిన ఆమె.. ఆ తర్వాత కెప్టెన్‌గా ఎదిగింది. దేశవాళీలో మెరిసిన శిఖా 2014లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసింది. తద్వారా గోవా నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. తొమ్మిదేళ్లపాటు భారత క్రికెట్‌కు విశేష సేవలందించిందీ మీడియం పేసర్. రెండేళ్ల క్రితం చివరిసారి టీమిండియా జెర్సీ వేసుకున్న ఆమె ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్‌లో రాణిస్తోంది. ఆటలోనే కాదు చదువులోనూ తను చురుకైన విద్యార్థే. గోవాలోనే ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన శిఖా.. తర్వాత భారత వైమానిక దళంలోనూ కొన్నాళ్లు పనిచేసింది.

.